breaking news
Vikram Simhapuri University
-
‘టూ’ మచ్!
- వీఎస్‌యూలో ఒక విద్యార్థి ఒక పీజీ మాత్రమే చేయాలట - రెండో పీజీకి ససేమిరా అంటున్న అధికారులు - పీజీ సెట్ నోటిఫికేషన్లో నిబంధన - ప్రకటనపై మండిపడుతున్న విద్యార్థులు నెల్లూరు (టౌన్) : తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు విక్రమ సింహపురి యూనివర్సిటీ అధికారులు. వరుస వివాదాలు, రకరకాల ఆరోపణలు వెంటాడుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదు. రిజిస్ట్రార్ మారినా వర్సిటీ అధికారుల పాలన ఇష్టారాజ్యంగానే సాగుతోంది. తాజాగా యూనివర్సిటీలో ఒక పీజీ చేసిన విద్యార్థి మరొక పీజీ చేయకూడదనే నిబంధనను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని నిబంధన వీఎస్‌యూలో పెట్టడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీఎస్‌యూ అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలకు ఉన్నత విద్యను అందించే దిశగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (2008) వీఎస్‌యూను స్థాపించారు. ఆ సమయంలో వర్సిటీకి కాకుటూరులో దాదాపు 50 ఎకరాలు కేటాయించారు. దీని అభివృద్ధికి తొలుత రూ.12కోట్లు మంజూరు చేశారు. యూనివర్సిటీ స్థాపించిన ఏడాది సుమారు 350 మంది విద్యార్థులు పీజీలో చేరారు. ప్రస్తుతం 600 మంది విద్యార్ధులు పీజీ చదువుతున్నారు. తొలుత 6 కోర్సులతో ప్రారంభించిన యూనివర్సిటీలో నేడు 22 కోర్సులను ఏర్పాటు చేశారు. అయితే వర్సిటీ అధికారుల తీరు, ఏకపక్ష నిర్ణయాలతో ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. రిజిస్ట్రార్‌గా శివశంకర్ ఉన్నపుడు అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వర్సిటీ మూలనిధి నుంచి ఫండ్ డ్రా చేయడంపై పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో విద్యార్థి సంఘాలవారు. అధ్యాపకులు ఉద్యమాలు చేశారు. ఇటీవల రిజిస్ట్రార్‌గా శివశంకర్‌ను తొలగించిన నేపధ్యంలో యూని వర్సిటీ అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశపడ్డారు. అయితే అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదు. కమిటీ నిర్ణయం అంటున్న అధికారులు డబుల్ పీజీకి ప్రవేశం నిరాకరణ అనే విషయమై యూనివర్సిటీ సలహా కమిటీ నిర్ణ యం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. ఈ కమిటీలో 13మంది సభ్యులుగా ఉంటారు. కమిటీకి వైస్ చాన్సలర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి మృతి ఘటన జరినప్పటి నుంచి డబుల్ పీజీ చేస్తున్న విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాన్ని నిషేధిస్తూ జీఓ జారీ చేశారు. అయితే డబుల్ పీజీ చదివేందుకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు.రాష్ట్రంలో అన్నియూనివర్సిటీల్లో డబుల్ పీజీ చేసేం దుకు అనుమతి ఇస్తున్నపుడు వీఎస్‌యూలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే కమిటీ నిర్ణయమంటున్నారు. ఈ నిబంధన వల్ల విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేందుకు అవకాశాన్ని కోల్పోతున్నారు. ప్రతి ఏటా పీజీ కోర్సుల్లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. అయినా వర్సిటీ అధికారులు మాత్రం మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తెగేసి చెబుతున్నారు. డబుల్ పీజీకి అనుమతి నిరాకరణపై విద్యార్థి సంఘాలు ఉద్యమాలకు సిద్ధపడుతున్నాయి. అయితే డబుల్ పీజీ అనుమతి నిరాకరణపై వర్సిటీ రిజి స్ట్రార్ చంద్రయ్య వివరణ కోసం ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. నోటిఫికేషన్లో... విక్రమ సింహపురి యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు గతనెల 20న నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం వర్సిటీలో 22 పీజీ కోర్సులున్నాయి. ప్రధానంగా మ్యా«థమేటిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సోషల్‌వర్క్, ఇంగ్లీçషు, ఎకానమిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, టూరిజం, మేనేజ్మెంట్ తదితర కోర్సులకు డిమాండ్ ఉంది. అయితే ప్రస్తుత పీజీ నోటిఫికేషన్లో అధికారులు కొత్త నిబంధనను చేర్చారు. వర్సిటీలో ఒక పీజీ చేసిన విద్యార్థి మరో పీజీ చేయకూడదని షరతు విధించారు. ఈ నిబంధనపై విద్యార్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని నిబంధనను వీఎస్‌యూలో పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో ఒక పీజీ చేసిన విద్యార్థి రెండో పీజీ చదివితే నష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది పీజీ కోర్సుల్లో చాలామంది చేరక సీట్లు మిగిలిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. చాలా దారుణం రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనను వీఎస్‌యూలో అమలు పరచడం దారుణం. వర్సిటీలో రెండో పీజీ చేసేందుకు అనుమతి నిరాకరించడ వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఆది నుంచి అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో వీఎస్‌యూ వివాదాల వర్శిటీగా మారింది. డబుల్ పీజీ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. – నాయుడు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కమిటీ నిర్ణయం మేరకే నిబంధన డబుల్ పీజీకి అనుమతి ఇవ్వకపోవడం యూనివర్సిటీ అడ్వైజరీ కమిటీ నిర్ణయం మేరకు జరిగింది. కమిటీ చేసిన తీర్మానాలను అమలు చేస్తున్నాం. సందేహాలుంటే వీసీ, రిజిస్ట్రార్‌ను అడగండి. – జవహర్‌బాబు. పీజీ సెట్ కన్వీనర్ -
అన్నం పెట్టండి మహాప్రభో
* మెస్ చార్జీలు చెల్లించినా భోజనం పెట్టలేదని నిరసన * వీఎస్‌యూ పరిపాలన భవనం, కళాశాల వద్ద ధర్నా * సీఐ కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విద్యార్థులు నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీ రోజుకో వివాదానికి కేంద్ర బిందువవుతోంది. వర్సిటీ అధికారులు అనుసరిస్తున్న తీరుతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా మెస్‌చార్జీలు చెల్లించినా భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా హాస్టల్లోనే నిరసన తెలుపుతూ వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వీఎస్‌యూ పరిపాలన భవనం వద్ద బైఠాయించారు. కార్యాలయంలోకి అధికారులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో వర్సిటీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన విరమించకుంటే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించారు. ఈ క్రమంలో విద్యార్థులు సీఐ అబ్దుల్ కరీం కాళ్లు పట్టుకుని అధికారులతో మాట్లాడి తమకు భోజనం పెట్టించాలని వేడుకున్నారు. మరోవైపు వర్సిటీ క ళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ అందె ప్రసాద్ విద్యార్థుల వద్దకు వచ్చి చిందులు తొక్కారు. నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని వీసీతో చర్చించి బుధవారం నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇంకోవైపు వీఆర్ హైస్కూలు ప్రాంగణంలోని వర్సిటీ కళాశాల వద్ద విద్యార్థినులు బైఠాయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన వసతిగృహం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని నిరసన తెలిపారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ కొనసాగుతున్న డీకేడబ్ల్యూ కళాశాల వసతిగృహంలో వసతులు అధ్వానంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ తరగతులు బహిష్కరించారు. ఇంతలో ఇన్చార్జి ప్రిన్సిపల్ వచ్చి టీసీలు ఇచ్చి పంపేస్తామని బెదిరించడంతో విద్యార్థినులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇంత జరిగినా వీసీ, రిజిస్ట్రార్లు పరిపాలనా భవనం వద్దకు రాకపోవడంతో దాతలు ఏర్పాటు చేసిన భోజనంతో విద్యార్థులు ఆకలి తీర్చుకున్నారు. సమస్య ఇదీ విక్రమ సింహపురి యూనివర్సీటీ పీజీ కళాశాలకు సంబంధించిన వసతి గృహాన్ని కొత్తూరులో నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా క్రమం తప్పకుండా మెస్ చార్జీలు చెల్లిస్తున్నారు. అయితే పాత విద్యార్థులు బకాయి ఉన్నారనే నెపంతో ఆరు నెలలుగా మెస్నూ మూసేశారు. తాము మెస్ చార్జీలు చెల్లించినందున తమ వరకైనా భోజనం పెట్టాలని విద్యార్థులు కోరినా వర్సిటీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఈ విద్యార్థులు అప్పటి నుంచి భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థినులు కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరు డీకేడబ్ల్యూ కళాశాల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.2 వేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లించారు. అయితే ప్రస్తుతం నూతన హాస్టల్ లోకి మార్చితే మరోమారు కాషన్ డిపాజిట్ చెల్లించమంటుండటంతో విద్యార్థినులు మండిపడుతున్నారు. -
విక్రమ సింహపూరి యూనివర్సిటీపై విద్యార్ధుల దాడి!
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిపాలన భవనంపై ఏబీవీపీ విద్యార్థులు శుక్రవారం దాడి చేశారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన నేపథ్యంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులతో విద్యార్ధులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్ధులు కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. పరిపాలన కార్యాలయంపై విద్యార్థుల దాడిని నిరసిస్తూ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దాడి చేసిన విద్యార్ధులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీ సిబ్బంది డిమాండ్ చేశారు. కార్యాలయంపై దాడి సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.