breaking news
TRS and Congress leaders
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం
కోడేరు (కొల్లాపూర్): టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగిన సంఘటన మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మంగళవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తల్లి, భార్య గ్రామానికి వచ్చారు. టీఆర్ఎస్ నాయకులు వారిని చూసి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి వచ్చారా అని వాగ్వాదానికి దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరుపార్టీల వారిని చెదరగొట్టారు. ఎమ్మెల్యే తల్లి బిచ్చమ్మ, భార్యను అక్కడి నుంచి పంపించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. -
పాలేరులో 89.73 శాతం పోలింగ్
► ఓటుహక్కు వినియోగించుకున్నవారు 1,70,800 మంది ► మహిళలు 86,499.. పురుషులు 84,301 ► పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు ► ఎండల నేపథ్యంలో ఉదయం నుంచే కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు ► సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన పోలింగ్ శాతం ► విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తంగా పోలింగ్ 89.73 శాతం నమోదైంది. 1,90,351 మంది ఓటర్లకుగాను 1,70,800 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళలు 86,499, పురుషులు 84,301 మంది. ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 90.01 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు స్వల్పంగా 0.28 శాతం తగ్గింది. స్వల్ప ఘటనలు మినహా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటలోపే 61.17 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల సమయానికి 89.73 శాతం పోలింగ్ నమోదైంది. మోడల్ పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి రుడోలా, ఖమ్మం కలెక్టర్ దానకిషోర్ పరిశీలించి ఓటింగ్ సరళి, ఓటర్లకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఏర్పాటు చేసిన 24వ మోడల్ పోలింగ్ బూత్‌లో ప్రారంభంలోనే సుమారు 40 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించింది. అధికారులు మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. కూసుమంచి మండలం గురువాయిగూడెంలో పోలింగ్ ప్రారంభానికి ముందు, కోక్యా తండాలో మధ్యాహ్న సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఇక నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా సీఆర్పీఎఫ్ దళాలను మోహరించారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రతి కేంద్రంలో పోలింగ్ తీరును ఎన్నికల యంత్రాంగం పర్యవేక్షించింది. గంట గంటకు పెరిగిన పోలింగ్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకే 14.81 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 37.60 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 61.17 శాతం, 3 గంటల సమయానికి 75.10 శాతం, సాయంత్రం 5 వరకు 85.48 శాతం నమోదుకాగా.. పోలింగ్ ముగిసిన 6 గంటల సమయానికి 89.73శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరి ధీమా వారిదే.. పోలింగ్ భారీగా నమోదు కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌లు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సరళిని అంచనా వేసుకున్నారు. తమకు భారీ మెజారిటీ వస్తుందని అధికార టీఆర్ఎస్, విజయం తమదేనని కాంగ్రెస్ చెబుతున్నాయి. బూత్‌ల వారీగా తమకెన్ని ఓట్లు పడి ఉంటాయనే అంచనాల్లో అభ్యర్థులు, వారి అనుచరగణం మునిగిపోయారు. ఎక్కడ సమస్యలున్నాయి, ఎక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలో వచ్చే ఫలితంపై భారీగా బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.