breaking news
Unemployed Engineers
-
కాంట్రాక్టర్లుగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఇంజనీర్స్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఇంజనీరింగ్ పట్టభద్రులను కాంట్రాక్టర్లుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంతంగా కాంట్రాక్టు పనులు చేపట్టేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించింది. కనీసం 200 మందిని కాంట్రాక్టర్లుగా మార్చే ఈ కార్య క్రమంలో భాగంగా 80 మందికి తొలి విడత శిక్షణను అంబేడ్కర్ జయంతి రోజైన శుక్రవారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తయ్యే లోపు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా ఒక్కో పనికి వర్క్ ఆర్డర్ ఇప్పిచ్చేలా ఏర్పా ట్లు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ప్రభు త్వ పనుల కోసమే ఎదురుచూ డకుండా నిర్మాణరంగానికి సంబం ధించిన ప్రైవేటు పనులు కూడా పొందాలని సూచించారు. 80 మందితో తొలిబ్యాచ్.. ఈ శిక్షణ కోసం దాదాపు 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 180 మందిని ఇంటర్వూ్య చేసి 80 మందిని తీసుకున్నారు. న్యాక్ ప్రాంగణంలో రెండు నెలల శిక్షణ అనంతరం 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, మరో 15 రోజులు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో కాంట్రాక్టు పనులపై తర్ఫీదు ఇస్తారు. కార్యక్రమంలో ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, జయేశ్‌రంజన్, డిక్కి ప్రతినిధులు రవికుమార్, రాహుల్, టీఐఐ ప్రతినిధి రాజన్న, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, న్యాక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఎదురీత ఋతువు
ప్రత్యేక ప్రశంస పొందిన కథ ‘‘మంచిని పదిచ్చి కొనుక్కోవాలి. చెడును పదిచ్చి వదులుకోవాలి’’ రామ్మూర్తి తన జీవితానుభవాల్లోంచి, తన కొడుకు కిరణ్‌కు ఎప్పుడూ చెప్పే మాట ఇది. అయినా గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకుపోవచ్చు గాని, నీళ్లు తాగించలేమన్నట్టు తరం నుండి తరానికి ఇలా అనుభవాలు, సూక్తులు, నీతులు అందించవచ్చేమో గాని, వాటిని పాటించేటట్టు చేయలేమని రామ్మూర్తికి తొందరలోనే తెలిసి వచ్చింది. అసలు రామ్మూర్తి ఏమనుకున్నాడు? కాలం మారుతుంటే విలువలు మారుతుంటాయి. కొత్తొక వింత, పాతొక రోతలా తయారవుతుంది. తన కాలంలో ఎవరైనా ఓ టీచరుద్యోగం సంపాదిస్తే, పది ఊర్లకు అతడొక ఆదర్శం. ఇవాళ బడిపంతులు కంటే, పది ఫెయిలై అక్రమంగా సంపాదించే రియలెస్టేట్ వ్యాపారికే విలువెక్కువ. ఈ ప్రమాదాన్ని గుర్తించాడు గనకనే, తల్లికోడిలా తన పిల్లలిద్దరినీ రెక్కల కిందే పొదివి పట్టుకున్నాడు రామ్మూర్తి. అలాగని తనేం ఆధునికతను వ్యతిరేకించే ఛాందసుడు కాదు. చెడును మాత్రమే వ్యతిరేకించేవాడు. ఏమున్నా లేకున్నా మనిషికి వ్యక్తిత్వం ఉండాలి. పైపై మెరుగులకు ఆశపడి మూలాలను మరిచిపోవద్దని కూడా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తనలాగే తన పిల్లలుండాలని కోరుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా నలుగురిలో తలెత్తుకొని జీవించాలన్నాడు. అందుకోసం తన జీవితాన్నే ప్రతీ రాత్రి కథగా చెప్పేవాడు. ‘‘ఇంటి నిండా గంపెడు మంది సంసారం మాది. నాలుగు మెతుకులకూ కరువే. ఒక పూట ఉంటే, మరోపూటకు ఉండదు. ఊరంతా అన్నం తింటుంటే, చిల్లిగవ్వ లేక మక్కజొన్న గడక తిని బతికిన గతం. అవమానాలు, అంటరానితనాలు, జీవితం నిండా చెరగని గుర్తులు. కరువులతో ముందుకు సాగని వ్యవసాయం. ఆత్మహత్యల బాట పట్టిన అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం వలసెల్లిపోయిన వాడలు. ఇప్పుడు ఇలా మధ్యతరగతి మనిషిగా ఎదిగినా, వెనక్కి తిరిగి చూసుకుంటే మానని గాయాలే’’. అన్నీ రామ్మూర్తికి ఇంకా గుర్తే ఉన్నాయి. మరిచిపోవాలనుకున్నా మరువలేనివి అవి. అవే తన పిల్లలకు అనుభవాలుగా చెబుతుండేవాడు. ఇలా చెప్పడంలో తనకు రెండు భయాలు. ఒకటి ఈ కాలానికి ఎదురీద లేక ఎక్కడ తన పిల్లలు ఆగమవుతారోనని ఒక భయం. రెండవది ఒకవేళ కాలాన్ని గెలిచినా, సాటి మనుషుల పట్ల ఏ బాధ్యత లేకుండా మర మనుషుల్లా, అహంకారుల్లా మారిపోతారేమోనని మరో భయం. ఈ రెండు భయాలే రామ్మూర్తిని పదేపదే తన బతుకును వల్లేసేలా చేశాయి. చూస్తుండగానే పిల్లలు యవ్వన కాలానికి చేరారు. కూతురు పెళ్లి చేశాడు. కొడుకును బీటెక్ దాకా చదివించాడు. ఎక్కడ పాడైపోతారో అనుకున్న తన భయాలు తొలగిపోయాయి. అనుకున్నంత కాకపోయినా ఒక మాదిరిగా పిల్లలు చేతికందారు అనుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడ్డది. చెట్టంత ఎదిగిన కిరణ్ ఏ కొలువు లేకుండా, ఊళ్లల్లో దేవుని పేరున ఊరుమీద వదిలేసిన ఎద్దులా తిరగడం తనకు బాధ కలిగిస్తున్నది. తనకా వృద్ధాప్యం ముంచుకొస్తోంది. రిటైర్మెంట్ కూడా దగ్గరపడుతోంది. తాను పడ్డ కష్టాలు తన పిల్లలు పడొద్దని, వెయ్యి కళ్లతో జాగ్రత్తపడినోడు రామ్మూర్తి. ఇప్పుడు మాత్రం తన కొడుక్కి ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా వస్తే బాగుండునని, ప్రతిరోజూ దేవుడి ఫొటో ముందు దండం పెడుతూనే ఉన్నాడు. తనుంటున్న కాలనీలోని తన సహోద్యోగులు, ఏ టీ కొట్టు దగ్గరో తమ పిల్లల గురించి గొప్పలు చెబుతుంటే, రామ్మూర్తికి మనసు చివుక్కుమంటున్నది. తను ఎన్ని కొనిచ్చాడు కొడుక్కి?! టెన్త్‌లో గేర్ సైకిలన్నా, ఇంటర్లో షికార్లకు బైక్ కావాలన్నా, బీటెక్‌లో కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లన్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. ఇక పాకెట్ మనీకైతే కిరణ్‌కి రామ్మూర్తి ఒక ఏటీఎం సెంటరే. అలా కిరణ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులిస్తుంటే తల్లి రాధమ్మ అడ్డుచెప్పేది. ‘‘పోనీలేవే. నేను వాడి వయసులో ఉన్నప్పుడు టీ తాగడానికి కూడా చిల్లర డబ్బుల కోసం జేబులు వెతుక్కునేవాణ్ని. కనీసం వాడైనా చిన్న చిన్న అవసరాలకు, ఇతరుల ముఖాలు చూడకుండా ఉంటే చాలు’’ అనేవాడు. ఎక్కడి నుండి ముంచుకొచ్చిందో ఆ తుఫాను. ఆన్లైన్ తుఫానట. ఇంట్లో కంప్యూటర్లో ఇరవై నాలుగ్గంటలూ అంతా ‘ఆన్లైన్ షాపింగ్’ చేయడం మొదలుపెట్టాడు కిరణ్. స్మార్ట్ ఫోన్లు, షూలు, వాచ్‌లు అవసరమున్నా లేకపోయినా రకరకాల గాడ్జెట్స్ ఆన్లైన్లో ఆర్డరివ్వడం, వాటికోసం తండ్రి డెబిట్ కార్డుని ఇష్టమొచ్చినట్టుగా వాడుకోవడం. మొదట్లో ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోలేకపోయాడు రామ్మూర్తి. తన అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్న తీరు చూసి, ఇదంతా కొడుకు మహిమే అని మాత్రం ఆ తరువాత తెలిసొచ్చి, తలపట్టుకున్నాడు. ఇది ‘గరీబీ హటావో’ కాలం కాదనుకున్నాడు రామ్మూర్తి. ‘మేకిన్ ఇండియా’ అంటే ఇదేనేమో అనుకున్నాడు. పోనీ కొన్ని వస్తువులనైనా సరిగా వాడుకున్నది లేదు. ఫేస్బుక్లో, వాట్సప్‌లో చూసి, లేటెస్ట్ వర్షన్లు, అప్డేటెడ్ సిరీస్‌లు వచ్చాయని పాత వాటిని ఆన్లైన్లో వేలం పెట్టేవాడు. అరవై వేలకు కొన్న వస్తువునైనా ఇరవై వేలకే అమ్మేసేవాడు. మళ్లీ డబ్బులు కావాలని అడగడం, లేదంటే అలగడం క్షణాల్లో జరిగిపోయేవి. కొన్నిసార్లు ఏడ్చైనా సాధించేవాడు. బైకుల మీద బైకులు మార్చాడు. అయినా రామ్మూర్తి ఏనాడు నోరు మెదపలేదు. కారణం కొడుకు మీదున్న ప్రేమే. ఏ తండ్రికైనా తన పిల్లల పట్ల ప్రేముంటుంది. కానీ, రామ్మూర్తి ప్రేమ అంతకు మించింది. తన ఊరి నుండి వచ్చే బంధువులు చిన్ననాడే కిరణ్‌ను చూసి, మీ నాన్నే మళ్లీ పుట్టిండనేవాళ్లు రామ్మూర్తితో. అది నిజమో అబద్ధమో తెలియదు, రామ్మూర్తి మాత్రం అప్పటినుండి కొడుకులో తన తండ్రిని చూసుకునేవాడు. పెద్దయ్యాక తండ్రిని బాగా చూసుకోవాలనుకున్న తన కోరిక తీరకుండానే రామ్మూర్తి, తన తండ్రిని కోల్పోయాడు. అందుకే కిరణ్ అంటే తనకు పంచ ప్రాణాలు.. ‘‘అట్లా కాదయ్యా’’ అని నచ్చచెప్పిన అనుభవమే తప్ప, చెయ్యెత్తి దండించింది లేదు. ఆనాడు తాను ఐదారు చదివినందుకే ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడేమో పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు దొరకడం లేదు. కొడుక్కు ఏదో ఒక జాబ్ పెట్టించాలని రామ్మూర్తి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. కనిపించిన ఆఫీసర్ల కాళ్లా వేళ్ల పడ్డాడు. అయినా కుదరదన్నారు. అడ్డదారిలో లంచమిచ్చి ఉద్యోగం కొనడానికి మనసొప్పలేదు. రామ్మూర్తి ప్రయత్నాలేవీ కిరణ్‌కు తెలియవు. తను చదివిన బీటెక్‌కు ఏ జాబు రాదని డిసైడ్ అయ్యాడు కిరణ్. కారణం లక్షల్లో నిరుద్యోగ ఇంజనీర్లు. ఇక లాభం లేదని తండ్రి మీద అనేక దండయాత్రలయ్యాక, ‘‘బిజినెస్ పెట్టుకుంటాను ఓ పది లక్షలివ్వమని’’ పోరు మొదలుపెట్టాడు. రామ్మూర్తికి ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడ్డట్టయ్యింది. మూడేళ్ల కిందట కూతురు పెళ్లికోసం చేసిన అప్పులే ఇంకా తీరలేదు. అప్పుడే పది లక్షలంటే ఎలా సర్దాలో అర్థంకాక, కుడితిలో పడ్డ ఎలుకలా సందిగ్ధంలో పడ్డాడు. తన యవ్వనంలో వెయ్యి రూపాయలు కూడా ఊహకు అందని విషయం. అది కూడా తండ్రి మీదపడి అడగాలనే ఆలోచన కూడా అప్పట్లో రామ్మూర్తికి లేదు. కారణం తమను బతికించడం కోసం, తండ్రి చేస్తున్న అవిశ్రాంత యుద్ధం తనకు తెలుసు. అలా ఏ అవసరానికో కొంత డబ్బు అడగాలంటే బరువనిపించి, నోరు రాక, కూలీ పనులు చేసి, తనే సర్దుకున్న గతం రామ్మూర్తిది. అవన్నీ కిరణ్‌కి కూడా తెలుసు. ఈ విలువలన్నీ ఎటు పోయాయి? ఒక దశ వరకు బాగానే విన్నాడు. ఆ తరువాత మాత్రం ఇదంతా పనికిరాని సోదిగా అనిపించింది కిరణ్‌కు. ఏ తండ్రి అయినా తన జీవితంలాగే తన కొడుకు జీవితం ఉండాలని ఎందుకు కోరుకుంటాడు. తాను నాలుగు మెట్లెక్కితే, తన కొడుకును ఐదో మెట్టు నుండి ఎక్కించాలి. అంతే తప్ప, ఇలా ప్రతిసారీ తన గతం గురించి చెప్పడం ఎందుకనుకున్నాడు కిరణ్. మాటలు పలకలేని కాసులు, తండ్రీ కొడుకుల మధ్య మాటలు లేకుండా చేశాయి. కిరణ్ ఎక్కువసేపు ఇంట్లో ఉండడం లేదు. ‘‘క్షణం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు’’ అన్నట్టు తనలాగే ఏ పని చేయకుండా ఊరిమీద పడి తిరిగే స్నేహితులతో కాలం గడుపుతున్నాడు. రామ్మూర్తికి మాత్రం కూతురు పెళ్లి చేసినప్పటి కష్టం కంటే, కొడుకు భవిష్యత్తే ఎక్కువ కష్టంగా తోస్తున్నది. కంటి మీద నిద్రే కరువైంది. ‘‘అడిగిన డబ్బు ఇవ్వలేనప్పుడు ఎందుకు కన్నారు’’ అంటూ తల్లి మీద అంతెత్తున లేచిన విషయం తెలిసి, రామ్మూర్తి జీవితంలో ఎప్పుడూ పడనంతగా బాధపడ్డాడు. భార్యకు తెలియకుండా, ఒక్కడే ఆ రాత్రంతా వినపడకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ‘‘తప్పు నాదా? వాడిదా? లేక రెక్కలు తొడుక్కొని పరుగెడుతూ, అందరినీ డబ్బుల వెంట పరుగెత్తిస్తున్న కాలానిదా? ఈ ఊహల్లో మేడలేంటీ? జీవితమంటే డబ్బేనా? బతుకంటే షేర్ మార్కెటా లాభనష్టాలు చూసుకోవడానికి? నోరెత్తితే విదేశాల బాటేనా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరదేశాలు వెళితే, తాము చస్తే తలకొరివి పెట్టే దిక్కెవరు?’’ ఏవేవో ఆలోచనలు రామ్మూర్తి మెదళ్లో గిరికీలు కొడుతున్నాయి. అల్లారు ముద్దుగా కని పెంచిన కొడుకు ఇలా తనకే ఎదురుతిరిగే వాడయ్యాడు. తన పెంపకంలోనే తప్పుందేమోనని ఒకటికి రెండుసార్లు తరచి చూసుకుంటున్నాడు. అయినా సమాధానం దొరకలేదు. కిరణ్‌లో మాత్రం రోజురోజుకు అసంతృప్తి సెగలు మిన్నంటుతున్నాయి. ‘‘ఏందీ జీవితం? ఇట్లా ఎంతకాలం? నాతోటి వాళ్లంతా ఏదో స్థాయిలో లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. నేను మాత్రం దేనికీ పనికిరాకుండా పోయాను’’ ఇలా ఎన్ని వందలసార్లు అనుకున్నాడో కిరణ్. మూడు పదుల వయసు దాటుతున్నా, తను సెటిల్ కాకపోవడానికి, తన తండ్రి రామ్మూర్తే కారణమని లోలోపలే తిట్టుకుంటూనే ఉన్నాడు. ‘‘అమెరికాకు వెళ్తాను, జీఆర్ఈ, టోఫెల్ కోచింగులకు, వీసాకు డబ్బులు కట్టమంటే మనవల్ల కాదంటాడు. పోనీ ఇంట్లో పేదరికం ఉందా అంటే అదీ లేదు. తండ్రి అలసత్వం పైచదువుల వంక చూడకుండా చేసింది. ఇప్పుడు ఏం చేయాలో తేల్చుకోలేక ఆగిపోయాను. అసలు ఏ తండ్రైనా ఇలా కొడుకును గాలికొదిలేస్తాడా? ఇంతకాలం డబ్బులకు ఎలాంటి అడ్డంకులు చెప్పని తండ్రీ, ఇవాళ తనకు బిజినెస్ పెట్టడానికి డబ్బు కావాలంటే ఎందుకు సర్దడం లేదో అర్థం కావడం లేదు. ఉన్నది తానొక్కడే. ఏం సంపాదించి పెట్టినా తనకే కదా, తానేమైనా తాగి తందనాలడడానికి అడుగుతున్నాడా? తండ్రిలో ఈ మొండి పట్టుదల ఎందుకు? పైగా రిటైరయ్యాక ఊరికెళ్లి వ్యవసాయం చేద్దామంటాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్నోళ్లకు, ఉరితాళ్లు తప్ప ఏం మిగిలాయని? అందుకే ఈ కాలానికి వ్యవసాయమే కాదు, ఈయన కూడా పనికిరాడు. అంతా వేస్టు. నీతులు, సూక్తులు చెప్పుకోవడానికే. ఆయన తలుచుకుంటే ఏ లోనుకో అప్లయి చేసి, తనకు డబ్బివ్వొచ్చు. అయినా సరే తాను ఆ ప్రయత్నాలేవీ చేయడం లేదంటే తనమీద ఇంతకాలం ఉన్నది ప్రేమ కాదు. అందుకే తనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓవైపు తోటి స్నేహితులంతా వీసాలు దొరికి, ఫారిన్ దేశాలకు ఎగిరెళ్లుతూ తన ముందే ఫోజులు కొడుతున్నారు. వాళ్లందరి ముందు నేనెంత నామోషీ అవుతున్నానో ఆయనకేం తెలుసు’’ అనుకుంటూ చేతిలో ఉన్న బీర్ సీసాను గోడకేసి పగలగొట్టాడు. బార్ షాప్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ తలలు తిప్పి చూశారు. ఈ సంఘర్షణంతా మరిచిపోలేక బార్ షాపులోనే సేద తీరుతున్నాడు కిరణ్. తాగడానికి, వాగడానికి కంపెనీ కూడా ఉంది. ‘గ్లాస్‌మేట్స్’ తాగినప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు. ఆ మాటల సారాంశం ఒక్కటే ‘‘మీ నాన్న మారిపోయాడు. నువ్వొక వేస్టుగాడిలా కనిపిస్తున్నావు. కొడుకు బాగును కోరుకోని తండ్రి, ఒక తండ్రేనా?’’ అని రెచ్చగొడుతున్నారు. కిరణ్‌లో కోపం కట్టలు తెగుతున్నది. మంట చిన్నగా ఉన్నప్పుడు గాలి దాన్ని చప్పున ఆర్పేస్తుందట. మంట కొంచెం పెద్దగా ఉంటే చాలు, అదే గాలి మంటను మరింత పెద్దది చేసి మండిస్తుందట. ఇప్పుడు కిరణ్ స్నేహితులు కూడా అలాగే అగ్గికి ఆజ్యం పోస్తున్నారు. ‘‘వీడి తండ్రిని చూడరా, చచ్చి ఆయన ఉద్యోగాన్ని వీడికిచ్చిపోయాడు. మహానుభావుడు. తండ్రి అంటే అలా ఉండాలి’’ అన్నాడొక స్నేహితుడు. అప్పటిదాకా తాగింది దిగిపోయింది కిరణ్‌కి. ఈ మాట తనకు ఎక్కడో కనెక్ట్ అయ్యింది. మరో బాటిల్ మూత తీశాడు. ఈసారి గ్లాసులో పోయకుండానే గటగటా సగం బాటిల్ తాగేశాడు. తన కంటే తక్కువ తాగిన ఫ్రెండ్స్ అంతా షాకయ్యారు. బార్ షాప్ మూసే వేళయిందని అంతా ఇళ్లకు వెళ్లిపోయారు. మనసులో వచ్చిన ఆలోచనల టెన్షన్‌కు, కిరణ్‌కు ఇవాళ మత్తెక్కడం లేదు. ఇంటికి కూడా వెళ్లాలనిపించలేదు. కాలనీ మధ్యలో ఉన్న వాటర్‌ట్యాంక్ వద్దకొచ్చి కూర్చున్నాడు కిరణ్. కాలనీ ఎప్పుడో నిద్రపోయింది. వెన్నెల వెలుగులో వాటర్‌ట్యాంక్ నీడ, మర్రిచెట్టు నీడలా కనిపిస్తున్నది. అది ట్యాంక్ నీడా, తన నీడా? ఉద్యోగం లేకుంటే తన నీడ కూడా తనను భయపెడుతుందా? ‘‘ఛ ఎంత చీపైపోయాను’’ అనుకున్నాడు. తనకు ఉద్యోగం లేదని, ఎందుకూ పనికిరాడని, వీడికి ఎవ్వరూ పిల్లనివ్వరని హేళన చేసే వాళ్లందరి నోళ్లు మూయించాలి. ఇదంతా జరగాలంటే తనకు అర్జంటుగా ఉద్యోగం కావాలి. తనకు వెంటనే ఉద్యోగం రావాలంటే తన తండ్రి, తన ఉద్యోగం నుండి తప్పుకోవాలి. ఊరికే తప్పుకోడు. అలా తప్పుకున్నా, సింగరేణిలో తనకు ఆ ఉద్యోగం ఇవ్వరు. ఏదో జరగాలి. ఏం జరగాలి? సిగరెట్ వెలిగించాడు కిరణ్. ఔను, తాను చేసేది తప్పే అని తెలుసు. అయినా గత్యంతరం లేదనుకున్నాడు. ఈ రాత్రికే పని పూర్తిచేయాలి. ఏ గుండెపోటుతోటో తండ్రి పోయాడని కాలనీవాళ్లందరిని నమ్మించాలి. ఇదీ పథకం! లేచి బైక్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ వెళ్లే ఇంటికి అయినా, ఈసారి దొంగలా వెళ్లాడు. టైం సరిగ్గా రాత్రి ఒంటిగంటన్నర. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎప్పటిలాగే తల్లే వచ్చి తలుపు తెరిచింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తల తిప్పుకొని ఇంట్లోకి వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకొని, తండ్రి బెడ్ రూంలోకి తొంగి చూశాడు. తండ్రి లేడంటే నైట్ షిఫ్ట్‌లో ఉన్నాడని అర్థమైంది. ఛా అవకాశం మిస్సయ్యిందనుకున్నాడు. ‘‘మీ నాన్న ఇంతకుముందే ఫోన్ చేసి, నువ్వొచ్చావో లేదోనని అడిగాడురా, రా అన్నం తిందువు’’ అన్నది తల్లి. కిరణ్ ఆ మాటకు కొంత ఖంగారు పడ్డాడు. ‘‘వొద్దొద్దు తినొచ్చా. నువ్ పడుకో’’ అన్నాడు. తల్లి పడుకుంది. ఉదయాన్నే తండ్రొస్తాడు. వచ్చి పడుకుంటాడు. ఎలా ఖతం చేయాలి. తల్లి, పాల పాకెట్ తేవడానికి వెళ్లి వచ్చేలోపే, ఏదో ఒక రకంగా తండ్రిని శాశ్వత నిద్రలోకి చేర్చాలనుకుంటూ ప్లాన్ గీసుకున్నాడు. ఉదయాన్నే తల్లి ఏడుపులు వినిపిస్తున్నాయి. మొదట కల అనుకున్నాడు. అటూ ఇటూ దొర్లాడు. అయినా ఏడుపులు ఆగడం లేదు. కల కాదని అర్థమైంది కిరణ్‌కు. ఉరుకుల పరుగుల మీద హాస్పటల్‌కు చేరారు. గుంపులు గుంపులుగా జనాలు. తోటి కార్మికులు పదుల సంఖ్యలో అక్కడికొచ్చారు. రామ్మూర్తి కాళ్లు పోయాయంటున్నారు. కొంచెం అయితే ప్రాణమే పోయేదట అని ఇంకెవరో అంటున్నారు. రాధమ్మ గుండెలు బాదుకుంటూ పెడబొబ్బలు పెడుతూ జనం మధ్యలో నుండి ఐసీయూకి చేరారు. ఒళ్లంత కట్లతో, మోకాళ్ల వరకున్న మొండి దేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ‘‘దేవుడా ఏందీ ఘోరం’’ అంటూ రామ్మూర్తిని పట్టుకొని ఏడ్చింది రాధమ్మ. రామ్మూర్తి మాత్రం ఈ పాపపు లోకాన్ని చూడలేనన్నట్టు... కళ్లు మూసుకునే ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. కన్నతండ్రిని అలా చూసి కూడా, కిరణ్‌లో ఎలాంటి చలనం లేదు. ఎవరో పరాయి మనిషిని చూస్తున్నట్టు చూస్తుండిపోయాడు. ఎవరిదో చెయ్యి తన భుజం మీద పడితే వెనక్కి తిరిగి చూశాడు. తన తండ్రి రామ్మూర్తితో పనిచేసే వరదరాజు. బయటికి రమ్మని, కిరణ్‌ను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు. ‘‘కంపెనీలో నీకు ఉద్యోగం కోసమేరా మీ నాన్న, బొగ్గుబావిలో తన కాళ్లను మిషన్ రంపెల కింద పెట్టాడు’’ అన్నాడు. ఒక్కసారిగా షాకయ్యాడు కిరణ్. ‘‘ఏంటంకుల్ మీరనేది?’’ అన్నాడు. అవునురా నువ్ ఉద్యోగం కోసం పడుతున్న బాధ, తను భరించలేకపోయాడురా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కిరణ్ గుండె ఇప్పటికి కరిగింది. ఇన్ని రోజులుగా కిరణ్ కళ్లమీద కమ్ముకున్న పొరలు తొలగిపోతున్నాయి. కాళ్ల కింది నేల కదిలిపోతున్నట్టుంది కిరణ్‌కు. తండ్రి మంచితనాన్ని చూడలేని తన అంధత్వానికి, తనను తానే తిట్టుకున్నాడు. ఇలాంటి తండ్రి ప్రాణమా, తాను తీయాలనుకున్నది, సిగ్గుతో బోరున ఏడుస్తూ కూలబడ్డాడు. ఆన్లైన్లో కొనే వస్తువులకు ప్రతీసారి ‘వారెంటీ ఉందా’ అని చూసే కిరణ్, కన్నప్రేమకు మాత్రం ఏ ‘ఎక్స్పైరీ’ ఉండదని తెలుసుకోలేకపోయాడు. - పసునూరి రవీందర్ -
ప్రైవేటు కొలువుకు సెలవు!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ఇంజనీర్లే కాదు.. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వేల మంది ఇంజనీర్లు సైతం సర్కారీ కొలువును ఒడిసిపట్టుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యోగాల నియామకాల కోసం జరిగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వేల మంది ఇంజనీర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టేసి మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యను మరోమారు మూలాల నుంచి ఔపోసన పడుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఉద్యోగావకాశాన్ని ఒడిసి పట్టుకునేందుకు ప్రైవేటు ఇంజనీర్లు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) 931 ఏఈఈ (సివిల్) పోస్టులతో పాటు 1058 ఏఈ (సివిల్/మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. ఏఈఈ (సివిల్) పోస్టుల కోసమే 30,783 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి వేల మంది ఇంజనీర్లు సెలవులోకి పోవడంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. మెట్రో రైలు లాంటి ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు నెమ్మదించాయి. మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ కంపెనీలు, ఏపీలోని స్థిరాస్తివ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న 15 వేల మందికి పైగా సివిల్ ఇంజనీర్లు సెలవులోకిపోవడం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులకు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల కొరత ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. ఇక విద్యుత్ సంస్థల్లో 2,681 అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్ల భర్తీకి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ పోస్టుల కోసం హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో పనిచేస్తున్న 2 వేల మంది తెలంగాణ ఇంజనీర్లు ఇప్పటికే సెలవులు పెట్టేసి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ, ఏపీల్లోని ప్రైవేటు విద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కలిపి మొత్తం 5 వేల మందికి పైగా ప్రైవేటు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సెలవుల బాటపట్టినట్లు అంచనా. ఈ ఉద్యోగ నియామకాల సీజన్ ముగిసే వరకు ప్రైవేటు నిర్మాణ సంస్థలు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సెలవుల ఫీవర్ తప్పదనే చర్చ జరుగుతోంది.