
Janmashtami 2025 శ్రీకృష్ణుని జననాన్ని సూచించే పండుగ జన్మాష్టమి. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి పండగకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణ భక్తులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. శ్రీకృష్ణ జననానికి ప్రతీకగా దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబ వుతాయి. జన్మాష్టమి ఉపవాస నియమాలు, ఆచారాలు తెలుసు కుందాం.
భాద్రపద మాసం కృష్ణ పక్షం (చీకటి పక్షం) అష్టమి (ఎనిమిదవ రోజు) నాడు జన్మాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 16 శనివారం రోజు వస్తుంది. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు పూజాదికాలునిర్వహించి , ఉపవాసాలు పాటిస్తారు. భజనలు, గీతా పఠనం, కృష్ణ లీల భక్తిగీతాలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు.
శ్రావణ బహుళ కృష్ణాష్టమి తిథి 16 ఆగస్టు 2025 రోజంతా ఉంది..రాత్రి 10 గంటల 52 వరకు ఉంది. అష్టమి తిథి ముగిసిన తర్వాతే జన్మాష్టమి వ్రతం పరిసమాప్తం అవుతుందని పండితుల మాట.
ఉపవాసం : జన్మాష్టమి సమయంలో, భక్తులు రెండు రకాల ఉపవాసాలు పాటిస్తారు.
నిర్జల ఉపవాసం: ఈ ఉపవాసంలో, భక్తులు 24 గంటలు ఆహారం ,నీరు రెండూ తీసుకోకుండా తినకుండా, అర్ధరాత్రి ప్రార్థన (ఆర్తి) తర్వాత ఉపవాసం విరమిస్తారు.
ఫలహర ఉపవాసం: పండ్లు , పాలు, నీరు, తేలికైన ఆహారాలను తీసుకుంటారు. ధాన్యాలు, ఉల్లిపాయలు వెల్లుల్లి, లాంటివి వాటిని తీసుకోరు.
ఉదయాన్నే నిద్రలేచి, పవిత్ర స్నానం చేసి, ఇంటిని, పూజా మందిరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. లడ్డూ గోపాలుడిని (బాల కృష్ణ విగ్రహం) పాలు, పెరుగు, నెయ్యి, తేనె , నీటితో స్నానం చేసి, చక్కగా అలంకరిస్తారు. ఇంట్లోనే శుచిగా ప్రసాదాన్ని తయారు చేస్తారు. ముఖ్యంగా పాలు,పెరుగు పాలతో చేసిన స్వీట్లు,నెయ్యి అంటే కృష్ణుడికి పరమప్రీతి. సంకల్పంతో నిష్టగా ఉపవాసం రోజంతా, మంత్రాలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. శ్రీకృష్ణుని జన్మ హారతి పూర్తయిన తర్వాత అర్ధరాత్రి ఉపవాసం ముగించి ప్రసాదాన్ని నివేదించి, చిన్నారులకు భక్తులకు ప్రసాదం పంచి పెడతారు.

ఆనందకోలాహలంగా ఉట్టివేడుక
కృష్ణాష్టమి పండగ రోజు చాలా ప్రాంతాలలో ఉట్టి కొట్టే వేడుక చాలా సంబరంగా జరుగుతుంది. బాల కృష్ణుడిగా అల్లరి, గోపికలతో బాలగోపాలుని చిలిపి చేష్టలు, అందులోని పరామర్థం బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడి జన్మదినమైన రోజు ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తారు. ఈ ఉట్టిలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు. పాలు, పెరుగుతో పాటు పసుపు కొమ్ములు, కొన్ని నాణేలు పువ్వులు వేస్తారు.ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తుంటారు. వీటన్నింటిని దాటుకొని ఉట్టికొట్టిన వారు విజేతగా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన, సమైక్య జీవనానికి జన్మాష్టమి వేడుకలు నిదర్శనగా నిలుస్తాయి.
ఇదీ చదవండి: లండన్‌నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్