breaking news
University of Southampton
-
చేపలు తింటే గర్భిణులకు మేలు
లండన్: గర్భిణులు చేపలను తింటే పుట్టే బిడ్డలకు ఉబ్బసం దరిచేరకుండా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ కాడర్ నేతృత్వంలో పరిశోధనలు జరిగాయి. కొంతమంది స్త్రీలకు వారానికి రెండు సార్లు చేపలను ఆహారంగా 19 వారాలపాటు ఇచ్చారు. మిగతా వారి పిల్లలతో పోలిస్తే చేపలను ఆహారంగా తీసుకున్న తల్లుల పిల్లలకు రెండేళ్ల వయస్సు తరువాత అలర్జీ తక్కువగా ఉందని పరిశోధకులు చెప్పారు. ప్రతికూల వాతావరణం లోనూ వ్యాధులు తక్కువగా వచ్చాయన్నారు. -
వందల కోట్ల కణాల మెదడుపై అధ్యయనానికి కొత్త పద్దతి
లండన్: వందల కోట్ల కణాలతో అతిక్లిష్టంగా ఉండే మన మెదడును మరింత బాగా అధ్యయనం చేసేందుకు వీలుగా బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. 'మల్టీకలర్ ఆర్జీబీ(ఎరుపు, ఆకుపచ్చ, నీలి) ట్రాకింగ్' అనే ఈ పద్ధతిలో మెదడును కణస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాంతిని ప్రతిఫలింపచేసే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే వైరస్ కణాలను చొప్పించడం ద్వారా మెదడు కణాలు ఏదో ఒక రంగును వెదజల్లేలా చేయవచ్చని వారు తెలిపారు. అలా చేయడం ద్వారా మెదడు కణాల చర్యలను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహాలో అధ్యయనం భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన అనేక చికిత్సలకు దోహదపడుతుందని వారు తెలిపారు. వారి పరిశోధనల వివరాలు 'సైంటిఫిక్ రిపోర్ట్స్' అనే పత్రికలో ప్రచురించారు.