breaking news
Utti celebrations
-
‘ఆ కుండ తయారు చేసిందెవరో.. వారికి రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్ట్ ఇద్దాం
సాక్షి, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ వీడియో వైరల్‌గా మారుతుందో తెలియదు. చిన్న వీడియో అయినా కూడా బాగుంటే దూసుకుపోతుంది. అందులో ఉన్నవారు రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతారు. ఇలాంటివెన్నో జరిగాయి. తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో అంతా మట్టి కుండ చుట్టూ తిరుగుతోంది. ఆ కుండ తయారుచేసిన వారెవరో తెలుసుకోండి.. అతడికి మనదేశంలోని రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు అప్పగిద్దాం’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరేమో ఆ కుండను ఫెవికాల్తో తయారు చేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మన మట్టి మహిమ అని మట్టిదనం గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకోండి. చదవండి: పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? కృష్ణాష్టమి సందర్భంగా ఓ చోట ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. పై వరకు చేరిన యువకులు ఆ కుండను కొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. రాయి తీసుకుని కొట్టినా కూడా కుండ పగలడం లేదు. మరో యువకుడు కూడా వచ్చాడు. ఆ యువకుడైనా ఉట్టి కొడతాడమోనని గ్రామస్తులు ఈలలు, కేరింతలు చేస్తూ ఉత్సాహ పరిచారు. అతడికి కూడా నిరాశే ఎదురైంది. రెండు చేతులతో పట్టుకుని బలంగా కొడుతున్నా ఆ కుండ కొంచెం కూడా పగలలేదు. దీంతో గ్రామస్తులంతా పగలబడి నవ్వారు. చివరకు ఆ ఉట్టికుండ పగిలిందో లేదో తెలియదు కానీ 30 సెకన్లు ఉన్న ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది. కామ్‌దేవ్ బాబా అనే ట్విటరటీ ఈ వీడియో షేర్ చేశాడు. ‘ఆ కుండ ఎవరో తయారుచేశారో కనుక్కోండి! అతడికి మనదేశంలో రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు ఇద్దాం’ అని కామ్‌దేవ్ బాబా రాసుకొచ్చాడు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి Find the guy who made this Matki and give him all the Highways and Bridges contract in whole of India 😅😊 pic.twitter.com/qJZY7lJoKB — KamDev Baba (@TheKamDevBaba) September 10, 2021 -
‘ఉట్టి’.. ఇకపై సాహసక్రీడ..!
ప్రకటించిన బీజేపీ సర్కార్ సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాలను ‘సాహస క్రీడ’ల జాబితాలో చేర్చాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం క్రీడా శాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. ఉట్టి ఉత్సవాల్లో గోవిందా బృందాల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. నిర్వాహకులు అందజేసే నగదు బహుమతి, ఇతర పారితోషికాలకు ఆశపడి బృంద సభ్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అనేక మంది పైనుంచి కిందపడి గాయపడడం, మృతి చెందడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉట్టి ఉత్సవాన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ముంబై హైకోర్టు ఉట్టి ఉత్సవాలపై అనేక ఆంక్షలు విధించింది. కోర్టు నిర్ణయాన్ని నగరంలోని అన్ని సార్వజనిక గోవిందా బృందాలు వ్యతిరేకించాయి. దీంతో కోర్టు కొన్ని నియమాలు సడలించడంతో ఈ ఏడాది ఎప్పటిలానే ఉత్సవాలు నిర్వహించారు. కాని ఈ ఉట్టి ఉత్సవాలను సాహస క్రీడా జాబితాలో చేర్చాలనే డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో మానవ పిరమిడ్లు నిర్మించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కాని మన దేశంలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎక్కడ కనిపించదు. కాగా, దీన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చడంవల్ల నియమ, నిబంధనాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని నిబంధనలతో కూడిన ప్రత్యేక జాబితాను తయారుచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ క్రీడను గోవిందా బృందాలు మరింత సురక్షితంగా ఆడేందుకు వీలుపడనుందని తావ్డే అభిప్రాయపడ్డారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ అసెంబ్లీ సభాగృహంలో గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాడ్ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. శాసన సభలో కరువుపై చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతుండగా ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం మళ్లీ సమావేశాలను ప్రారంభించినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. కాగా, సభ్యుల ఆందోళన సమయంలో పోడియంలోకి అవాడ్ దూసుకెళ్లడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పందించారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించారు. అనంతరం జితేంద్ర అవాడ్ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ హరిబావు బాగడే ప్రకటించారు. -
ఉల్లాసంగా ఉట్టి ఉత్సవం
సాక్షి, ముంబై: శ్రీకృష్ణాష్టమి పర్వదినంలో భాగంగా ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉట్టిఉత్సవాలను (దహీహండీ) ఘనంగా నిర్వహించారు. ముంబైతోపాటు శివారు ప్రాంతాలు, ఠాణే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘గోవిందు ఆలారే.... అలా.... గోవిందురే.... గోపాల’ అనే నినాదాలు మార్మోగాయి. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణతో కనువిందు చేశారు. ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో ఉట్టి ఉత్సవ మండళ్ల సభ్యుల ఆనందం రెట్టింపయింది. బాంబే హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఈసారి ఉట్టి ఉత్సవాల్లో హుషారు తగ్గుతుందని అంతా భావించారు. దీనికితోడు పోలీసులు ఆంక్షలు, గోవిందులుగా చిన్నారులను వినియోగించవద్దంటూ కోర్టులు, బాలల హక్కుల సంఘం ఆదేశించడం తెలిసిందే. అయితే హైకోర్టు విధించిన (18 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనకూడదని) కొన్ని ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించడంతో మండళ్లకు కొంత ఊరట లభించింది. అయితే 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడాన్ని మాత్రం సుప్రీం నిషేధించింది. అక్కడక్కడ పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొన్నా, పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. విషాదం నింపిన గోవిందుడి మృతి అయితే కొన్ని చోట్ల ఉత్సవాల్లో 20 మందికిపైగా గోవిందులు కిందపడి గాయపడ్డారు. వీరిలో ఒకరు మరణించగా, క్షతగాత్రుల్లో 12 మందిని పరేల్ కేం ఆస్పత్రికి, ముగ్గురిని సైన్ ఆస్పత్రికి, ఒకరిని నాయర్, మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించారు. మృతుణ్ని లాల్బాగ్ ప్రాంతంలోని సాయి సదన్ సార్వజనిక గోవింద మండలికి చెందిన రాజేంద్ర ఆంబేకర్ (43)గా గుర్తించారు. ఉట్టి పగుల గొట్టేందుకు ఈ బృందం ఠాణేకి వెళ్లింది. ఉట్టి పగుల గొట్టిన తరువాత ఆనందంతో నృత్యం చేస్తుండగా రాజేంద్రకు గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలాడు. వెంటనే అతణ్ని ఠాణేలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా మండళ్ల మధ్య తీవ్ర పోటీ కనిపించింది. పారితోషికాల కోసం ప్రాణాలు లెక్కచేయక గోవిందులు మానవ పిరమిడ్లు నిర్మించారు. కోర్టు నియమాల ప్రకారం ఐదు అంతస్తులు (20 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తున పిరమిడ్ నిర్మించకూడదు. అనేక చోట్ల ఏడు అంతస్తుల వరకు మానవ పిరమిడ్లు నిర్మించి భారీ పారితోషికాలు దక్కించుకున్నారు. ఓటర్లకు గాలం.. ఇటు ఓటర్లను, అటు గోవిందుల బృందాలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు భారీగా నజరానాలు ప్రకటించాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులకు ఇదో మంచి అవకాశంగా భావించారు. గృహనిర్మాణశాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ నేతృత్వం వహిస్తున్న వర్లీ సంకల్ప్ ప్రతిష్టాన్ జాంబూరీ మైదాన్‌లో భారీ ఉట్టిని ఏర్పాటు చేసింది. ఠాణేలో సంస్కృతి ప్రతిష్టాన్ భారీ నగదు పారితోషికాలను ప్రకటించింది. వీరితోపాటు ఎమ్మెన్నెస్ తరపున ఘాట్కోపర్లో ఎమ్మెల్యే రామ్ కదమ్, శివసేన తరపున ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్, ఎన్సీపీ నాయకుడు, మంత్రి జితేంద్ర అవాడ్, కాంగ్రెస్ మంత్రి నసీం ఖాన్ తదితరులు తమ తమ నియోజకవర్గాల్లో ఉట్లు ఏర్పాటు చేశారు. గోవిందుల బృందాలను, స్థానిక ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలన్నీ పోటీపడ్డాయి. సినీతారలు మొదలుకుని టీవీ నటీనటులు, ఇతర ప్రముఖులను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేశారు. వేదికపై కళాకారులు సంప్రదాయ నృత్యం లావణీ ప్రదర్శించారు. మరాఠీ గీతాలు ఆలాపించే ఆర్కెస్ట్రా బృందాలు వినోదం పంచాయి. కొన్నిచోట్ల వివిధ సాంస్కృతిక, భోజ్‌పురి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అంతటా భారీ భద్రత కోర్టు నియమాలు ఉల్లంఘించకుండా చూసే బాధ్యతలు బాలల హక్కుల సంఘం పోలీసులకు అప్పగించింది. దీంతో సోమవారం నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 30 వేల పోలీసులు నగర రహదారులపై గస్తీ నిర్వహించారు. లౌడ్ స్పీకర్‌పైనా ఆంక్షలు విధించారు.హెల్మెట్లు లేకుండా తిరుగుతున్న గోవిందుల బృందాలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసింది. గాయపడిన గోవిందులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ప్రభాదేవిలోని సిద్ధివినాయక మందిరం ట్రస్టు నాలుగు అంబులెన్సులను సిద్ధంగా ఉంచింది. వీటిని లాల్బాగ్, ైబె కల్లా, పరేల్, వర్లీ ప్రాంతాల్లో ఉంచింది. ఇందులో వైద్యుల బృందంతోపాటు ప్రాథమిక చికిత్స సామాగ్రి ఉంచింది. తదుపరి వైద్యం అవసరమైతే సమీపంలో ఉన్న ఆస్పత్రికి ఉచితంగా తరలిస్తారు. స్టర్లింగ్ వోకార్డ్ ఆస్పత్రి కూడా ఉచితం వైద్య సేవలు అందించేందుకు అంబులెన్సును సిద్ధంగా ఉంచింది. బీఎంసీ సన్నద్ధం............ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన గోవిందుల బృందాలకు వెంటనే వైద్యం అందించేందుకు బీఎంసీ ప్రత్యేకంగా కొన్ని పడకలను కేటాయించింది. కేం, సైన్, నాయర్ ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున, శివారు ప్రాంతాల్లోని 26 ఆస్పుత్రుల్లో 10 పడకల చొప్పున కేటాయించారు. ఇక్కడ 24 గంటలు వైద్యులు, ఎక్స్ రే, ల్యాబ్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు బీఎంసీ ఆస్పత్రుల వైద్య, విద్యా శాఖ డెరైక్టర్ డాక్టర్ సుహాసినీ నాగ్దా చెప్పారు. మహిళ గోవిందు బృందాలకు ఇబ్బందులు.. 12 ఏళ్లలోపు పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన ఆంక్షల ప్రభావం మహిళా గోవిందుల బృందాలపై పడింది. వీరిలో 30 శాతానికిపైగా పిల్లలు ఉంటారు. ముంబైలో సుమారు 50 వరకు సార్వజనిక మహిళ గోవిందుల బృందాలు ఉన్నాయి. ఆంక్షల కారణంగా దాదాపు 15 బృందాలు ఈసారి ఉట్టి ఉత్సవాలకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని దూరప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఉట్లు పగులగొట్టాయి.