వసూళ్లు అంతంతే
                  
	ఉరవకొండ 100 శాతం
	రాయదుర్గం 41 శాతమే
	– నిరాశాజనక ఫలితాలు వెల్లడించిన మార్కెటింగ్‌శాఖ
	 
	అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది మార్కెటింగ్‌శాఖకు కలిసిరాలేదు. ఓ వైపు కరువు పరిస్థితులు మరోవైపు ఆ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, చేతివాటం వల్ల లక్ష్య సాధనలో విఫలమయ్యారు. 13 మార్కెట్‌యార్డులు, వాటి పరిధిలో ఉన్న సబ్యార్డులు, 26 చెక్‌పోస్టుల ద్వారా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.17.11 కోట్లు మేర వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 59 శాతం అంటే రూ. 10.14 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేశారు. వంద శాతం లక్ష్య సాధనలో రూ.6.97 కోట్లు వసూళ్లు చేయడంలో చతికిలపడ్డారు. అయితే కొన్ని మార్కెట్‌యార్డుల పరిస్థితి బాగానే ఉన్నా, మరికొన్నింటిలో పూర్తిగా నిరాశాజనకంగా ఫలితాలు రావడంతో ఆర్జేడీ, ఏడీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడీ బి.హిమశైల ఇన్చార్జిగా పనిచేస్తున్న ఉరవకొండ మార్కెట్‌యార్డు 100 శాతం సాధించగా, వసూళ్లకు బాగా అవకాశం ఉన్న రాయదుర్గం యార్డు 41 శాతం వసూళ్లలో ఆఖరి స్థానంలో నిలవడం గమనార్హం. ఇక తాడిపత్రిలో కూడా 48 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. మిగతా వాటిలో అనంతపురం 61 శాతం, ధర్మవరం 50 శాతం, గుత్తి 77 శాతం, గుంతకల్లు 67 శాతం, హిందూపురం 69 శాతం, కదిరి 52 శాతం, కళ్యాణదుర్గం 56 శాతం, మడకశిర 56 శాతం, పెనుకొండ 60 శాతం, తనకల్లు 60 శాతం వసూళ్లు సాధించాయి. మొత్తమ్మీద అనుకున్న ఫలితాలు రాకపోవడంతో మార్కెటింగ్ శాఖ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.  ఈ క్రమంలో ఈనెల 4న మార్కెట్‌యార్డు సెక్రటరీలు, సూపర్వైజర్లతో మార్కెటింగ్‌శాఖ ఏడీ ‘క్రిటికల్ రివ్యూ’ పేరుతో సమగ్ర సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 
	 
	 మార్కెట్‌యార్డుల లక్ష్యం, సాధించిన వసూళ్లు ఇలా...
	––––––––––––––––––––––––––––––––––––––––––
	మార్కెట్‌యార్డు లక్ష్యం వసూలైంది
	–––––––––––––––––––––––––––––––––––––––––––
	అనంతపురం  03.67 కోట్లు 02.24  కోట్లు
	హిందూపురం 02.71  ,,   01.85  ,,
	తాడిపత్రి       02.88  ,,   01.37  ,, 
	రాయదుర్గం   01.66  ,,   68.42   లక్షలు
	ధర్మవరం     70.00 లక్షలు 35.17   ,,
	గుత్తి           55.00  ,, 42.26  ,,
	గుంతకల్లు    60.00  ,, 40.07  ,,
	కదిరి         93.00  ,, 48.80  ,,
	కళ్యాణదుర్గం 99.00  ,, 55.60  ,,
	మడకశిర    38.00  ,, 21.11  ,,
	పెనుకొండ   50.00  ,, 30.09  ,,
	తనకల్లు     73.00  ,, 43.70  ,,
	ఉరవకొండ  81.00  ,, 81.01  ,,
	–––––––––––––––––––––––––––––
	మొత్తం 13 17.11 కోట్లు 10.14 కోట్లు
	–––––––––––––––––––––––––––––