vineetha
-
వెంకటేష్‌తో హిట్ సినిమా.. జైలుకు వెళ్లడంతో ఆమె కెరీర్ క్లోజ్
వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' చిత్రం చాలామంది చూసే ఉంటారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, ఇందులో నేపాలి అమ్మాయిగా నటించిన టాప్ హీరోయిన్ 'వినీత' గుర్తుందా..? కథలో భాగంగా ఒకమారు వెంకటేష్ నేపాల్‌కు వెళ్లినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని ఆ నేపాలి అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆపై కథ అనేక మలుపులు తిరుగుతుంది. వినీత విషయానికి వస్తే.. 2003 వరకు సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఒక్కసారిగా చిత్రపరిశ్రమకు ఎందుకు దూరం అయింది..? మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుందా..?ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు 'వినీత' పేరు బాగా పాపులర్. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో అక్కడి స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో మెప్పించింది. ఆపై మలయాళంలో కూడా మోహన్ లాల్ లాంటి హీరోతో నటించింది. ఆపై బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇలా వరుస విజయాలతో వెళ్తున్న వినీతకు 2003లో తగిలిన ఎదురుదెబ్బతో ఆమె ఇప్పటికీ కోలుకోలేదు. ఆ ఏడాదిలో కొందరి ఫిర్యాదుతో వినీతపై వ్యభిచారం కేసును పోలీసులు నమోదుచేశారు. తల్లి, సోదరుడితో కలిసి ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ, 2004లో ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు వెళ్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా కేసు నమోదు చేశారని కోర్టు తప్పుబట్టింది. ఆమెపై ఎటువంటి అభియోగాలు లేకుండా ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. అయతే, ఆమెకు జరగాల్సిన నష్టం అంతా ఇంతలోనే జరిగిపోయింది. విచారణ పేరుతో తనను మానసిక వేదనకు గురిచేశారని ఆ సమయంలో వినీత పేర్కొంది. సమాజంలో తన పేరును నాశనం చేసేలా పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె తెలిపింది. ఈ కేసు తర్వాత వినీతకు సినిమా ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినీ కెరీర్‌ను కావాలనే కొందరు నాశనం చేశారని ఆమె అభిమానులు పేర్కొన్నారు. సినిమా ఛాన్సులు లేకపోవడంతో ఆమె చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పలు కథనాలు కూడా వచ్చాయి. సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పరిశ్రమకు దూరంగానే ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన రెండు, మూడు సినిమాల్లో మాత్రమే ఛాన్సులు వచ్చాయి. అవి కూడా సహాయక పాత్రలు మాత్రమే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన వినీత ఇలా చిన్న చిన్న పాత్రలలో ఆమె నటించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే, వినీత ఇప్పుడు మరోసారి చిత్రపరిశ్రమలో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదురితే తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలని ఆమె చూస్తున్నట్లు సమాచారం. -
BRS కౌన్సిలర్లకు ఊహించని షాక్
-
ఏడాదికి 5లక్షల ఆదాయం.. ఈ యువ రైతు గురించి తెలుసా?
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తనకున్న 6.5 ఎకరాల్లో ఏడాది పొడవునా బహుళ పంటలను సాగు చేస్తూ రూ. 5 లక్షల వరకు నికరాదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన యువ మహిళా రైతు పొంగి వినీత(20). అల్లూరి సీతారామరాజు జిల్లా బలియగూడ మండలం డుంబ్రిగూడ గ్రామంలో ఆమె ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు స్ఫూరినిస్తున్నారు. ఆమెకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఎం.వి.రెడ్డి ఉత్తమ రైతు పురస్కారా’న్ని ఇటీవల ప్రదానం చేసింది. అరకు మండలం కిలోగుడలో సంజీవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 15వ దేశీ విత్తనోత్సవంలో కూడా ఉత్తమ రైతుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు పద్ధతులను తెలుసుకున్నారు. కొండ ప్రాంతంలోని ఎర్ర నేలలో సార్వా, దాళ్వా, వేసవి సీజన్లలో వరుసగా భర్త బాలకృష్ణతో కలసి వినీత ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందుతుండటం విశేషం. కొండ వాగుల్లో నీటిని సేకరించి పంటలకు మళ్లించడం ద్వారా ఖరీఫ్‌తో పాటు రబీ, వేసవి పంటలను కూడా సాగు చేస్తున్నారు. వర్షాధారంగా వరి, గుళి రాగి పద్ధతిలో రాగులు, కూరగాయలు, పండ్లు, పూలు, చింతపండుతో పాటు కొద్ది సంఖ్యలో నాటుకోళ్లు, గొర్రెలు,మేకలను సైతం పెంచుతూ అనుదినం మంచి ఆదాయం పొందుతున్నారు. వినీత అన్ని పంటలకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాలనే అవలంభిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ కషాయలను తయారు చేసి తమ పంటలకు వాడటంతో పాటు గ్రామంలోని ఇతర రైతులకు అందిస్తున్నారు. పంట మార్పిడి ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఏడాది పొడవునా మూడు సీజన్లలోనూ అంతర పంటలు, బహుళ అంతస్తుల పంటలు సాగు చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదనతో పాటు గడ్డిని ఆచ్ఛాదనగా వాడుతూ నేల తేమను సమర్థవంతంగా సంరక్షించుకుంటున్నారు. చింతపల్లి, అనకాపల్లి ఆర్ఎఆర్ఎస్ల శాస్త్రవేత్తల సూచనల మేరకు జీవ నియంత్రణ పద్ధతులను అనుసరిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్టును పంటలకు వాడుతున్నారు. అంతర పంటల సాగును అనుసరిస్తారు. మొక్కజొన్న+ముల్లంగి, టొమాటో+ ముల్లంగి, పసుపు+అల్లం, బీన్స్+వంకాయ, కొత్తిమీర+టమోటాలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తున్నారు. టమోటా, కొత్తిమీర, ముల్లంగిని దశలవారీగా విత్తటం ద్వారా సంవత్సరం పొడవునా పంట దిగుబడి తీస్తున్నారు. ఏడాది పొడవునా ఆదాయ భద్రత ఒకటికి పది పంటల సాగుతో వ్యవసాయ భూమి నుంచి సురక్షితమైన ఆదాయాన్ని పొందడంలో వినీత విజయం సాధించారు. దేశీ వరి, కూరగాయలతో పాటు పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. మొత్తంగా 6.5 ఎకరాల ద్వారా సుమారు రూ. ఐదు లక్షలను ఏడాదికి సగటు నికరాదాయం పొందుతున్నారు. దేశీ వరిని వరుసలుగా విత్తటం, గుళి పద్ధతిలో రాగి నారు మొక్కలను నాటేసి సాగు చేయటం, అంతర పంటలు, మొక్కజొన్న ఇతర పంటలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయటం వినీత ప్రత్యేకత. పాత విత్తనాలనే వాడుతున్నాం. విత్తనాలను మునుపటి పంట నుండి సేకరించి తదుపరి సీజన్‌కు వినియోగిస్తాం. ఎక్కువగా దేశీ రకాలనే వాడుతున్నాం. సహజ పద్ధతిలో పండించిన నాణ్యమైన ఆహారోత్పత్తులను థిమ్సా ఎఫ్.పి.ఓ. ద్వారా మార్కెట్లో విక్రయిస్తున్నందున మంచి ఆదాయం వస్తోంద’ని వినీత తెలిపారు. గత ఏడాది ఖరీఫ్‌లో 4.3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 2 ఎకరాల్లో వరి (దిగుబడి 32 క్విం./రూ. 26 వేల నికరాదాయం), అరెకరం మొక్కజొన్న (9 క్విం./రూ.12,500), ఎకరంలో రాగులు (7.5 క్విం./ రూ.11,500), అరెకరంలో టొమాటో (4.8 క్విం./రూ.4,200), 30 సెంట్లలో సామలను వినీత సాగు చేశారు. రబీలో 3 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. అరెకరంలో వరి (9 క్విం./రూ. 8,550 నికరాదాయం), అరెకరంలో మొక్కజొన్న (6 క్విం./రూ.8,000), ఎకరంలో టొమాటో (12.6 క్విం./ రూ.12,100), అరెకరంలో ముల్లంగి (1.25 క్విం/రూ.2వేలు), 30 సెంట్లలో పచ్చిమిరప, కూరగాయలను సాగు చేశారు. అదేవిధంగా ఎండాకాలంలో ఎకరంన్నరలో పంటలు సాగు చేశారు. 30 సెంట్లలో కొత్తిమీర, 20 సెంట్లలో ముల్లంగి, అరెకరంలో కూరగాయలు, అరెకరంలో టొమాటోలు సాగు చేశారు. ఎకరంన్నరలో బొప్పాయి, అరటి, అల్లం, పసుపు వంటి వార్షిక పంటలను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక పంటలు కాఫీ, మిరియాలు 40 సెంట్లలో సాగు చేస్తున్నారు. 30 పనస, 6 చింత చెట్లున్నాయి. అన్ని పంటలు, కోళ్లు, గొర్రెలు, మేకల ద్వారా ఏటా సగటున రూ. 5 లక్షల నికరాదాయం పొందుతున్నట్లు వినీత తెలిపారు. -
శభాష్.. వినీత!
నంద్యాల, న్యూస్‌లైన్: ప్రతిభకు వికలత్వం అడ్డురాదని ఓ విద్యార్థిని నిరూపిస్తోంది. మాటలు రాకపోయినా క్రీడాపోటీల్లో రాణిస్తోంది. ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రన్నరప్‌గా నిలిచి తనకు సాటి ఎవరూ లేరని చాటింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచింది. నంద్యాల పట్టణానికి చెందిన రమణారెడ్డి, నాగలింగేశ్వరిల కుమార్తె వినీత పుట్టు మూగ. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలోని బధిర కళాశాలలో రెండో సంవత్సరం సీఈసీ చదువుతోంది. నంద్యాల పట్టణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో ఏకైక బధిర విద్యార్థి వినీత కావడం గమనార్హం. కర్నూలు, వరంగల్, చిత్తూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులపై ఈమె విజయం సాధించింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థినితో తలపడి ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని గత ఏడాది వైఎస్సార్ జిల్లాలో బధిరులకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రతిభకనబరిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల సలహాలతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు వినీత తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన ఆశయమని ఆమె పేర్కొన్నారు. తమ కుమర్తె క్రీడల్లోనే కాకుండా చదువులో ముందంజలో ఉందని తల్లిందండ్రులు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయని వారు వివరించారు. వచ్చే ఏడాది వినీతకు కేరళలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనే విధంగా కృషి చేస్తామని రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కోచ్ మహేశ్వరరావు తదితరులు చెప్పారు.