breaking news
vinavani
-
వీణావాణిలకు శస్త్ర చికిత్స చేయించండి
నిలోఫర్ ఆస్పత్రి వర్గాలకు తల్లిదండ్రుల లేఖ సాక్షి, హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణావాణిల ఆపరేషన్‌కు తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మి అంగీకరించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు శస్త్రచికిత్స మొదలు పెట్టాలని కోరుతూ నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్ కుమార్, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డికి ఆ దంపతులు లేఖ రాశారు. 2003లో పుట్టిన ఈ అవిభక్త కవలలకు పదమూడేళ్లు నిండాయి. దీంతో నిలోఫర్ ఆస్పత్రిలో వారిని ఉంచేందుకు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఇంటికి తీసుకెళ్లి సాకే స్తోమత తమకు లేదని, ప్రభుత్వమే తమకు ఏదైనా మార్గం చూపించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే.. తాము శస్త్రచికిత్సకు ఒప్పుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వీణావాణిల తల్లిదండ్రులు రాసిన లేఖ అందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ లేఖను డీఎంఈకు చేరవేస్తామని చెప్పారు. వారిద్దరిని శస్త్రచికిత్స ద్వారా వేరుచేసేందుకు లండన్, ఆస్ట్రేలియా వైద్య బృందం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన వివరించారు. అప్పటివరకు కవలలు తమ ఆస్పత్రిలోనే ఉంటారని ప్రకటించారు. -
కంటేనే అమ్మ అని అంటే ఎలా...
► వీణావాణిలను కంటికి రెప్పలా ► కాపాడుతున్న నిలోఫర్ ఆయాలు ► తల్లిదండ్రులను మైమరిపిస్తున్నారన్న అవిభక్త కవలలు ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా...’ ఓ సినీ కవిరాసినట్లు నవమాసాలు మోసి కనకపోయినా తల్లి ప్రేమను, ప్రేమానురాగాలను పంచవచ్చని నిరూపించారీ ఆయమ్మలు. విధి వెక్కిరించిన పిల్లలకు ‘విధుల’రీత్యా ఆయాలైనా కాలక్రమంలో.. అమ్మలుగా మారారు అవిభక్త వీణా-వాణిలకు సేవలు చేస్తున్న అయమ్మలు. ఆ పిల్లలు సైతం ‘అమ్మను మించిన అమ్మలు మా ఆయమ్మలు..’ అంటూ చెబుతున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా వీణావాణి- నిలోఫర్ ఆయమ్మల అనుబంధంపై ప్రత్యేక కథనం... -సాక్షి, సిటీబ్యూరో అడగందే అమ్మయినా పెట్టదంటారు. కాని ఆ చిన్నారులకు ఆకలిని వారికంటే ముందుగానే పసిగడుతున్నారీ ఆయాలు. కడుపు నింపుతూనే 24 గంటలూ కంటికి రెప్పలా కాపాలా కాస్తున్నారు. అమ్మలోని ఆప్యాయతను, నాన్నలోని మమకారాన్ని రుచిచూపిస్తున్నారు. ఆసుపత్రే అమ్మ ఒడి... వ్యయప్రయాసలకు తట్టుకోలే ని నిరుపేద తల్లిదండ్రుల కారణంగా పదేళ్ల నుంచి నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రికే పరిమితమయ్యారు అవిభక్త కవలలు వీణావాణి(13). మీడియా కవరేజీ కారణంగా ఈ చిన్నారుల గురించి తెలుగు రాష్ట్రాల్లోనే తెలియని వారుండరు. దాదాపు దశాబ్ధానికి పైగా...వీరు ఆసుపత్రిలోనే పెరిగి పెద్దయినప్పటికీ... చురుకుతనంలో గాని, తెలివితేటల్లో గాని ఓ మంచి వాతావరణం ఉన్న ఇంట్లో పెరిగిన పిల్లలకు తీసిపోరు. అత్యంత క్లిష్టమైన వీరి జోడు జీవితం...ఇంత చక్కగా సాగడానికి కారణం... ఆ పిల్లలను సాకే ఆయమ్మలే. ఆయమ్మలే మాకు అన్నీ.... ‘ఊహ తెలిసే వరకు కన్నతల్లి ఎలా ఉంటుందో మాకు తెలీదు. కానీ ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాం కదా! తల్లి గొప్పతనం గురించి, తల్లి ప్రేమ గురించి తెలుసుకున్నాం. జన్మనిచ్చిన అమ్మ మాకు కావాలి. కానీ ఆమె వద్దకు మేము వెళ్తే అక్కడ ఉండలేం. ఆమే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’ అని వీణా-వాణి అంటున్నారు. అమ్మను మైమరిపించేలా ఇక్కడి ఆయమ్మలు మాకు సేవలందింస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతా టైం ప్రకారం... ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకల్లా నిద్రలేవడం, కాలకృత్యాల అనంతరం వ్యాయామం, ఆ తర్వాత స్నానం, డ్రెస్ చేసుకోవడం, పాలు తాగడం, టిఫిన్ తినడం.. అయిపోయాక సరిగ్గా తొమ్మిది గంటలకు ట్యూషన్‌కు రెడీ. మధ్యలో మధ్యాహ్నం భోజనం గురించి కాసేపు గ్యాప్, అక్కడి నుంచి 4 గంటల దాకా చదువే. అనంతరం కాసేపు ఆటలు, పాటలు, టీవీ చూడడం, ఠంచనుగా 9 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించడం...ఈ క్రమం గత కొన్నేళ్లుగా తు.చ తప్పకుండా సాగిపోతోంది. ప్రతి ఇంట్లో చిన్నారుల రోజువారీ కార్యక్రమాలు కూడా ఇవే. అయితే ఇక్కడ... వీరు రెండు తలలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు కావడమే వీరికి చేసే సేవల్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. కనకపోయినా కంటిపాపల్లా వీరిని సాకడం ద్వారా వీరికి తమ కష్టాన్ని మరిచిపోయేలా చేస్తున్నారు వీరి బాగోగులు చూసే ఐదుగురు ఆయమ్మలు. ఇంటి దగ్గర వండి మరీ... ‘‘వీళ్లు ఒక రకంగా మా స్వంత పిల్లల కంటే కూడా ఎక్కువ. వారి స్వచ్ఛమైన మాటలు, ఆట పాటలు చూస్తుంటే మమ్మల్ని మేం మరిచిపోతాం’’అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఆయమ్మలు. ‘ఇంటి దగ్గర పండుగల వంటి సందర్భాల్లో ఏమైనా స్పెషల్స్ వండితే మా బిడ్డల కోసం తీసుకురాకుండా ఉండం. ఒక్కోసారి వీరికోసమే ప్రత్యేకంగా కూడా వండి తెస్తాం. అలాగే మొన్న చికెన్ వండి తెచ్చా’’ అంటూ మురిపింగా చెప్పారు భారతి అనే ఆయమ్మ. ‘పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. మీకు తెలుసా? వీరు టీవీలో కూడా డిస్కవరీ, పోగో వంటి చానెల్స్ మాత్రమే చూస్తారు. న్యూస్ కూడా బాగా గుర్తు పెట్టుకుంటారు. అన్ని విషయాలనూ మాతో పంచుకుంటారు’’ అంటూ ఆయమ్మలు వీణా-వాణిల గురించి చెప్పేటప్పుడు పిల్లల విజయం పట్ల తల్లిలో కనపడే ఉత్సాహం వారిలో కన్పించింది. వీరికి విద్యాబుద్ధులు చెప్పే టీచర్ అనూష కూడా ఇదే విధంగా స్పందించారు. పొద్దున్నే న్యూస్ చూసి తాను వచ్చేటప్పటికి డౌట్స్‌తో సిద్ధంగా ఉంటారని, వాణి ఫాస్ట్‌గా మాట్లేడేస్తుందని, వీణ మాత్రం ఆచి తూచి మాట్లాడుతుందని... సాయంత్రం దాకా వీరితో గడిపి ఇంటికె ళ్లినా వీరి మాటలు మరపునకు రావని అంటారా టీచర్. ‘‘అమ్మ అంటే రోజంతా మనతోనే ఉంటుంది. అమ్మంటే ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచిస్తుంది అమ్మ అంటే మనకు ఏదైనా సమస్య వస్తే సొల్యూషన్. ’’... ఇది వీణా-వాణిలు చెప్పే నిర్వచనం. అందుకే ఈ ఆయాలు వీరికి దేవుడిచ్చిన అమ్మలయ్యారు. సీఎం కేసీఆర్‌ను చూడాలని ఉంది: వీణావాణి మాకు సీఎం కేసీఆర్ తాతంటే ఎంతో ఇష్టం. ఆయన్ను చూడాలని ఉంది. మా ఈ చిరకాల కోరికను తీర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీచర్ (అనుష) వస్తుంది. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ ఇలా అన్ని సబ్జెక్టులు చదువుతున్నాం. బోరు కొడితే టీవీ చూస్తాం. సరదాగా ఇద్దరం కలిసి డ్యాన్స్ కూడా చేస్తాం’ అని వీణావాణి ముక్తకంఠంతో తెలిపారు. -
10 నెలలు లండన్‌లోనే..
వీణావాణిల ఆపరేషన్‌కు షెడ్యూలిచ్చిన వైద్యులు సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ, వాణీలను వేరు చేసేందుకు లండన్ వైద్య బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది. తలలు అతుక్కుని పుట్టడంతో 12 ఏళ్లుగా నరకయాతన పడుతున్న ఆ చిన్నారులను పరీక్షించేందుకు బ్రిటన్‌లోని ప్రముఖ ‘గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్’ ఆసుపత్రి వైద్యులు డేవిడ్ డునావే, జిలానీ గత నెలలో హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. కవలలపై అన్ని రకాల పరీక్షలను నిర్వహించి ఆ నివేదికలను వారు పరిశీలించారు. ఈ ఫలితాల ఆధారంగా వీణ, వాణీలను వేరు చేయడం సాధ్యమేనని తేల్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, నీలోఫర్ ఆస్పత్రికి ఇటీవలే నివేదిక పంపించారు. ఆపరేషన్‌కు సంసిద్ధత వ్యక్తంచేస్తూ.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ర్ట ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పది నెలలు లండన్‌లోనే... లండన్‌లోని తమ ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వారా వీణ, వాణీలను వేరు చేయడానికి నిర్ణయించామని, ఇందుకు దాదాపు పది నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స అయినప్పటికీ తాము అందుకు సిద్ధంగా ఉన్నామని, ఐదారు దశల్లో శస్త్రచికిత్స నిర్వహిస్తామని, ఇందులో తమతో పాటు 20 మంది ప్రముఖ వైద్యులు పాలుపంచుకుంటారని వెల్లడించారు. కవలలకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయానికి వచ్చినట్టు లండన్ వైద్యులు తెలిపారు. పూర్తి చికిత్స కోసం వీణ-వాణీలు లండన్‌లో 300 రోజులు(దాదాపు 10 నెలలు) ఉండాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు ముందు(ప్రీ ఆపరేషన్) దశ కన్నా ఆపరేషన్ తర్వాతి(పోస్ట్ ఆపరేషన్) దశ అత్యంతక కీలకమైనదని వెల్లడించారు. మెదళ్లు కలిసి ఉన్న నేపథ్యంలో శస్త్రచికిత్స సంక్లిష్టంగా ఉంటుందని, ఈ కేసులో 75 నుంచి 80 శాతం సక్సెస్ రేటు ఉంటుందని, 20 నుంచి 25 శాతం రిస్క్ ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల పాటు లండన్‌లో ఉండాల్సి వస్తుందన్నారు. గతంలో ఇలాగే మెదళ్లు కలిసి పుట్టిన ఏడాది వయసున్న కవలల్ని విడదీశామని కూడా వెల్లడించారు. ఈ నివేదిక నేపథ్యంలో ఇటు ఉన్నతాధికారులు, అటు నీలోఫర్ వైద్యులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆపరేషన్ కోసం పిల్లలను లండన్ తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రుల నుంచి నీలోఫర్ వైద్యులు లిఖితపూర్వక హామీ తీసుకోనున్నారు. సర్కారు నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం రానున్నట్లు తెలిసింది.