breaking news
Unrecognized School
-
ప్రై‘వేటు’
♦ 137 ప్రైవేటు స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ♦ పట్టణ మండలాల్లోనే ఎక్కువ పాఠశాలలు ♦ వారంలోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ ♦ వివరణ సంతృప్తికరంగా లేకుంటే సీజ్! గుర్తింపులేని పాఠశాలలపై ఉచ్చు బిగుసుకుంటోంది. అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ వాటిపై కొరడా ఝళిపిం చేందుకు సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో 137 ప్రైవేటు పాఠశాలలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. వాటికి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈక్రమంలో వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారుల ద్వారా నోటీసులను ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేకుండా కొనసాగుతున్న పాఠశాలలకు రెండ్రోజుల క్రితం షొకాజ్ నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ.. వారంలోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అనుమతుల కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వ శాఖలనుంచి పొందిన సర్టిఫికెట్లకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని విద్యాశాఖ అధికారులకు అందించాలని స్పష్టం చేసింది. మొత్తంగా బడులు తెరిచేనాటికి ఆయా పాఠశాలలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే వెంటనే సదరు పాఠశాలను సీజ్ చేస్తామని ఆ నోటీసులో విద్యాశాఖ స్పష్టం చేసింది. అన్నీ పట్టణ ప్రాంతాల్లోనే.. రాజధాని నగరానికి చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అటు గ్రామీణ వాతావరణం.. ఇటు పట్టణ ప్రాంతం మిళితమై ఉంది. జిల్లాలో 37 మండలాలకుగాను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 మండలాలు పూర్తిగా.. ఏడు మండలాలు పాక్షికంగా కలిసిపోయాయి. ఈ పరిధిలో ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,250 ప్రభుత్వ పాఠశాలలుండగా.. 3,220 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం అనుమతి లేని పాఠశాలలు 137. ఇందులో అత్యధికంగా సరూర్‌నగర్ మండలంలో 28 అనుమతిలేని పాఠశాలలున్నాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ మండలంలో 19, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్ మండలాల్లో 12 చొప్పున ఉన్నాయి. మండల విద్యాశాఖ కార్యాలయాల్లో.. ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని విద్యాశాఖ ప్రచారం చేస్తోంది. ఈక్రమంలో గుర్తింపులేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ కార్యాలయంలో అందుబాటులో పెట్టింది. పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ముందు ఆ పాఠశాల నేపథ్యాన్ని తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు మండల కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. -
అనుమతిలేని పాఠశాల సీజ్
హైదరాబాద్ : ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలోని వెంకటగిరిలో కొన్నేళ్లుగా ఓ ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వం అనుమతి లేకుండానే కొనసాగుతోంది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో శుక్రవారం ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది స్కూల్‌ను సీజ్ చేశారు. గతేడాది కూడా ఈ స్కూల్‌ను సీజ్ చేయగా ఇంతవరకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవడంలో యజమాని విఫలమయ్యారు. తాము వేసిన సీల్‌ను అక్రమంగా తొలగిస్తే స్కూల్ యాజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.