ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
టీఆర్ఎస్ లో చేరికపై వివరణ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్: ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి గురువారం నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నోటీసులు జారీచేశారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, వివేకానందరెడ్డి, సాయన్నలను ఈ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
టీఆర్ఎస్ లో ఇటీవల ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరగా.. అంతకుముందు మరో ఐదుగురు చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ టీడీపీ తరఫున మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. అందులో పదిమంది టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో తమ పదిమందిని టీడీపీ శాసనసభాపక్షంగా భావిస్తూ.. తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ స్పీకర్ కు పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో టీడీపీ పిటిషన్ పై స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేయడం గమనార్హం.