హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఆత్మహత్య
                  
	వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ సంజయ్ వాల్వానీ (44)ఆత్మహత్యకు పాల్పడ్డారు.   బ్రూక్లిన్  లోని తన ఇంటి పడకగదిలో చనిపోయివున్నాడని,  ఆతహత్య చేసుకొని  వుండొచ్చని   బుధవారం   స్థానిక మీడియా వెల్లడించింది.  హెడ్జ్ ఫండ్ సంస్థ విసుం అసెట్ మేనేజ్మెంట్ ఎల్పీ లో  పోర్ట్ఫోలియో మేనేజర్ గా పనిచేసిన వాల్వానీ  జెనెరిక్  డ్రగ్ ఆమోదాలకు సంబంధించిన రహస్య సమాచారంతో  స్టాక్ ఎక్స్చేంజ్  వ్యాపారంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే  ఆరోపణలున్నాయని  వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల నివేదించింది. గత వారం వచ్చిన ఈ  ఇన్ సైడర్ ట్రేడింగ్  నేపథ్యంలో వాల్వానీ ఆత్మహత్య   ఆందోళన సృష్టించింది.  
	
	 మెడపైన తీవ్ర గాయంతో చనిపోయివుండడాన్ని గమనించిన ఆయన భార్య  పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలంలో కత్తితోపాటు,  సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి  తెలిపారు.   ఇదొక భయంకరమైన విషాదమని, నమ్మశక్యంగా లేదని వాల్వాని న్యాయవాదులు  తెలిపారు. అతను ఒక మంచి భర్త, తండ్రి, సోదరుడు,కుమారుడు అంకిత స్నేహితుడు, సహచరుడు మరియు గురువు అని న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు. అతనిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపితమైతేతప్ప అతని కుటుంబానికి  శాంతి లేదని వ్యాఖ్యానించారు. వాల్లాని ఎల్లప్పుడూ తన నిజాయితీని  పాటించేవాడని తెలిపారు.