breaking news
Usmankhan
-
అవిశ్వాసుల బెదిరింపులు
ప్రవక్త జీవితం ‘అల్లాహ్ గొప్పవాడు, పరమ పవిత్రుడు. నేను కేవలం ఆయన సందేశ వాహకుణ్ణిమాత్రమే. ఆయన ఆదేశించింది చేయడమే నా బాధ్యత. ఆయన తలచుకుంటే ఏమైనా చేయగలడు. మీరడిగే తియ్యటి సెలయేర్లు, ఉద్యానాలు, అందమైన భవంతులు నాకు అనుగ్రహించగలడు’ అన్నారు ప్రవక్త ప్రశాంతంగా. ‘సరే, ముహమ్మద్ ! మేము నీ ముందు ఎన్నో ప్రతిపాదనలు ఉంచాం. నువ్వు దేనికీ అంగీకరించలేదు. ఇక మా తడాఖా ఏమిటో చూపిస్తాం. సిద్ధంగా ఉండు. ఎవరడ్డమొస్తారో మేమూ చూస్తాం’ అన్నారు బెదిరిస్తూ. చివరికి అంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త అడ్డు తొలగించుకోవాలని తీర్మానించుకున్నారు. కానీ వారిలో ఒకడు ప్రవక్త హత్యానంతర పరిస్థితులపై భయసందేహాలు వ్యక్తపరిచాడు. ‘అవును. ముహమ్మద్‌ను చంపితే అబూతాలిబ్ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకోడు. కచ్చితంగా ఎదురు తిరుగుతాడు. వాళ్ళ వంశం మొత్తం ఏకమైపోతుంది. పైగా వాళ్ళు ఖురైష్ జాతి అగ్రనాయకులు. అలాంటి వారి విషయంలో తీవ్ర నిర్ణయం సరికాదేమో’ అన్నాడు మరొకడు. దీంతో వారి ఉత్సాహమంతా జావగారిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ చల్లబడిపోయారు. ఇప్పుడేమిటి కర్తవ్యం? తల బద్దలు కొట్టుకున్నారు. చర్చోపచర్చల అనంతరం అందరూ కలసి ఒక స్థిరనిర్ణయానికొచ్చారు. దాని ప్రకారం - అందరూ కలిసి ఓ నవ యువకుణ్ణి వెంటబెట్టుకొని అబూతాలిబ్ దగ్గరికి వెళ్ళారు. ‘ఈ యువకుడి పేరు వలీద్. ఎంతో సౌందర్యవంతుడు, గొప్ప పరాక్రమ శాలి, వ్యూహకర్త. ఈరోజు నుండి ఇతను మీ కొడుకే. మీకు మంచి సలహాలు, సూచనలిస్తూ అన్ని విధాలా అండదండగా ఉంటాడు. కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఇతనికి బదులుగా మాకు ముహమ్మద్‌ను అప్పగించండి చాలు. అతని సంగతి మేము చూసుకుంటాం. లేని పోనివి సృష్టించి అతడు మన జాతిని కకావికలం చేశాడు. అతని చేష్టల పట్ల మీరుకూడా సంతృప్తిగా లేరనే అనుకుంటున్నాం. మీకు కూడా ఒకమంచి యువకుడు, ముహమ్మద్ కంటే యోగ్యుడు లభించినట్లవుతుంది’ అన్నారు ఛీ..! ఎంత నీచానికి దిగజారారు? సంఘంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్నవారి నోట ఇలాంటి మాటలా! ఎంతటి అమానుషత్వం... ఎంతటి క్రూరత్వం! అనుకున్నారు మనసులో.. పెద్దమనుషులుగా వచ్చినవారి నోట ఇలాంటి మాటలువిని అబూతాలిబ్ మనసు చాలా బాధ పడింది. కొద్దిసేపటి తరువాతగాని ఆయన తేరుకోలేకపోయారు. ‘చాలు చాలు.. ఇక ఆపండి మీ ప్రేలాపనలు. ఈ యువకుణ్ణి ఉంచుకొని, బదులుగా నా ముహమ్మద్‌ను మీకు అప్పగించాలా..! నేను మీ వాణ్ణి దగ్గరుంచుకొని చక్కగా మేపుతుంటే, మీరు మావాణ్ణి చిత్రహింసల పాలుచేస్తూ చంపేస్తారా? ఎంత అన్యాయం.. ఎంత అమానవీయం.. ఎంతటి అమానుషం! దైవసాక్షిగా చెబుతున్నాను. ఇది జరగని పని. ముమ్మాటికీ జరగని పని. ఏం చేసుకుంటారో చేసుకోపోండి’ అన్నారు అబూతాలిబ్ ఆగ్రహంతో. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతాది వచ్చే వారం) -
అవిశ్వాసుల ఆగడాలు
ప్రవక్త జీవితం సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ధర్మం విస్తరిస్తున్నకొద్దీ అవిశ్వాసుల ఆగడాలు కూడా అధికమయ్యాయి. ప్రవక్తను, ఆయన అనుచరులను రకరకాల మాటలనడం, అపనిందలు వేయడం, వారిపైకి రౌడీమూకలను ఉసిగొల్పడం లాంటి వేధింపులు పెరిగిపోయాయి. అయినా సమాజంలోని సద్వర్తనులు, ఆలోచనాపరులు ధర్మపరివర్తన చెందుతూనే ఉన్నారు. ప్రవ క్త అనుచరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఒకరోజు అవిశ్వాస ప్రముఖులు కాబా గృహంలో కూర్చొని ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ‘మనమంతా చచ్చిన తరువాత మళ్ళీ బ్రతికి లేస్తామట. ఇక్కడ చేసిన పనుల్ని గురించి అక్కడ సమాధానం చెప్పుకోవాలట. మంచిపనులు చేస్తే సత్ఫలితమట, చెడ్డపనులు చేస్తే దుష్ఫలితమట.. వింత వింతగా ఉన్నాయి కదా ఈ మాటలు.. ఎప్పుడైనా విన్నామా ఇలాంటి ప్రేలాపనలు’ అన్నాడు అందులోని ఒక వ్యక్తి. ‘అంతే కాదు, స్వర్గనరకాలు కూడానట... బుద్ధిలేకపోతే సరి’ అన్నాడు మరోప్రబుద్ధుడు. ‘ఇదంతా కాదుగాని, అతన్నొకసారి ఇక్కడికి పిలిచి మాట్లాడదాం. నువ్వు చెప్పే మాటలకు రుజువులు, ఆధారాలు చూపించమని నిలదీద్దాం. ఈ విధంగా అతన్ని హింసించడానికి, వేధించడానికి మనకొక సాకు దొరుకుతుంది. ఎవరూ పల్లెత్తుమాట అనడానికి కూడా అవకాశం ఉండదు’ అన్నాడు మరొకడు. (వచ్చేవారం మరికొంత) - ఎండీ ఉస్మాన్‌ఖాన్