breaking news
Tribunal allocation
-
పాత పద్ధతిలోనే కృష్ణా జలాల పంపిణీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను 2022–23 సంవత్సరంలోనూ ఏపీ, తెలంగాణకు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో పాత విధానంలోనే నీటి పంపిణీకి అంగీకరించిన తెలంగాణ సర్కారు.. ఆ తర్వాత అడ్డం తిరిగి సగం వాటా కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ స్పష్టతనిచ్చింది. 2015 జూన్ 19న రెండు రాష్ట్రాల అంగీకారంతో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేసేలా తాత్కాలిక సర్దుబాటు చేశామని పేర్కొంది. 2016–17లో ఇదే విధానానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది. 2017 నుంచి 2022 వరకు ఇదే విధానంలో నీటిని వినియోగించుకున్నాయని గుర్తు చేసింది. ఈ నీటి సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకూ ఈ విధానంలోనే రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసినట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. -
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
-
‘కృష్ణా’లో అన్యాయాన్ని సరిదిద్దండి
ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి జలాల కేటాయింపు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల కింద 78 టీఎంసీలు రావాలి పులిచింతల, సుంకేశులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం: ఏకే బజాజ్ హైదరాబాద్ కృష్ణా జలాల కేటాయింపులు, వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దానిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఏకే బజాజ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు నీటి కేటాయింపులు, పంపిణీ విషయంలో వివక్షే ఎదురవుతోందని పేర్కొంది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 98 టీఎంసీల వాటాలో.. తెలంగాణకు గరిష్టంగా 78 టీఎంసీలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో పోలవరానికి సంబంధించి 43 టీఎంసీలు (96శాతం వాటా), పట్టిసీమకు సంబంధించి 35 టీఎంసీలు (65శాతం వాటా) ఇవ్వాలని విన్నవించింది. తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా నీటి యాజమాన్యం, నీటి వాటాలపై చర్చించేందుకు ఏకే బజాజ్ కమిటీ సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించింది. ఇందులో కమిటీ చైర్మన్ ఏకే బజాజ్‌తో పాటు సభ్యులు డీకే మెహతా, ఆర్పీ పాండే, ప్రదీప్ కుమార్ శుక్లా, ఎన్ఎన్ రాయ్, కేఆర్ఎంబీ చైర్మన్ ఎస్కే హల్దర్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు, పంపిణీలో అన్యాయంపై జోషి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందున్న పరిస్థితి, సాగునీటి రంగంలో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. ఏపీ ఆవిర్భావం తర్వాత ఆయా పథకాలను తుంగలో తొక్కిన వైనాన్ని తెలిపారు. 811లో 450 టీఎంసీలైనా రావాలి హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో రూపొందించిన అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ 174 టీఎంసీలను కోల్పోయిందని ఎస్కే జోషి వివరించారు. బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఏపీ సర్కారు సమర్థంగా వాదించలేదన్నారు. అంతర్జాతీయంగా సాగునీటి కేటాయింపులు, పంపిణీకి సంబంధించి అమల్లో ఉన్న సహజ న్యాయసూత్రాలను ఉమ్మడి ఏపీ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. క్యాచ్మెంట్, సాగుయోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం, జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాలతో చూసినా.. ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టీఎంసీలు రావాల్సి ఉందని వివరించారు. కమిటీకి విజ్ఞప్తి చేసిన మరిన్ని అంశాలు.. ⇒ నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద తెలంగాణ వాస్తవ ఆయకట్టు 6.6 లక్షల ఎకరాలుకాగా.. ఉమ్మడి ఏపీలో దాన్ని 6 లక్షల ఎకరాలకు తగ్గించారు. అందులోనూ 5 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారు. ఏపీ ప్రాంతంలో మాత్రం ఎడమ కాల్వ కింద ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.7 లక్షల ఎకరాలకు పెంచారు. కుడి కాల్వ కింద 7.9 లక్షల నుంచి 11.74 లక్షల ఎకరాలకు పెంచుకున్నారు. ⇒1956లో ఏపీలోని కేసీ కెనాల్‌కు, తెలంగాణలోని ఆర్డీఎస్కు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతరం ఉమ్మడి ఏపీలో కేసీ కెనాల్ కింద ఆయకట్టును 2.78 లక్షల ఎకరాలకు పెంచారు. అదే ఆర్డీఎస్ కింద మాత్రం 37 వేల ఎకరాలకు నీళ్లివ్వలేదు. ⇒ఇక ఏపీ తనకు కేటాయించిన నీటిలో 350 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు కలిపి మొత్తం 500 టీఎంసీలు బేసిన్ అవతలే వినియోగిస్తోంది. ⇒తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి మూడేళ్లు కావస్తున్నా కృష్ణాలో తెలంగాణలో వాటా తేలలేదు. 299:512 నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అంగీకారం కుదిరింది. దాని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల ’ఆపరేషనల్ ప్రోటోకాల్’ను రూపొందించాలి. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలోకి జూరాలను చేర్చడం ఆక్షేపణీయం. ⇒పులిచింతల, సుంకేశుల ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చలేం ‘‘కృష్ణా జల వివాదాలపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటాం. కృష్ణా బోర్డు నిర్వహణ, ఆపరేషనల్ ప్రొసీజర్స్, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తున్న జలాల అంశాన్ని పరిశీలించాలని మాకు కేంద్రం సూచించింది. ఇరు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని బోర్డుకు సరైన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ కోరింది. నదీ జలాల మళ్లింపునకు సంబంధించి ఉమ్మడి ఏపీ సమయంలో ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉన్న 299ః512 టీఎంసీల నిష్పత్తిని ఎవరూ మార్చలేరు. మేం నివేదిక ఇచ్చేందుకు 90 రోజుల సమయం సరిపోకపోవచ్చు, గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతాం. తదుపరి పర్యటనలో ప్రాజెక్టులను కూడా సందర్శిస్తాం..’’ – ఏకే బజాజ్, కృష్ణా జల వివాదాలపై ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్