breaking news
Tri-Nation Series
-
ముక్కోణపు టి20 టోర్నీకి భారత జట్టు
-
కోహ్లి, ధోనీలకు విశ్రాంతి
ముంబై: సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఆడిన నలుగురు భారత క్రికెటర్లకు తర్వాతి టోర్నమెంట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు టి20 టోర్నీ ‘నిదాహస్ ట్రోఫీ’ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. వీరితో పాటు మహేంద్ర సింగ్ ధోని, కుల్దీప్ యాదవ్‌లను కూడా పక్కన పెట్టారు. స్వయంగా ధోని తనకు విశ్రాంతి కావాలని కోరగా... కుల్దీప్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ‘రాబోయే సిరీస్‌ల షెడ్యూల్, పని భారాన్ని దృష్టిలో ఉంచుకుంటూ నిదాహస్ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేశాం. ముఖ్యంగా పేస్ బౌలర్లు గాయాలపాలు కాకుండా ఉండేందుకు, మరింత మెరుగైన ప్రదర్శన కోసం తగినంత విశ్రాంతి అవసరమని హై పెర్ఫార్మెన్స్ బృందం సూచించింది. ధోని తనకు విశ్రాంతి కావాలని కోరడం వల్లే అతడిని ఎంపిక చేయలేదు’ అని ఎమ్మెస్కే వెల్లడించారు. విశ్రాంతినిచ్చిన ఆటగాళ్ల స్థానంలో వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, దీపక్ హుడా, రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేకపోయిన సిరాజ్... విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌లలో కేవలం 15.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో సుందర్ కూడా ఆడగా, హుడాకు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఎంపికైనా విజయ్ శంకర్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోగా... పంత్ భారత్ తరఫున 2 టి20లు ఆడాడు. మరోవైపు ఈ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2 వేలకు పైగా పరుగులు చేసిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దేశవాళీ క్రికెట్లో బాగా ఆడినా... కనీసం ఇండియా ‘ఎ’ తరఫున రాణించిన తర్వాతే ఆటగాళ్లను సెలక్షన్ కోసం పరిశీలించడం రివాజుగా పెట్టుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి 6 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్ (వైస్ కెప్టెన్), రాహుల్, రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చహల్, అక్షర్, విజయ్ శంకర్, శార్దుల్, ఉనాద్కట్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సిరాజ్. -
కంగారూలు తిప్పేశారు..
గుయానా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్లు ఆడమ్ జంపా (3/16), నాథన్ లియాన్ (3/39) విజృంభించి విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 32.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటయ్యారు. విండీస్ జట్టులో ఓపెనర్ చార్లెస్ (22) టాప్ స్కోరర్. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కంగారూలు 25.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (55) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. భారీ విజయం సాధించిన ఆసీస్‌కు బోనస్ సహా 5 పాయింట్లు దక్కాయి. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో వెస్టిండీస్.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.