కొత్త ప్రి-పెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించిన వొడాఫోన్
ఒకే ప్యాక్‌తో అన్ని సేవలు
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తాజాగా కొత్త ప్రి-పెయిడ్ ప్లాన్ ‘ఫ్లెక్స్’ను ఆవిష్కరించింది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్, రోమింగ్ వంటి పలు అంశాలను కోరుకుంటోన్న యూజర్లకి ఈ ప్యాక్ అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంటే ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు వాయిల్స్ కాల్స్, డేటా, రోమింగ్, ఎస్ఎంఎస్లకు వివిధ రకాల రీచార్జ్‌లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్నింటికీ ఒకే రీచార్జ్ సరిపోతుంది.
సాధారణ రీచార్జ్‌కు ఇది కాస్త భిన్నం
ప్రస్తుత రీచార్జ్‌కి కొత్త ఫ్లెక్స్ ప్లాన్‌లో రీచార్జ్‌కి కొంత తేడా ఉంటుంది. అంటే మనం సాధారణంగా రూ.50తో రీచార్జ్ చేసుకుంటే రూ.42 వస్తుందనుకోండి. అయితే ఈ కొత్త ప్లాన్‌లో రీచార్జ్ చేసుకుంటే మనకు ‘ఫ్లెక్స్’ అనే యూనిట్లు వస్తాయి. ఒక ఫ్లెక్స్ యూనిట్.. 1 ఎంబీ డేటా/ఒక ఎస్ఎంఎస్/ఒక ఇన్కమింగ్ కాల్ (రోమింగ్)కు సమానంగా ఉంటుంది. కొన్ని సర్వీసుల (ఎస్టీడీ, రోమింగ్‌లో ఉన్నప్పుడు ఔట్‌గోయింగ్ కాల్స్ వంటివి) ధర ఒక ఫ్లెక్స్ యూనిట్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు. వొడాఫోన్ ఫ్లెక్స్ ప్లాన్‌లో మనం ఏ సర్వీసులను ఉపయోగించినా కూడా వాటికయ్యే వ్యయం ఫ్లెక్స్ యూనిట్ల రూపంలో మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది.
రూ.118తో 325 ఫ్లెక్స్ యూనిట్లు
ఒక యూజర్ వొడాఫోన్ ఫ్లెక్స్ ప్లాన్ కింద రూ.118లతో రీచార్జ్ చేసుకుంటే 325 ఫ్లెక్స్ యూనిట్లను పొందొచ్చు. ఇక రూ.204తో 700 యూనిట్లను, రూ.304తో 1,200 యూనిట్లు, రూ.395తో 1,750 యూనిట్లను పొందొచ్చు. అలాగే రూ.42తో రీచార్జ్ చేసుకుంటే 105 యూనిట్లు, రూ.53తో చేసుకుంటే 138 యూనిట్లు వస్తాయి. కాగా ప్యాక్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఒక నెలలో మిగిలిన యూనిట్లను తర్వాతి నెలకు బదిలీ చేసుకోవచ్చు.