ఆహారం వికటించి 67 మంది విద్యార్థులకు ఆస్వస్తత
శ్రీకాకుళం: కస్తూర్బా బాలికల వసతి గృహంలో శనివారం రాత్రి విద్యార్ధులు తిన్న ఆహరం వికటించింది. దీంతో 67 మంది విద్యార్థులు ఆస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల పరిధిలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఆదివారం జరిగింది. వివరాలు.. శనివారం రాత్రి వసతి గృహంలో విద్యార్థులు అన్నం, సాంబార్, బఠాని కూర తిని పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వసతి గృహంలో ఉన్న సుమారుగా 67 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...విద్యార్థులందరికీ వైద్యం అందిస్తామని, మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలిస్తామని చెప్పారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాఠశాల ఆవరణలో ఉన్న మంచినీటిని పరీక్షల కోసం పంపించామన్నారు. కాగా, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
(టెక్కలి)