breaking news
vunnam Venkaiah
-
‘కృష్ణా’లో యువజనోత్సవాలు
చిలకలపూడి (మచిలీపట్నం) : విద్యార్థుల్లో ఉత్తేజాన్ని పెంచేందుకు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు కృష్ణా తరంగ్-2014 పేరుతో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వున్నం వెంకయ్య తెలిపారు. వర్శిటీలోని చాంబర్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఆడిటోరియంలో యువజనోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొంటారని చెప్పారు. మూడు రోజుల పాటు మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్లు, థియేటర్, ఫైన్ ఆర్ట్స్, ఇన్స్టాలేషన్ రంగాల్లో మొత్తం 26 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వెయ్యిమందికి పైగా విద్యార్థులు 20 కళాశాలల నుంచి వస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తామని, అన్ని అంశాలు కలిపి 216 బహుమతులు ఉంటాయని వివరించారు. యువజనోత్సవాల్లో పాల్గొని మొదటి బహుమతులు సాధించిన విద్యార్థులు డిసెంబరు 8వ తేదీన కర్ణాటకలోని తుంపూర్లో జరగనున్న సౌత్ జోన్ కాంపిటేషన్ పాల్గొంటారన్నారు. ఈ నెల 15 సాయంత్రం 5 గంటలకు పోటీల ముగింపు కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఎల్.వేణుగోపాలరెడ్డి ముఖ్య అతిథిగా, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.వియన్నారావు విశిష్ట అతిథిగా, కృష్ణా విశ్వవిద్యాలయం సైన్స్ ఫ్యాకల్టీ ఎంవీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వైకే సుందరకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. యువజనోత్సవాల్లో పాల్గొనే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లిస్తామని, బందరులో మూడు రోజుల పాటు భోజన, వసతి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 కమిటీలు నియమించినట్లు వీసీ తెలిపారు. ఫిబ్రవరిలో కొత్త భవన నిర్మాణం ఫిబ్రవరిలో కృష్ణా విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెంకయ్య తెలిపారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున నిధులు చెల్లించటం జరిగిందన్నారు. రూ.70 కోట్లు పైబడి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండటంతో సీపీ డబ్ల్యూడీ ఢిల్లీలోని కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు ఆరువారాల సమయం పడుతుందన్నారు. ఢిల్లీలోని కార్యాలయంలో వర్క్స్ బోర్డ్ సమావేశంలో అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీసీ వెంకయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, వైకే సుందరకృష్ణ, పీఆర్వో వినయ్‌కుమార్ పాల్గొన్నారు. -
1న కేయూ ద్వితీయ స్నాతకోత్సవం
గవర్నర్ నరసింహన్ రాక వీసీ వెంకయ్య మచిలీపట్నం : కృష్ణా విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలను 1వ తేదీన నిర్వహించనున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ వున్నం వెంకయ్య తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలోని ఆయన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 4గంటలకు ద్వితీయ స్నాతకోత్సవం ప్రారంభమవుతుందన్నారు. స్నాతకోత్సవ వేడుకలకు కృష్ణా యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ సీఎస్ఎల్.నరసింహన్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ముఖ్యఅతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత జస్టిస్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు పాల్గొంటారన్నారు. స్నాతకోత్సవంలో మొత్తం 16,562 మంది పట్టభద్రులకు సర్టిఫికెట్లు ఇస్తారన్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 2,276 మంది, గ్రాడ్యుయేషన్‌లో 14,286 మందికి పట్టాలు అందిస్తామన్నారు. ఈ స్నాతకోత్సవంలో ముగ్గురికి ముఖ్యఅతిథి చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. గూడపాటి మంగరాజు అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను కొల్లూరి కల్పనకు, కోటేశ్వరరావు అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను మల్లాది దీప్తికి, సంజిత్‌నాధ్ అందిస్తున్న గోల్డ్‌మెడల్‌ను బండి సుస్మితకు అందజేస్తారని చెప్పారు. పది వారాల్లో భవన నిర్మాణ పనులు... మరో పది వారాల్లో విశ్వవిద్యాలయం భవన నిర్మాణాలు పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వైస్‌చాన్సలర్ వున్నం వెంకయ్య అన్నారు. రూ. 70 కోట్లతో ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ భవనాలు నిర్మించే ప్రాంగణంలో నీటి సౌకర్యం కోసం రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల చెరువును ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించామన్నారు. త్వరలో మచిలీపట్నంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వీసీ తెలిపారు. కృష్ణా యూనవర్సిటీ రిజిష్ట్రార్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు.