breaking news
two substations
-
విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి
ఉలవపాడు : విద్యుత్ కోతలపై ఆగ్రహించిన రైతులు, ప్రజలు మంగళవారం రెండు సబ్స్టేషన్లను ముట్టడించారు. ఈ సంఘటనలు అలగాయపాలెం, నలదలపూరులో చోటుచేసుకున్నాయి. చీటికీమాటికీ కోతలు విధిస్తుండడంతో ఓపిక నశించిన జనం, రైతులు అలగాయపాలెం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ హరికృష్ణను కూడా నిర్బంధించారు. కొంత కాలంగా రాత్రిపూట త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడంపై రైతులు, గ్రామంలో ఎప్పుడుపడితే అప్పుడు కోతలు విధిస్తుండడంపై అలగాయపాలెం వాసులు ఆగ్రహించి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలతో నరకం చవిచూస్తున్నామని సబ్‌స్టేషన్ ఉద్యోగులను నిలదీశారు. దీంతో ఉద్యోగులు ఏఈకి సమాచారం అందించారు. ఏఈ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్య పరిష్కారంపై సంతృప్తికర సమాధానం రాకపోవడంతో ప్రజలు ఏఈ, సిబ్బందిని సబ్‌స్టేషన్‌లో ఉంచి గేటుకు తాళం వేశారు. తమ పరిధిలో ఏమీలేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని ఏఈ చెప్పుకొచ్చారు. డీఈ జయకిషోర్ తనకు ఆదేశాలు ఇస్తారని, నేను నా కింది ఉద్యోగులకు చెబుతానని వివరించారు. ఇక్కడి ఉద్యోగులకు ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమిటని రైతులు నిలదీశారు. దీంతో ఏడీతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఈ హామీ ఇచ్చారు. అక్కడి నుంచే రైతుల సమస్యను ఫోన్లో ఏడీకి తెలియజేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరి స్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. పత్తి రైతుల కన్నెర్ర వలేటివారిపాలెం : వేళాపాళాలేని విద్యుత్ కోతలతో విసుగు చెందిన రైతులు మంగళవారం నలదలపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సిబ్బందిని రెండు గంటల పాటు నిర్బంధించారు. కలవళ్లకు చెందిన వంద మంది పత్తి రైతులు ఉద యం 7 గంటలకు సబ్ స్టేషన్‌కు చేరుకుని ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కోతలు ఆపకుంటే రోజూ సబ్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కనీసం 4 గంటలైనా సక్రమంగా విద్యు త్ సరఫరా చేయాలని రైతులు నినాదాలు చేశారు. కుర్చీలు, పాత మీటర్లు ధ్వంసం విద్యుత్ అధికారుల తీరుకు నిరసనగా సబ్ స్టేషన్‌లోని కుర్చీలు, పాత మీటర్లను రైతులు ధ్వంసం చేశారు. పంటలు పండక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అధికారులే బాధ్యత వహించాల్సిఉంటుందని మండి పడ్డారు. అనంతరం అక్కడికి వచ్చిన ఏఈ రాఘవేంద్రరావు రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్లే కోతలు విధించాల్సివస్తోందని చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఏ సమయంలో విద్యుత్‌ను ఇచ్చేది రెండు రోజుల్లో వేళలను నిర్ణయించి ఆ మేరకే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. -
కరెంట్ కష్టాలకు చెక్
పరిగి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు చికాకుపరుస్తున్న తరుణంలో పరిగి ప్రాంతంలో రెండు సబ్స్టేషన్లు ఏర్పాటు కానుండటంతో కరెంట్ కష్టాలు తీరుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాంతం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతుందన్న ఆశలు వారిలో రేకెత్తుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పరిశ్రమలను దూరప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో పరిగి ప్రాంతంలో 230, 400 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పరిగికి ఇప్పటికే 230 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు కాగా, ఇందుకోసం ప్రభుత్వం భూమిని సైతం కొనుగోలు చేసి సంబంధిత శాఖకు అప్పగించింది. నిర్మాణానికి రూ.50 కోట్ల నిధులు సైతం కేటాయించింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి కావటంతో సంబంధిత కాంట్రాక్టర్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ప్రస్తుతం 230కేవీ సబ్‌స్టేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరలో ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రానుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే పరిగికి 400కేవీ సబ్‌స్టేషన్ సైతం మంజూరు కాగా గత సంవత్సరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.350 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. 400కేవీ సబ్‌స్టేషన్ కోసం పలుచోట్ల అధికారులు ప్రభుత్వ భూమిని పరిశీలించినప్పటికీ అవసరమున్న విధంగా భూమి లభించలేదు. దీంతో ప్రభుత్వం రూ.9కోట్లతో ప్రైవేటు భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం పరిగి ప్రాంతంలో ఇప్పటికే పలు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నందున ఈ రెండు సబ్స్టేషన్లు అందుబాటులోకి వస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు వీలౌతుంది. పశ్చిమ జిల్లాలో వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు 111 జీఓ అడ్డుగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుకు పరిగి ప్రాంతాన్ని ఎన్నుకోవడం అనివార్యంగా మారింది. ఇప్పటికే పరిగి మీదుగా హైదరాబాద్ - బీజాపూర్ అంతరాష్ట్ర రహదారి ఉండటం, దీన్ని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినందున రవాణా సౌకర్యం మరింత మెరుగుపడి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా మారనుంది. పశ్చిమరంగారెడ్డితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు నాణ్యమైన విద్యుత్ సరఫరా పరిగి ప్రాంతంలో ఈ రెండు సబ్స్టేషన్ల ఏర్పాటుతో పశ్చిమ రంగారెడి ్డజిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్, కోస్గి, షాద్‌నగర్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాల పరిధిలో 400కేవీ సబ్‌స్టేషన్ లేనందున కర్ణాటకలోని రాయ్‌చూర్ నుంచి ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇక్కడ 400కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు నుంచి నేరుగా పరిగి సబ్‌స్టేషన్‌కు, ఇక్కడినుంచి మిగతా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. ఇది పూర్తై ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతోపాటు భవిష్యత్తులో ఏర్పాటయ్యే పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలవుతుందని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు.