breaking news
university meeting
-
400 గ్రామాల దత్తతకు ఎస్వీవీయూ శ్రీకారం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 400 గ్రామాలు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పాలకమండలి నిర్ణయించింది. యూనివర్సిటీ పాలకమండలి సమావేశం శనివారం జరిగింది. ఇన్చార్జ్ వీసీ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 30 అంశాలపై చర్చ సాగింది. సమావేశ వివరాలను వీసీ మన్మోహన్ సింగ్ మీడియాకు వివరించారు. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించామన్నారు. కర్నూలు జిల్లా బన్వాసిలో వెటర్నరీ పాలటెక్నిక్, గొర్రెల పరిశోధన స్థానం ఏర్పాటుకు పాలకమండలి ఆమోదించిందన్నారు. పాలిటెక్నిక్‌కు రూ.6 కోట్లు మంజూరు చేయాలని తీర్మానించామని చెప్పారు. ఒంగోలు జాతి పశువులపై పరిశోధనకు రూ. 3 కోట్లు, పుంగనూరు జాతి పశువులపై పరిశోధనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా వున్న అధికారుల పోస్టుల భర్తీకి సెలక్షన్ కమిటి ఏర్పాటు చేసేందకు కమిటి ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం జిల్లా సిద్ధరామాపురంలో వెటర్నరి యూనివర్సిటీ పరిధిలోని 525 ఎకరాల్లో గడ్డి క్షేత్రాల అభివృద్ధికి పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి నెల మొదటి శనివారం పశుసంవర్ధక దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..వర్సిటీలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పెట్టాలని భావిస్తున్నామన్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పశు వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఒంగోలు, పుంగునూరు జాతి అభివృద్ధికి పరిశోధనలు వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న కన్హయ్య.. తీవ్ర ఉద్రిక్తత
జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకుమార్ హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతడికి పలువురు విద్యార్థులతో పాటు సీపీఐ నేత నారాయణ స్వాగతం పలికారు. తాను ముందుగా రోహిత్ తల్లిని, అతడి సోదరుడిని కలుస్తానని, సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బహిరంగ సభకు హాజరై అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తానని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ కన్హయ్య చెప్పాడు. పోలీసులు అనుమతిస్తారనే నమ్మకం తనకు ఉందని, విద్యార్థులకు సమావేశం ఏర్పాటుచేసుకునే హక్కు ఉందని తెలిపాడు. క్యాంపస్‌లో సామాజిక న్యాయం కోసం, రోహిత్ ఆత్మకు శాంతి కలగడానికి, అతడి కలను నెరవేర్చడానికి ఉద్యమం కొనసాగించడం తన లక్ష్యమని అన్నాడు. కన్హయ్య సందర్భంగా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దాంతో అతడిని అరెస్టు చేస్తారన్న అనుమానాలు తలెత్తినా, అలాంటి ఉద్దేశం ఏదీ లేదని విమానాశ్రయంలో ఉన్న పోలీసులు చెప్పారు. అయితే, అసలు కన్హయ్యను హెచ్‌సీయూలోకి అనుమతిస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. మరోవైపు దీక్ష చేస్తానని చెబుతున్న రోహిత్ తల్లిని కూడా యూనివర్సిటీ ప్రాంగణంలోకి రానిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు కూడా కఠినమైన చర్యల దిశగా వెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనివర్సిటీకి సంబంధించినవాళ్లు తప్ప మీడియా, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఎవరినీ ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ హెచ్‌సీయూ రిజిస్ట్రార్ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. మెయిన్ గేటు తప్ప అన్నింటినీ మూసేస్తామని అందులో తెలిపారు. తగిన భద్రత కల్పించాల్సిందిగా కోరారు. ఇప్పటికే హెచ్‌సీయూ ప్రాంగణం మొత్తం పోలీసు పహరాతో కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక వ్యక్తి ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని పోలీసులు భావిస్తే అతడిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం లాంటివి ఇంతకుముందు జరిగాయి. ఇప్పుడు కూడా కన్హయ్య విషయంలో పోలీసులు అలాగే చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం గట్టి పట్టుదలతోనే కనిపిస్తున్నాయి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్సిటీ ప్రాంగణంలోనే సభ నిర్వహించుకుంటామని, తమకు వేరే వేదిక ఏమీ లేదని నాయకులు బుధవారం ఉదయం కూడా స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో మళ్లీ వీసీ అప్పారావు ప్రవేశించడం వల్లే ఉద్రిక్తతలు చెలరేగాయని వాళ్లు ఆరోపించారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు బుధవారం ఉదయం యూనివర్సిటీ గేటు వరకు వెళ్లి అక్కడ కాసేపు ఆందోళన నిర్వహించారు. గతంలో ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి కూడా యూనివర్సిటీ వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.