breaking news
virasam member
-
ఈ ‘నేరపూరిత కుట్ర’ ఎక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ : విరసం సభ్యుడు వరవరరావు సహా గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు ‘నేరపూరిత కుట్ర’ సెక్షన్‌ను కూడా పుణె పోలీసులు బనాయించారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి అంటే, 1860 నుంచి భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతూనే ఉంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎక్కడ ఏకాస్త ఆందోళన చెలరేగినా అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించేవారు. ఈ చట్టంలో ఉన్న ఓ వెసులుబాటు ప్రకారమే ఈ చట్టం దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. దేశంలో ఏదో ఓ మూల ఎవరిపైనో ఒకరిపైన ‘నేరపూరిత కుట్ర’ కేసును బనాయించి ఇదే కేసులో దేశంలో ఎక్కడైనా, ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడమే ఆ వెసులుబాటు. చరిత్రలో నిలిచిపోయిన 1923 నాటి కాన్పూర్ కుట్రకేసు, 1929 నాటి మీరట్ కుట్ర కేసులు ‘నేరపూరిత కుట్ర’ దుర్వినియోగానికి నిలువెత్తు దర్పణం. అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీని అణచివేసేందుకు బ్రిటీష్ పాలకులు ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఇలాంటి చీకటి లేదా రాక్షస చట్టాలను ప్రపంచంలోని అనేక దేశాలు ఎత్తివేయగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎత్తివేయక పోవడం ఆశ్చర్యం, అర్థంకాని అంశం. 1972లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని తీసుకునేందుకు అన్నామలై యూనివర్శిటీకి వెళ్లినప్పుడు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉదయ్‌కుమార్ అనే విద్యార్థి మరణించారు. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరై విచారణ కమిషన్‌ను నియమించింది. పోలీసులు తమ చర్యను సమర్థించుకునేందుకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే కుడమురుట్టి వంతెన పేల్చివేసేందుకు ‘నేరపూరిత కుట్ర’ పన్నారని కమిషన్ ముందు పేర్కొంటూ అందుకు సాక్ష్యంగా ఓ ‘షెల్’ను చూపించారు. కుట్ర పన్నిన వారు మావోయిస్టులని మధ్యాహ్నం చెప్పిన పోలీసులు సాయంత్రానికల్లా వారిని నక్సలైట్లను చేశారు. లాఠీచార్జిలో మరణించిన ఉదయ్ కుమార్ అనే విద్యార్థి తండ్రి కూడా విచారణ కమిషన్ ముందు హాజరై తీవ్రవాద గ్రూపులతో కలిసి తన కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడంటూ పోలీసుల బలవంతం వల్ల తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ‘నేరపూరిత కుట్ర’ థియరీని విచారణ కమిషన్ బొత్తిగా విశ్వసించకుండా కొట్టి వేసింది. నాడు లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసు కారణంగా తన ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరుగుతుందని కరుణానిధి భావించారుగానీ ఆ తర్వాత మూడేళ్లలో అవినీతి ఆరోపణల వల్ల ఆయన ప్రభుత్వం భ్రష్ట్రుపట్టి ఎమర్జెన్సీ కాలంలో అర్ధంతరంగా డిస్మిస్ అయింది. ఇప్పుడు కూడా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, సామాజిక కార్యకర్తలపై మోదీ ప్రభుత్వం కూల్చివేతకు ‘నేరపూరిత కుట్ర’ కోణాన్ని జోడించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందుదామని ఆయన ప్రభుత్వం చూస్తోందని, నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడినట్లే రానున్న ఎన్నికల్లో ‘మహా కూటమి’ పేరిట ప్రతిపక్షాలు ఏకమై మోదీ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు. -
'జాతీయ, లౌకిక వాదాలు గొప్ప జీవన విధానాలు'
కావలి అర్బన్: లౌకికవాదం, జాతీయవాదాలు గొప్ప జీవన విధానాలని విరసం సభ్యుడు, విశ్వోదయ గౌరవ జీవిత సభ్యుడు జి.కల్యాణరావు పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శనివారం ఎస్ఆర్ శంకరన్ 82వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ‘వర్తమానంలో జాతీయవాదం, లౌకికవాదం’ అంశంపై కల్యాణరావు మాట్లాడారు. కేంద్రం మతాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని, లౌకిక రాజ్యమంటే మత రాజ్యం కాదన్నారు. దేశం బాగుండాలంటే వర్గం, కులం నిర్మూలించాలని చెప్పారు. మతం జీవితంలోకి ప్రవేశించిందంటే స్వేచ్ఛ నశిస్తున్నట్లేనని వివరించారు. వ్యక్తికి ప్రశ్నించే హక్కులేనప్పుడు జాతీయవాదం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం గొంతు విప్పితే ప్రస్తుత సమాజం దాన్ని నేరంగా పరిగణిస్తోందని వాపోయారు. అసమానతలను తొలగించి సమానత్వం సాధించేదే జాతీయవాదమని నిర్వచించారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత నేటి విద్యార్థులదేనన్నారు. అంతకుముందు ఆయన దివంగత ఎస్ఆర్ శంకరన్, దొడ్ల రామచంద్రారెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏబీపీ పాల్‌మనోహర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి.పోతురాజు, విశ్వోదయ సంస్థల రెక్టార్ దొడ్ల వినయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.