breaking news
visakha trip
-
'మోదీ ఏ అర్హతతో విశాఖకు వస్తున్నారు'
విశాఖపట్టణం (అల్లిపురం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైజాగ్ స్టీల్‌ప్లాంటు 2వ దశ విస్తరణ ప్లాంటును ఏ అర్హతతో జాతికి అంకితం చేసేందుకు వస్తున్నారని వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రశ్నించారు. అల్లిపురం సీపీఐ కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల రౌండు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 10 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ప్రధాని మోదీ ఏ అర్హతతో విశాఖ పర్యటనకు వస్తున్నారని వారు ప్రశ్నించారు. ఏడాది కాలంలో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పిన మోదీ ఇప్పటివరకు ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్కపైసా కూడా కేటాయించలేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ ఊసే లేదని విమర్శించారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తామన్నా ఇంతవరకు జరగలేదన్నారు. అలాగే హుదూద్ తుఫాను సందర్భంగా విశాఖలో పర్యటించిన ప్రధాని తక్షణం వెయ్యి కోట్లు సహాయం ప్రకటించారు, కానీ 9 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విదల్చలేదని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ నుంచి ఎ.జె.స్టాలిన్, సీపీఐ(ఎం) బి.గంగారావు, ఎంసీపీఐ(యు) నుండి ఎం.వి.ఎన్.ఆర్.పట్నాయక్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ వై.కొండయ్య, సీపీఐ నుంచి ఎ.విమల పాల్గొన్నారు. -
విశాఖలో పీఏసీ చైర్మన్ పర్యటన
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ (ఏపీపీఏసీ) చైర్మన్, ఎంపీ భూమా నాగిరెడ్డి విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం పర్యటిస్తున్నారు. ఆయన సారథ్యంలో 12 మంది సభ్యులు జిల్లాలో భూ కేటాయింపులు జరిగిన రిషికొండ, తొట్లకొండ, భీమిలి, గంగవరం పోర్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఏపీసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి... జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. గత 3,4 ఏళ్లకు సంబంధించి జరిగిన భూ కేటాయింపులపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు పీఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి తెలిపారు.