breaking news
Vidyanikethan
-
పుట్టినరోజే నాబిడ్డను కడతేర్చారు...
అనుమానస్పద స్థితిలో విద్యానికేతన్ విద్యార్థి మృతి అది ముమ్మాటికీ హత్యేనంటున్న తల్లిదండ్రులు విద్యానికేతన్ ఎదుట బైఠాయించి, నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు చంద్రగిరి: పుట్టిన రోజు అన్నాడు.. కొత్తబట్టలు తీసిచ్చాము.. ఎంతో సంతోషంగా నా బిడ్డ తన కాలేజ్‌లో మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి వచ్చిన వాడిని అన్యాయంగా ఆరోజే తోటి స్నేహితులే కడతేర్చారంటూ ఆ తల్లి పడ్డ వేదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఏ పాపం తెలియని తన కొడుకుని హతమార్చడానికి వాళ్లకి చేతులేలా వచ్చాయంటే ఆ తల్లి ఆక్రోసం పలువురిని కదలించింది. బందువుల కథనం మేరకు.. తిరుపతి పెదకాపు వీధికి చెందిన చలపతి, నాగమణిలకు ఇద్దరు కుమారులు. వారిలో రెండవ కుమారుడు నవీన్‌కుమార్(18) విద్యానికేతన్ విద్యాసంస్థలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదిన నవీన్ పుట్టిన రోజు కావడంతో కొత్తబట్టలు వేసుకుని కళాశాల చైర్మన్ మోహన్ బాబు వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఎప్పటిలాగే ఇంటిలో నుంచి కళాశాలకు పయనమయ్యాడు. అయితే నవీన్ 5వ తేది మధ్యాహ్నం నుంచి కళాశాలకు రాలేదని కళాశాల యాజమాన్యం సమాచారం అందించింది. అప్పటి నుంచి ఎంత వెతికినా నవీన్ కనిపించ కపోవడంతో, 6వతేదిన చంద్రగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా , వారు మిస్సింగ్ కేసు నమోదు చేసారు. ఈ లోగా శుక్రవారం విద్యానికేతన్‌కు ఎదురుగా ఉన్నటువంటి గుండాలకోన మడుగులో ఓ శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మతుడి కుడిచేతి వేళ్లకు ఉంగరం ఉండటంతో నవీన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మతుడు తన బిడ్డేనని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నవీన్ తల్లిదండ్రులు, బందువులు, విద్యార్థి సంఘ నాయకులు విద్యానికేతన్ వద్ద చేరుకున్నారు. ఆంబులెన్స్‌లో పోస్టమార్టంకు వెళుతున్న నవీన్ మతదేహాన్ని వారి బందువులు అడ్డుకుని నిరసనకు యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అనంత రం వారు విద్యానికేతన్ గేటు ముందు ైబైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో కళాశాల సీఈవో తులసీ నాయుడు జోక్యం చేసుకుని తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామి ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. అనుమానాలెన్నో... నవీన్ మృతి పట్ల పలు అనుమానాలు తావిస్తోంది. నవీన్‌ను కళాశాల నుంచి ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు అన్న విషయం అంతుపట్టడం లేదు. కళాశాలలో నవీన్‌కు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని పలువురు విద్యార్థులు తెలుపుతున్నారు. అంతే కాకుండా మతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అది హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. నవీన్ మృతికి ప్రేమే కారణమా? లేక మరేదైనా విభేధాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అది ముమ్మాటికీ హత్యే.. నా బిడ్డ ఎవరీ జోలికీ వెళ్లడు. ఎంతో సౌమ్యుడిగా ఉంటారు. అటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపారు. తన తోటి విద్యార్థులే కొంత మంది నా బిడ్డను కళాశాల నుంచి బయటకు తీసుకువచ్చి, ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీ కెమారాల్లో రికార్డు అయ్యింది. నాబిడ్డను చంపిన వారిని శిక్షించాలి. - నాగమణి, తల్లి. యాజమాన్య వైఫల్యమేః నవీన్ మృతికి యాజమాన్యం వైఫల్యమే కారణం. గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నా పోలీసులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాల్లో నాశిరకం సీసీ కెమారాలను పెట్టి విద్యార్థుల జీవితాలతో వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై ఏఐటీయూసీ దృష్టికి తీసుకెళ్తాం. -విశ్వనాథం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. -
నారాయణస్వామి సేవలు ఆదర్శనీయం
పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి విద్యానికేతన్‌లో నారాయణస్వామి విగ్రహావిష్కరణ చంద్రగిరి : ఉపాధ్యాయుడిగా నారాయణస్వామి నాయుడు సేవలు ఆదర్శనీయమని శాంత బయోటిక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబు తండ్రి, దివంగత ఉపాధ్యాయులు నారాయణస్వామి నాయుడు విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహాన్ని ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనజీవితంలో చీక టిని పారద్రోలి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు నింపే ఒకే ఒక్కడు గురువన్నారు. నారాయణస్వామి నాయుడు ఎన్నో వేలమంది పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ మోహన్‌బాబు నారాయణస్వామినాయుడును తండ్రిగానే కాకుండా గురువుగా భావించి విగ్రహావిష్కరణ చేయడంతో ఆయన జన్మను చరితార్థం చేసుకున్నాడన్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నారాయణస్వామి లాంటి మహానుభావుడి కడుపులో పుట్టడం మోహన్‌బాబు చేసుకున్న అదృష్టమన్నారు. మంచితనం, నిబద్ధత కలిగిన వ్యక్తి నారాయణస్వామి పిల్లలకు చదువు చెప్పాలని సంకల్పించి చదువుతోపాటు మంచిని బోధించిన మహనీయుడన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ఒక తండ్రిని గురువని ఇలా సత్కారం చేసిన మోహన్‌బాబు నిజంగా అదృష్టవంతుడన్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ తాను కూడా 19 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగానన్నారు. చివరగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మోహన్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇలా విగ్రహ రూపంలో కాకుండా తల్లిదండ్రులను గుండె గుడిలో పెట్టుకున్నవారే చిరస్థాయిగా ఉంటారన్నారు. టీచర్స్ డే సందర్భంగా నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు కుటుంబసభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.