breaking news
visakhapatnam beach road
-
సీ హారియర్ చూసొద్దాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందమైన బీచ్ రోడ్డులో సరదాగా ముందుకెళ్తుంటే.. సాగర గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్‌మెరైన్ దర్శనమిస్తుంది. యుద్ధ సమయంలో గగనతలాన్ని గడగడలాడించిన టీయూ–142 విమానం కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే మరో యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరాన్ని నంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్డులో రూ.40 కోట్లతో సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. సిద్ధంగా.. సీ హారియర్ ► ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్ క్రాఫ్ట్ సందర్శకులను అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి వీక్షకుల మనసు దోచుకుంటోంది. ► సాగర తీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరో స్పేస్ నుంచి కొనుగోలు చేసిన సీ హారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా యుద్ధనౌకలో దాదాపు 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ► దీనిని వీఎంఆర్డీఏ సాగర తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ కోర్టులు.. షాపింగ్ కాంప్లెక్స్‌లు రూ.10 కోట్లతో ఈ మ్యూజియం అభివృద్ధి చేయనున్నారు. మరో రూ.10 కోట్లతో సబ్‌మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ► ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా రూపొందిస్తారు. ► దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అందుబాటులోకి రానుంది. ► రాజీవ్ స్మృతి భవన్ ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉంది. దీన్ని వీఎంఆర్డీఏకు అప్పగించిన వెంటనే టెండర్లకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. సరికొత్త బీచ్‌ను చూస్తారు మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. సీ హారియర్ మ్యూజియం అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం. – పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
రాత్రికి రాత్రే వెలసిన నందమూరి హరికృష్ణ విగ్రహం
ఉన్న పళంగా బీచ్‌రోడ్డులో వెలసిన మూడు విగ్రహాలు జీవీఎంసీ వర్గాల్లో కలకలం రేపాయి.. జోన్–2 అధికారులను విధులకు దూరం చేశాయి. కారణం.. సదరు విగ్రహాల ఏర్పాటు సమాచారం ఉన్నతాధికారులకు తెలియకపోవడం.. అసలు అనుమతులే లేకపోవడం.. శుక్రవారం సాయంత్రం వరకు అక్కడ ఆ విగ్రహాలు కాదు కదా.. వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా మచ్చుకైనా కనిపించలేదు. కానీ రాత్రికి రాత్రే.. దిమ్మలు నిర్మించేసి.. విగ్రహాలను కొలువుదీర్చడమే కాదు.. వాటిని మంత్రి ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్‌లు కూడా చేసేశారు. వాస్తవానికి ఎక్కడైనా విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే.. ముందుగా విగ్రహాల కమిటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి పొందాలి.. కానీ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి కూడా అయిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్‌కు నోటిమాటగానైనా సమాచారం ఇవ్వలేదు. ఇవేవీ లేకుండానే విగ్రహాలను ప్రారంభించేయడాన్ని తెలుసుకున్న కమిషనర్ మీరేం చేస్తున్నారంటూ సంబంధిత జోన్–2 ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పేవరకు విధులకు హాజరుకావద్దని ఆదేశించారు. ఇంత రాద్దాంతానికి కారణమైన ఆ విగ్రహాలు ఎవరివో తెలుసా?.. ఇటీవల మరణించిన టీడీపీ నేత నందమూరి హరికృష్ణది ఒకటి కాగా.. మిగిలిన రెండు దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, దిగ్దర్శకుడు దాసరి నారాయణరావులవి. విశాఖసిటీ: తీరంలో ముగ్గురు వ్యక్తుల విగ్రహాల ఏర్పాటు మహా విశాఖ నగర పాలక సంస్థలో రచ్చకు దారితీసింది. కొన్ని సంస్థలు ఆర్కే బీచ్‌లో వేర్వేరు చోట్ల ముగ్గురు విగ్రహాలను ఏర్పాటు చేశాయి. వారిలో దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దివంగత అక్కినేని నాగేశ్వరరావు, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ హరికృష్ణ విగ్రహాలను పెట్టారు. అయితే జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా విగ్రహం ఏర్పాటు చెయ్యాలంటే సంబంధిత జోన్ పరిధిలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే జీవీఎంసీ స్టాట్యూ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌కు అయినా దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ నుంచి అనుమతి వస్తేనే విగ్రహం ఏర్పాటు చెయ్యాలి. నగరంలో కొన్ని చోట్ల మహనీయుల విగ్రహాల ఏర్పాటు దరఖాస్తుల ఫైల్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాల విషయంలో ఈ నిబంధనలేవీ అడ్డు రాలేదు. అధికారం తమ చేతిలో ఉంది.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరించారు. స్టాట్యూ కమిటీకి గానీ, జీవీఎంసీకి గానీ చిన్న మాటైనా చెప్పకుండా, ఇద్దరు ఐఎఎస్ అధికారులకైనా మాట మాత్రం చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బీచ్‌రోడ్డులో శుక్రవారం రాత్రికి రాత్రే దిమ్మలను నిర్మించేసి ముగ్గురు విగ్రహాలను ఏర్పాటు చేసేశారు. ఈ విగ్రహాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించేశారు కూడా. లోపం ఎవరిది.?.. కమిషనర్ అసహనం ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్.. అవాక్కయ్యారు. ఇంత తంతు జరిగినా.. తనకు చెప్పలేదంటూ అసహనానికి గురయ్యారు. జీవీఎంసీ పరిధిలో ఏం జరిగినా క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది.. విభాగాధిపతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు కమిషనర్‌కు విషయం చేరవేస్తారు. అయితే ఈ విగ్రహాల ఏర్పాటు మాత్రం ప్రారంభమనంత వరకూ కమిషనర్‌కు తెలీలేదు. టౌన్‌ప్లానింగ్ పరిధిలోకి వచ్చే ఈ తతంగమంతా జోన్–2 పరిధిలో ఉన్న ఏసీపీలు డీసీపీకి గానీ, చీఫ్‌సిటీప్లానర్‌కు గానీ, జోనల్ కమిషనర్‌కు గానీ సమాచారం అందించాల్సి ఉంది. కానీ వారు ఈ విషయం ఎవ్వరికీ చేరవెయ్యలేదు. తెలిసి చెప్పలేదా..? అక్కడ విగ్రహాల ఏర్పాటు గురించి తెలీకపోవడం వల్ల చెప్పలేదా అన్న విషయం మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల అడుగులకు మడుగులొత్తుతున్న కొంతమంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఏం జరిగినా ఉన్నతాధికారులకు చేరవెయ్యడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విగ్రహాల విషయంలోనూ ఇదే తరçహాలో వ్యవహరించారని తెలుస్తోంది. మూడు చోట్ల దిమ్మలు కట్టి, విగ్రహాల్ని వాహనాల్లో తీసుకొచ్చి ఏర్పాటు చేసినా.. ఎవ్వరికీ తెలియకపోవడమేంటంటూ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఇంత జరిగినా.. సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. టౌన్‌ప్లానింగ్ వాట్సప్ గ్రూపుల్లో ఏసీపీలెవ్వరూ విధుల్లోకి వెళ్లొద్దు, తాను చెప్పిన తర్వాతే విధులకు హాజరు కావాలని ఆయన మెసేజ్ చెయ్యడం కార్పొరేషన్లో కలకలం రేపుతోంది. ఈవ్యవహారంపై జోన్–2 కమిషనర్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తమ్మీద రాత్రికి రాత్రే వెలిసిన విగ్రహాలు.. జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి. -
బీచ్ రోడ్డులో వ్యభిచార ముఠా అరెస్ట్
విశాఖపట్నం బీచ్రోడులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్డులోని ఓ పెద్ద హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు బీచ్‌రోడ్డులోని హోటల్‌పై దాడి చేశారు. వ్యభిచారులతోపాటు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. హోటల్ యాజమాన్యంతోపాటు వ్యభిచార ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.