breaking news
Villadhi Villain Veerappan
-
'ప్లీజ్.. ఆ సినిమా చూడొద్దు!'
చెన్నై : రాంగోపాల్‌వర్మ 'విల్లాది విల్లన్ వీరప్పన్' చిత్రాన్ని తమిళ ప్రజలెవ్వరూ చూడవద్దని, ఆ చిత్రాన్ని బహిష్కరించాలని చందనపు దొంగ వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి విజ్ఞప్తి చేశారు. తన భర్త గురించి ఆయనకు ఏం తెలుసని, ఇష్టం వచ్చినట్టు కథలను అల్లుకుంటున్నారని వర్మపై మండిపడ్డారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన వీరప్పన్ జీవిత కథ తమిళంలో విల్లాది విల్లన్ వీరప్పన్‌గా శుక్రవారం తమిళనాట విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఆ చిత్రాన్ని ఎవ్వరూ చూడవద్దు అని, అందులోని కథ వీరప్పన్ జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తారు. వీరప్పన్ జీవితం ఇతివృత్తంగా హిందీలో సినిమా తీస్తున్నట్టు తనతో చెప్పిన రాంగోపాల్ వర్మ, ఇప్పుడు అన్ని భాషల్లో తన అనుమతి లేకుండా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. వీరప్పన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు తప్ప మరెవ్వరికీ తెలియదని, ఆయన అజ్ఞాతంలో ఉన్నా ఏ తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. లాస్ట్ ఎన్కౌంటర్ పేరుతో ఐపీఎస్ అధికారి విజయకుమార్ పుస్తకం రచిస్తున్నట్టు సమాచారం వచ్చిందని, అందులో తన భర్తను ఎలా చంపాడో వివరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. -
3న విల్లాదివిలన్ వీరప్పన్
ఇటీవల వివాదాస్పద కథా చిత్రాల సృష్టికర్తగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన చిత్రాలే కాదు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసే అభిప్రాయాలు సమాజంలో పేలుతుంటాయి. ఇక దశాబ్దం కాలం ముందు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాండించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి తెలియని వారుండరు.అతని చరిత్ర ఒక కల్లోలం. వీరప్పన్ ఇతివృత్తాన్ని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరపెకైక్కిస్తే అదో కలకలమే. ఇప్పుడదే జరుగుతోంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ హత్యా ఉదంతంతో ఆయన దర్శకత్వం వహించిన విల్లాదివిలన్ వీరప్పన్ చిత్రం జూన్ మూడున తమిళంలో విడుదలకు ముస్తాబవుతోంది. తమిళం,హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం హిందీలో ఈ నెల 27న తెరపైకి రానుంది. ఇందులో సందీప్భరద్వాజ్, సచ్చిన్‌జోషి, ఉషాజాదవ్,లిషారాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. రెనా సచ్చిన్‌జోషి నిర్మాతగా, ఎంఆర్.షాజహాన్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్ర వివరాలను వెల్లడించడానికి చిత్ర యూనిట్ శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆసియాలోనే అతి భయంకరమైన హంతకుడని అతను బిన్లాడన్కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వీరప్పన్‌కు సంబంధించిన విషయాలను 2004లో అతను చనిపోయే వరకూ గమనిస్తూ వచ్చానన్నారు. అతని ఇతివృత్తంతో చిత్రం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వీరప్పన్ జీవితం గురించి చాలా రీసెర్చ్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా అతని అనుచరులు కొందరిని,అతని హత్యకు కారకులైన కొందరు పోలీస్ అధికారులను కలిసి వారి నుంచి వాస్తవాలు రాబట్టానన్నారు. వాటి ఆధారంగానే ముందుగా కన్నడంలో కిల్లింగ్ వీరప్పన్ పేరుతో చిత్రం రూపొందించానని తెలిపారు. ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యిందని చెప్పారు. ఆ చిత్రం చూసిన సచ్చిన్‌జోషి హిందీలో చేద్దామని అన్నారన్నారు. దాంతో కిల్లింగ్వీరప్పన్ చిత్రాన్ని మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలతో హిందీ, తమిళ భాషల్లో రూపొందించినట్లు తెలిపారు. ఇది వీరప్పన్ హత్యా ఉదంతంలో కూడిన చిత్రం అని వివరించారు. వీరప్పన్‌ను అంతం చేయడానికి పోలీస్ అధికారి విజయ్‌కుమార్ ఆపరేషన్ కుకూన్ పేరుతో పథకం వేస్తారని ఆయన ఆదేశాలను పాటించి వీరప్పన్‌ను అంతం చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన కన్నన్ ఇతివృత్తంగా కూడా ఈ విల్లాదివిలన్ వీరప్పన్ చిత్రాన్ని చెప్పవచ్చునన్నారు. ముఖ్యంగా వీరప్పన్ గురించి పూర్తిగా చెప్పాలంటే అది డాక్యుమెంటరీ చిత్రం అవుతుందని అతను మర ణించడానికి రెండేళ్ల ముందు నుంచి జరిగే సంఘటనలే ఈ చిత్రం అన్నారు. వీరప్పన్‌ను చిత్రంలో హీరోగా చూపించారా?విలన్‌గా చిత్రీకరించారా?అన్న ప్రశ్నకు అతని వల్ల లబ్ధిపొందిన వారు ఉన్నారు. బాధింపునకు గురైన వారు ఉన్నారని అది వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటుందని బదులిచ్చారు. వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసినట్లే, రజనీకాంత్‌ను కిడ్నాప్ చేయాలనుకున్నారని ట్టిట్టర్లో పేర్కొన్న విషయం గురించి అందుకు ఆధారాలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు తాను సేకరించిన విషయాలు,తన అందిన సమాచారం మేరకు ఆ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.