అక్టోబర్ పింక్ రిబ్బన్ ట్రెక్కింగ్
గుణదల : నిత్యం వ్యాయామం చేయడం ద్వారా కేన్సర్ కారకాలను నిర్మూలించవచ్చని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ మహిళా కన్వీసర్ కొప్పుల మాధవి అన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ అడ్వంచర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మొగల్రాజపురం నుంచి గుణదల కొండపైకి ‘అక్టోబర్ పింక్ రిబ్బన్’ ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి రోగానికైనా చికిత్స ఉంటుందని, అయితే కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పింక్ రిబ్బన్ రొమ్ము కేన్సర్ అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ముందస్తు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఫ్లాష్ మాబ్, ఫ్యాషన్ షోలు, ర్యాలీల ద్వారా వివిధ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం కొండపై పింక్ రిబ్బన్ ట్రెక్కింగ్‌కు గుర్తుగా గులాబీరంగు బుడగను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో రూట్ సంస్థ సిబ్బంది, ఎడ్వంచర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.