breaking news
vaikuntam Q complex
-
వైకుంఠంలోనూ అదనపు లడ్డూలు
సాక్షి, తిరుమల: తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సామాన్య భక్తులకు ప్రస్తుతం సబ్సిడీ ధరకు ఒక్కొక్కటి రూ. 10 చొప్పున ఇస్తున్న రెండు లడ్డూలతోపాటు ఒక్కొక్కటి రూ. 25 చొప్పున మరో రెండు లడ్డూలు ఇవ్వాలని శుక్రవారం టీటీడీ ఈవో డి.సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నిర్ణయించారు. సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సబ్సిడీ ధర రూ. 10 చొప్పున రూ. 20కి రెండు లడ్డూ టోకెన్లు అందజేస్తున్నారు. కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగానూ, రూ. 10 చొప్పున రూ. 20కి రెండు లడ్డూ టోకెన్లు ఇస్తున్నారు. దీంతోపాటు భక్తులు అదనంగా లడ్డూలు తీసుకునేందుకు ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్ ద్వారా రూ. 25 చొప్పున రూ. 50కి రెండు, రూ. 100కి నాలుగు లడ్డూలు ఇస్తున్నారు. ఇదే తరహా కౌంటర్‌ను వైకుంఠం కాంప్లెక్స్‌లోనూ ప్రారంభించి భక్తులకు రూ. 25 చొప్పున రూ. 50కి రెండు లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించారు. మళ్లీ రూ. 2 కవర్ల విక్రయం బుధవారం నుంచి భక్తులకు టీటీడీ కవర్లు (బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు) ఉచితంగా అందజేశారు. అదనపు కవర్ల కోసం భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో 48 గంటలు గడవకు ముందే ఉచిత కవర్ల విధానాన్ని టీటీడీ ఉపసంహరించుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి రూ. 2 చొప్పున కవర్ల విక్రయాన్ని తిరిగి ప్రారంభించింది. లక్కీడిప్ కోటా విడుదల సామాన్య భక్తులు అరుదైన సేవల్లో శ్రీవారిని దర్శించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దానిలో భాగంగా లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందేందుకు ఫిబ్రవరి కోటాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో తోమాలసేవ 15 టికెట్లు (ఒకరికి రూ. 220), అర్చన 132 (ఒకరికి రూ. 220), మేల్‌ఛాట్‌వస్త్రం 4 (దంపతులకు రూ. 12,250), పూరాభిషేకం 24 (ఒకరికి రూ. 750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా తేదీల్లో ఆలయంలో శ్రీవారికి నిర్వహించే సేవలకు ముందు రోజు తిరుమలలోని విజయా బ్యాంకులో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. కాగా, శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలు పేరుకు పోనీయకుండా ప్రతి నెలా ఈ-టెండర్లు నిర్వహించాలని టీటీడీ ఈవో ఆదేశించారు. ఈ విషయంపై శుక్రవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజుతో కలిసి అధికారులతో చర్చించారు. -
వైకుంఠాన్ని తాకిన ఆగ్రహం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడుగేట్లు విరగ్గొట్టిన భక్తులు దర్శనం ఆలస్యంపై టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు సర్వదర్శనం క్యూల్లో కిక్కిరిసిన భక్తులు సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం, బస కోసం తిరుమలలో అష్టకష్టాలు పడిన సామాన్య భక్తులు ద్వాదశి రోజు ఏకంగా కంపార్ట్మెంట్ల గేట్లను విరిచి టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దర్శనం ఆలస్యమవుతోందని అరుపులు కేకలు వేస్తూ రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్మెంట్ల గేట్లను విరిచేశారు. శనివారం పోటెత్తిన భక్తుల రద్దీతో ఏకాదశి నాటి వైఫల్యాలను సవరించుకున్న టీటీడీ అధికారులు ఆదివారం ద్వాదశి రోజున సామాన్య భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కాలిబాటలో నడచివచ్చిన భక్తులు, సర్వదర్శనంలో వేచి ఉండే భక్తుల క్యూలు వేగంగా కదిలేలా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ, తమకు దర్శనం ఆలస్యమవుతోందని రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మూకుమ్మడిగా గేట్లను నెట్టివేయటంతో పాట్లాక్లు, గడియలు ఊడిపోయాయి. తొలుత 9వ నంబర్ కంపార్ట్మెంట్లో పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఆ కంపార్ట్మెంట్ గేట్‌ను విరగ్గొట్టారు. ఆ తర్వాత 10, 14, 15, 22, 23, 24 .. ఇలా ఏడు కంపార్ట్మెంట్ల గేట్లను విరగ్గొట్టి తలుపులు పక్కకు తొలగించి దర్శనం కోసం పరుగులు తీశారు. దీనివల్ల పక్కనే ఉన్న ఇతర కంపార్ట్మెంట్లలోని భక్తులు కూడా అరుపులు కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను వారించారు. వరుస క్రమంలో కంపార్ట్మెంట్లను అనుమతిస్తున్నప్పటికీ భక్తులు కొందరు గేట్లు విరిచి ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించారని అక్కడి టీటీడీ సిబ్బంది తెలిపారు. తర్వాత విరిగిన ఏడు కంపార్ట్మెంట్ల గేట్లకు అప్పటికప్పుడే వెల్డింగ్ చేశారు. శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని ఆదివారం శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏడాదిలో బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు, అనంత పద్మనాభస్వామి వ్రతం, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి రోజున పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా వేకువజామున 4.30 గంటలకు సుదర్శన చక్రతాళ్వారు ఆలయం నుంచి ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ పుష్కరిణికి తరలివచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి సుదర్శన చక్రతాళ్వారుకు పవిత్ర స్నానం చేశారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు.