breaking news
trees fallen
-
చినుకు పడితే చిత్తడే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిన్నటి దాకా ఎండవేడిమితో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ, పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గురువారం కురిసిన 3 సెం.మీ. అకాల వర్షానికి అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. చెట్లు, హోర్డింగ్‌లు కుప్పకూలి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జలమయమైన ప్రాంతాలతో ట్రాఫిక్ స్తంభించింది. చెట్లు కూలడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లపై ప్రయాణించారు. ఎంజే మార్కెట్, నిజాం పీజీ కాలేజ్, యాకుత్‌పురా యూఆర్బీ, దూద్‌బౌలి జంక్షన్, అక్బర్‌నగర్, పటేల్‌నగర్, ఛత్రినాక, జంగమ్మెట్, భవానీనగర్, అల్ జుబేల్ కాలనీ, మోడల్ హౌస్, బైబిల్ హౌస్, గోల్నాక అక్వాకేఫ్, మెడిసిటీ హాస్పిటల్, అంబర్‌పేట ఛే నెంబర్, రంగమహల్, గోల్నాక బ్రిడ్జి, ఆలుగడ్డబావి, ఆంధ్రయువతి మండలి, నింబోలి అడ్డ, తిలక్‌నగర్ రైల్వే బ్రిడ్జి, ఏఎస్రావు నగర్, ఓల్డ్ అల్వాల్, ఉప్పల్, కాప్రా, చర్లపల్లి, మల్లాపూర్, నాచారం, రామంతాపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. రెజిమెంటల్‌బజార్, సెయింట్ మేరీస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్డు మీదకు వరద నీరు చేరింది. పికెట్ పార్కు చెరువును తలపించింది. మలక్‌పేట్, నల్గొండ క్రాస్‌రోడ్డు, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్కేపురం తదిర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాంతో వాహనాలు నిలిచిపోయాయి. మూసారంబాగ్, సలీంనగర్, అక్బర్‌బాగ్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు నీటమునిగాయి. మలక్‌పేట్‌లోని పలు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరింది. కూలిన చెట్లు.. విరిగిన హోర్డింగులు ఈదురు గాలులకు అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై చెట్లు పడి వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ అధికారుల అంచనా ప్రకారం 120కి పైగా చెట్లు కూలాయి. శివంరోడ్డు డీడీ కాలనీ, సీపీఎల్ రోడ్డు, కాచిగూడ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈస్ట్ మారేడ్‌పల్లిలో భారీ చెట్టు రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పేట్లబురుజు వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోరిక్షాపై చెట్టు కూలడంతో ఆటో ధ్వంసమైంది. ఎన్టీఆర్గార్డెన్ పార్కింగ్ వద్ద చెట్లు పడి ఆటో, కారు ధ్వంసమయ్యాయి. ఎన్టీఆర్‌మార్గ్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. ఇందిరాపార్కు, గాంధీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. రాజ్‌భవన్‌రోడ్‌లో ఆర్చి కూలిపోయింది. బలమైన ఈదురుగాలుల వల్ల ఖైరతాబాద్ హైటెక్స్, తాడ్బంద్ తదితర ప్రాంతాల్లో హోర్డింగ్‌ల ఫ్లెక్సీలు చినిగిపోయాయి. సమస్యలకు పరిష్కారమెప్పుడు? గురువారం కురిసిన వర్షంతో ఎదురైన ఇబ్బందులు రాబోయే వర్షాకాలానికి ముందస్తు హెచ్చరికగా నిలిచాయి. ప్రస్తుత సంవత్సరం సైతం దాదాపు 325 సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. దాదాపు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యల్ని బట్టి బీటీ, సీసీ, పేవర్‌బ్లాక్ రోడ్లు వేయడం పైప్లైన్లు, ఆర్సీసీ కల్వర్టుల, వరద కాలువల నిర్మాణం, క్యాచ్పిట్స్ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వీటిలో ఇప్పటి వరకు 150 పనులు మాత్రమే పూర్తయినట్లు సమాచారం. -
హైదరాబాద్ ట్రాఫిక్ క్లియర్
► విరిగిపడ్డ చెట్ల కొమ్మలను తొలగించిన సిబ్బంది ► హోర్డింగుల తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్న కమిషనర్ ► చాలా ప్రాంతాల్లో అడ్డంకుల తొలగింపు ► ప్రధాన రోడ్లలో చాలావరకు ముగిసిన పనులు ► ఉదయానికే మెరుగుపడిన సిటీ ట్రాఫిక్ ► కాలనీ రోడ్లలో పరిస్థితి మాత్రం అస్తవ్యస్తమే హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి శనివారం ఉదయానికి చాలావరకు మెరుగైంది. దిల్సుఖ్నగర్ నుంచి కోఠి, లక్డీకాపుల్, మెహిదీపట్నం, బంజారాహిల్స్.. ఈ ప్రాంతాలలో ఎక్కడా అడ్డంకులు అన్నవి కనిపించలేదు. నిజానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు విపరీతమైన గాలి, వాన.. హోర్డింగులు పడిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, ట్రాన్స్ఫార్మర్లు టపటపలాడుతూనే ఉన్నాయి.. చెట్ల కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఐదారు కిలోమీటర్ల దూరం దాటేందుకే దాదాపు గంట సేపు పట్టిన పరిస్థితి. కానీ శనివారం ఉదయం వాహనచోదకులు వెళ్తుంటే ఎక్కడా ఆగాల్సిన అవసరమే రాలేదు. రోడ్లు చాలావరకు క్లియర్ అయ్యాయి. రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించి, వాటిని నరికి రోడ్డకు పక్కగా వేసి ఉంచడం కనిపించింది. అలాగే రోడ్డుమీద నిలిచిపోయిన నీళ్లను కూడా మోటార్లతో తోడుతున్నారు. దాంతో ప్రధాన రోడ్లలో వాహనాల రాకపోకలకు దాదాపు ఎక్కడా అంతరాయం కలగలేదు. అయితే కాలనీలలో మాత్రం పరిస్థితి ఇంకా అస్తవ్యస్తంగానే కనిపిస్తోంది. చెట్లు విరిగిపడి వాహనాలు కదలడం కష్టంగానే ఉంది. గాలి దుమారం తాకిడితో నేలకూలిన హోర్డింగులు, చెట్ల తొలగింపు పనులను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. కమిషనర్ జనార్ధన్‌రెడ్డి శనివారం ఉదయం 7 గంటల నుంచి నగరంలో పర్యటిస్తున్నారు. గాలి తీవ్రతకు జుబ్లీహిల్స్‌లో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన హోర్డింగుల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1, 12లలో రహదారులపై పడిన చెట్లు, కరెంటు స్తంభాలు, ఇతర అడ్డంకుల తొలగింపును అధికారులతో సమీక్షిస్తున్నారు.