breaking news
Transporter
-
శివ.. ది ‘గాంజా’ ట్రాన్స్పోర్టర్! నా దారిలో నో టోల్గేట్!
సాక్షి, రంగారెడ్డి: అంతరాష్ట్ర గంజాయి ట్రాన్స్‌పోర్టర్‌గా మారిన ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ సరుకు సరఫరాలో తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. ఎక్కడా టోల్గేట్ దాటకుండా నాలుగు రాష్ట్రాల్లోని గమ్యాలకు చేరుతున్నాడు. అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్‌కు సరుకు అప్పగిస్తున్నాడు. ఈ పంథాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.79 లక్షల విలువైన 158 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు.ఇల్లు కట్టి ఇరుక్కుపోయిన వైనం...ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడానికి చెందిన పనగూడు శివకృష్ణ 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లో (ఎన్డీఆర్ఎఫ్) డిప్యుటేషన్‌పై ఉన్న శివ కేరళంలో పని చేసేవాడు. అక్కడి ఉట్టూరులో విలాసవంతమైన ఇల్లు కట్టిన శివ అప్పుల్లో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా... మోతుగూడానికి చెందిన కొందరి ద్వారా ఇతడికి సీలేరు కేంద్రంగా గంజాయి పండించే వారితో పరిచయం ఏర్పడింది. అప్పులు తీర్చుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి ట్రాన్స్‌పోర్టర్‌గా మారాడు. సరుకు తీసుకువెళ్లడానికి డిక్కీ పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో కేరళంలో చేవ్రొలెట్ కంపెనీ కారు ఖరీదు చేశాడు. దాని డిక్కీలో సరుకు సర్దుకుని సీలేరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు.దూరమైనా టోల్గేట్లు దాటడు...ఏదైనా ఓ ప్రాంతానికి గంజాయి తీసుకువెళ్లాలంటే ఆ గమ్యస్థానానికి దారితీసే మార్గాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా అధ్యయనం చేస్తాడు. కాస్త దూరం ఎక్కువైనప్పటికీ ఎక్కడా టోల్గేట్ దాటకుండా జాగ్రత్తపడతాడు. తన కదలికలు బయటపడకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. ఒక్కో ట్రిప్‌కు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు. 2023లో ఇతడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని శివ నెట్వర్క్ మరింత విస్తరించుకుని దందా కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంబర్‌పేటలో ఓ డ్రగ్ పెడ్లర్‌ని పట్టుకున్నారు. ఇతడి విచారణలో శివ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ యదేందర్, ఎస్సై డి.రవి రాజ్ నేతృత్వంలోని బృందం బుధవారం ఎస్సార్‌నగర్ పరిధిలో అతడి పట్టుకుంది. ఈసారి ఇతడు షోలాపూర్ వెళ్తున్నాడని అధికారులు చెప్తున్నారు.ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు..తనకు వచ్చే ఆర్డర్స్ ఆధారంగా శివ ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు వేసి సరుకు సరఫరా చేస్తుంటాడు. సీలేరుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సరుకు తీసుకునే ఇతగాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రయాణం ప్రారంభిస్తాడు. మరుసటి రోజు అదే సమయానికి గమ్యానికి చేరుకుంటాడు. ఆయా రహదారుల్లోని టోల్‌గేట్స్‌ను తప్పించుకు తిరిగే ఇతగాడు మిగిలిన చోట్ల పోలీసులు ఆపితే తన సీఐఎస్ఎఫ్ గుర్తింపు కార్డు చూపించి బయటపడతాడు. 2023లో కేసు నమోదైన నాటి నుంచి ఇతడు సస్పెన్షన్‌లో ఉన్నట్లు డీసీపీ రఘునాథ్ చెప్పారు. -
పరాకాష్టకు స్మగ్లర్ల వివాదాలు
► పరస్పరం ఫిర్యాదులు ► కొందరికి అధికార పార్టీ నేతల అండ ► వారిని పట్టించుకోని అధికారులు బీవీపాళెం(తడ) : చెన్నై కేంద్రంగా కొందరు ట్రాన్స్పోర్టర్లు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. వారంతా సరుకు పరిస్థితిని బట్టి రవాణా చార్జీలు వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొన్ని సరుకులను బిల్లులు లేకుండా రవాణా చేస్తుంటారు. చెన్నైలో కొనుగోలు చేసిన సరుకును ఎలాంటి పన్నులు చెల్లించకుండానే మన రాష్ట్రానికి చేరుస్తున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రా వైపు నుంచి కూడా కొన్ని వస్తువులను సరిహద్దులను దాటిస్తున్నారు. ఇందుకు గానూ వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేస్తారు. మధ్యలో వాహనాలను అధికారులు పట్టుకోకుండా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ట్రాన్స్పోర్టర్ల ముసుగులో కొందరు స్మగ్లర్లు రంగ ప్రవేశం చేశారు. వీరి ద్వారా సరుకుల రవాణా చేస్తే పెట్టుబడి తక్కువగా ఉంటుందని ఎక్కువమంది వ్యాపారులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా నిత్యావసర సరుకులు, సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, నిషేదిత గుట్కాలు, పాన్‌మసాలాలను ట్రాన్స్పోర్టర్ల ముసుగులోని స్మగ్లర్లు యథేచ్ఛగా సరిహద్దులు దాటించేస్తున్నారు. వివాదాలతో రచ్చకెక్కిన వ్యవహారం గతంలో కొద్దిమంది మాత్రమే ఇలా వ్యాపారం సాగించేవారు. ప్రస్తుతం ఇలాంటి వ్యాపారాలు సాగించే వారు బాగా పెరిగిపోయారు. దీంతో పోటీ పెరిగి వ్యాపారులను తమ ట్రాన్స్పోర్ట్ వైపు ఆకర్షించేందుకు స్మగ్లర్లు ఎత్తుగడలు మొదలుపెట్టారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, నెల్లూరు ప్రాంతాలు చెన్నైకి దగ్గరలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ అవతలి వారి వాహనాలను పట్టించే పనులను మొదలుపెట్టారు. ఇందులోనూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే రవాణాదారులకు వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకుల అండతో జీరో దందా వ్యాపారం సాగిస్తున్న రవాణాదారులను ఏ అధికారీ ఎదుర్కొనే పరిస్థితి లేదు. గుట్టుగా సాగిపోతున్న జీరోదందా స్మగ్లర్ల మధ్య వివాదాల నేపథ్యంలో మరోమారు రచ్చకెక్కింది. ఇటీవల ఓ వర్గానికి చెందిన పార్శిల్ లారీని అధికారులు పట్టుకోవడంతో, సంబంధిత వ్యక్తులు చెక్‌పోస్ట్‌కు వచ్చి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులు కూడా స్మగ్లర్లలో ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


