breaking news
treatment denied
-
హెచ్ఐవీ గర్భిణికి చికిత్స నిరాకరణ
ఆపద సమయంలో వైద్యమందించి ప్రాణం పోయాల్సిన వైద్యుడు అంతుచిక్కని వ్యాధి ఉందంటూ అసహ్యించుకున్నాడు. చికిత్స అందించలేమంటూ చీదరించుకున్నాడు. వైద్యుడి నిర్వాకంతో తల్లడిల్లిన నిండు గర్భిణి ఆస్పత్రి ఎదుట కన్నీరు మున్నీరైంది. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో తప్పనిసరైన పరిస్థితిలో ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న రిమ్స్‌లో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో మరోసారి వైద్యులు, అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. ఇప్పటికే వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోసారి స్పష్టమైంది. నిండు గర్భిణి అ ని కూడా చూడకుండా అందులోనూ హెచ్ఐవీ ఉందనే కారణంగా ఆమె ముఖంపైనే ‘ఎందుకొచ్చావు వైద్యం చేయబోం..’ అంటూ వైద్యు డు బెదిరించిన సంఘటన శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. భైంసా మండలం కోల గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి ఉదయం 10గంటలకు రిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. జిల్లా ఆదర్శ హెచ్ఐవీ పాజిటివ్ పీపుల్ వెల్ఫేర్ అధ్యక్షురాలు సరిత ఏఆర్టీ సెంటర్లో మందులు తీసుకున్న తర్వాత బయటకొచ్చింది. భైంసా నుంచి గర్భిణి రావడంపై మెటర్నిటీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధ్యక్షురాలు సరిత తెలిపారు. భైంసాలో ఆస్పత్రి, వైద్యులు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారని, దీంతో తాము వెళ్లిపోయే క్రమంలో సదరు గర్భిణికి నొప్పులు రావడంతో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12గంటలకు అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి గర్భిణిని అడ్మిట్ చేసుకున్నప్పటికీ రౌండ్స్ కోసం సాయంత్రం 4గంటలకు వచ్చిన డాక్టర్ రామకృష్ణ మళ్లీ ఎందుకొచ్చావు.. ఉదయాన్నే నిన్ను పొమ్మన్నాను కదా అంటూ ఆమె పట్ల ఆగ్రహంగా మాట్లాడడంతో బాధితురాలు కంటతడి పెట్టింది. వెళ్లిపోవాలంటూ బెదిరించడంతో చేసేదేమీ లేక రిమ్స్ ఆస్పత్రి బయట కూర్చుంది. అధ్యక్షురాలు సరితకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పడంతో ఆమె అక్కడికి వచ్చింది. డాక్టర్ రామకృష్ణ తీరుపై రిమ్స్ డైరెక్టర్ అశోక్‌కు చెప్పినప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. తనకెందుకు చెబుతున్నారు, సంబంధిత డిపార్ట్మెంట్ డాక్టర్ ఉన్నారు కదా ఆయనకు చెప్పుకొమ్మంటూ డైరెక్టర్ సమాధానం ఇవ్వడంపై అధ్యక్షురాలు ఆగ్రహం వ్య క్తం చేసింది. ఈ క్రమంలో డాక్టర్, డైరెక్టర్ స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించింది. విషయం బయటకు పొక్కడంతో చేసేదేమీ లేక చివరకు గర్భిణిని అడ్మిట్ చేసుకున్నారు. కనికరం లేదా.. పేదలకు దేవాలయం లాంటి ఆస్పత్రిని, వైద్యులను దేవుళ్లతో పోల్చుకొని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. అలాంటివారిని మానవత దృక్పథంతో, బాధ్యతాయుతంగా వైద్యం అందించాల్సిన వైద్యులు, ఉన్నత స్థానంలో ఉన్న రిమ్స్ డైరెక్టర్ సైతం స్పందించకపోవడం గమనార్హం. కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ ప్రజాప్రతినిధుల ముందు గొప్పలు చెప్పుకుంటున్న రిమ్స్ అధికారులు.. తీరా రిమ్స్‌కు వచ్చిన రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు గర్భిణికి వైద్యం నిరాకరించిన వైద్యుడికి అనుకూలంగా మాట్లాడాడని, తన స్థాయికి తగ్గట్లు వ్యహరించకపోవడం సరైంది కాదని హెచ్ఐవీ వెల్ఫేర్ అధ్యక్షురాలు సరిత అన్నారు. గతంలో సైతం హెచ్ఐవీ రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్ ఆస్పత్రి మొత్తానికి అధికారిగా ఉన్న డైరెక్టర్ రోగులకు వైద్యం, వారి సౌకర్యాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. కేవలం తనకు ఎలాంటి సంబంధం లేదనే ధోరణిలో సమాధానం ఇవ్వడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని రోగులు కోరుతున్నారు. కలెక్టర్ హెచ్చరించినా.. తీరు మారదా ఇటీవల రిమ్స్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కలెక్టర్ దివ్యదేవరాజన్ గత శనివారం రిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యసేవలపై నిర్లక్ష్యం చేయకూడదంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ప్రాక్టిస్తోపాటు రిమ్స్‌కు వచ్చే రోగుల పట్ల అలసత్వం వహించకుండా వారితో మంచిగా స్పందించాలని సూచించారు. వైద్యులతోపాటు సిబ్బంది సైతం రోగులను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కలెక్టర్ గతంలోనే ఆదేశించారు. గత నెలలో జరిగిన రిమ్స్ అభివృద్ధి సమావేశంలో సైతం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రిమ్స్ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. ఆ సమావేశంలోనే ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని వీడాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించా రు. అయినప్పటికీ రిమ్స్ వైద్యులు, అధికారుల తీరు మాత్రం మారడం లేదు. దీనికి నిదర్శనమే శనివారం జరిగిన సంఘటన. -
తండ్రి భుజాల మీదే చనిపోయిన కొడుకు!
-
తండ్రి భుజాల మీదే చనిపోయిన కొడుకు!
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందకపోగా.. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో 12 ఏళ్ల కుర్రాడు.. తన తండ్రి భుజం మీద పడుకునే ప్రాణాలు వదిలేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గల లాలా లజపతిరాయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సునీల్ కుమార్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అంశ్ (12)ను తీసుకొచ్చినా, అతడిని ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకోడానికి నిరాకరించారు. పోనీ అక్కడకు దగ్గర్లో ఉన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్దామంటే అతడికి స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు. దాంతో కాలినడకనే పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి భుజాల మీదే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. అంశ్ ఆదివారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడతున్నాడు. తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారు. కానీ పరిస్థితి బాగోకపోవడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు నగరంలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీలో చేర్చి కనీసం పరీక్ష చేయాలని తాను వైద్యులను ప్రాధేయపడ్డానని, పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని తనకు చెప్పడానికి వాళ్లకు అరగంట పట్టిందని సునీల్ కుమార్ కన్నీళ్లతో చెప్పారు. ఆస్పత్రి పావు కిలోమీటరు దూరంలో ఉన్నా.. పిల్లాడిని పడుకోబెట్టి తీసుకెళ్దామని స్ట్రెచర్ అడిగినా కూడా ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ఆ పిల్లవాడు చనిపోయాడు. ఎవరూ సాయం చేయకపోవడంతో అతడి మృతదేహాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూనే ఇంటికి తీసుకెళ్లాడు. -
హెల్త్‌కార్డులతో వైద్యం అందట్లేదు: టీచర్ల జేఏసీ
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన హెల్త్ కార్డులతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో ఎక్కడా తమకు వైద్యం అందడం లేదని టీచర్ల జేఏసీ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో టీచర్ల జేఏసీ నాయకులు గురువారం సమావేశమయ్యారు. తమకు పదో పీఆర్సీని 63 శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలుచేయాలని డిమాండు చేశారు. హెల్త్ కార్డులను తీసుకెళ్తే తమకు వైద్యం చేయడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. వెంటనే ప్యాకేజి రేట్లను సవరించి, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుని.. వైద్యం అందించేలా చూడాలని కోరారు. ప్రతినెలా ప్రీమియం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీచర్ల జేఏసీ నాయకులు సీఎస్ రాజీవ్ శర్మకు తెలిపారు. సర్వీసు రూల్స్ లేని కారణంగా తమ పదోన్నతులు కూడా నిలిచిపోయాయని, వాటిని వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. -
అది ఎబోలా కాదు.. కొత్త వైరస్!!
గాంధీ ఆస్పత్రిలో ఎబోలా కేసు కొత్త మలుపు తిరిగింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి ఎబోలా ఉందన్న అనుమానాలతో అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అతడికి సోకినది ఎబోలా కాదని వైద్యులు స్పష్టం చేశారు. దాన్ని నైజీరియాకు చెందిన కొత్త వైరస్ అని వాళ్లు అంటున్నారు. ఈ వైరస్ సోకిన బాధితుడికి వైద్యం చేసేందుకు అక్కడి సిబ్బంది కూడా ముందుకు రావట్లేదు. దాంతో అతడి పరిస్థితి ఏంటన్నది కూడా ఇంకా తెలియడం లేదు. ఈ వైరస్ ఏంటో.. దానికి చికిత్స ఏంటో తెలియకుండా ముందుకు ఎలా వెళ్తామని సిబ్బంది అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎబోలా బాధితులకు చికిత్స చేసిన నర్సులు, వైద్యులు కొంతమందికి కూడా ఆ వ్యాధి సోకడంతో ఇప్పుడు ఈ బాధితుడికి చికిత్స చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు.