breaking news
tungabhadra express
-
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో ‘కవచ్ 3.2’ రక్షణ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్ : రైళ్లు ఢీకొనకుండా ప్రయా ణికుల భద్రతకు భరోసాను కల్పించేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్ 3.2’రక్షణ వ్యవస్థ పనితీరును దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదివారం సికింద్రాబాద్– ఉందానగర్ సెక్షన్లో పరిశీలించారు. తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో కవచ్ 3.2 వెర్షన్ అమలు తీరుతెన్నులను తనిఖీ చేశారు. ఆయన వెంట దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ సౌరభ్ బందోపాధ్యాయ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేశ్ విష్ణోయ్, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ వీఎస్ఎం.రావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా కవచ్ టవర్స్, ట్రాక్ సైడ్ పరికరాలు, సిగ్నలింగ్ వ్యవస్థ, కవచ్‌తో ముడిపడిన వివిధ సాంకేతిక వ్యవస్థల పనితీరును జీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎదురుగా వచ్చే రైలును గుర్తించినా బ్రేక్ వేయడంలో లోకో పైలట్ విఫలమైతే ఆటోమేటిక్ బ్రేక్స్ అప్లికేషన్ ద్వారా నిర్దేశిత వేగ పరిమితుల్లో రైలును నిలిపేందుకు లోకో పైలెట్‌కు కవచ్ వ్యవస్థ సహాయం చేస్తుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడిపేందుకు కూడా ఈ వ్యవస్థ సహాయ పడుతుంది. ఈ తనిఖీల సందర్భంగా బ్లాక్ సెక్షన్లలో, స్టేషన్లలో రన్నింగ్ లైన్లలో రైళ్లు ఢీకొనడాన్ని నివారించడానికి ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్సర్ ద్వారా కవచ్ సిస్టమ్ రూపొందిందని చెప్పారు. అత్యున్నతస్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవల్–(ఎస్.ఐ–ఎల్4) సర్టిఫికెట్ కూడా పొందిందని వివరించారు. ఇది ప్రమాదంలో సిగ్నల్ పాస్ కాకుండా నివారిస్తుందని, తద్వారా రైలు కార్యకలాపాల భద్రతకు భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో దక్షిణమధ్య రైల్వేజోన్ కవచ్ 4.0 వెర్షన్‌కు మారనున్నట్టు తెలిపారు. ఉందానగర్ రైల్వేస్టేషన్‌ను కూడా జీఎం తనిఖీ చేశారు. ప్రయాణికుల సదుపాయా లతోపాటు స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. కవచ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన భద్రతాపరమైన ఇన్సలేషన్లను తనిఖీ చేశారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ మేరకు ఉందానగర్ రైల్వేస్టేషన్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. -
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు
కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ (17024)కు ముప్పు తప్పింది. గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు రైలు కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. గద్వాల స్టేషన్ వద్ద రైలు ఇంజన్‌కు ఉన్న లింక్ హుక్ తెగిపోవడంతో బోగీలు విడిపోయాయి. అప్రమత్తమైన లోకో పైలెట్ రైలును నెమ్మదించి ఆపై నిలిపివేశారు. దీంతో ఇంజన్ సుమారు 10 మీటర్ల దూరం వెళ్లి నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజన్‌కు బోగీలను అమర్చి పంపించారు. దీంతో రైళ్ల రాకపోకలకు గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. -
రైలుపై దాడి: చూపు కోల్పోయిన విద్యార్థి
హైదరాబాద్: శుక్రవారం రాత్రి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేయటంతో ఒక విద్యార్థి కంటి చూపు కోల్పోయాడు. ఫలక్‌నుమా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు ప్రయాణికులు కూడా రాళ్ల దాడిలో గాయపడ్డారు. కంటికి తీవ్ర గాయం అయిన రఘు అనే విద్యార్థి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు శనివారం కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.