breaking news
TPCC spokesperson
-
ఉత్తమ్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం తెలంగాణలో పార్టీని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నైతిక బాధ్యత తీసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుందనీ, కానీ ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందని అన్నారు. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్‌గా పనికిరారని చెప్పి నాడు పొన్నాలను రాజీనామా చేయించారు. మరిప్పుడు అదే సూత్రం ఉత్తమ్‌కు కూడా వర్తిస్తుంది కదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 2 సీట్లే గెలుచుకుందని గుర్తు చేశారు. (‘అందుకే కాంగ్రెస్‌లో 20 మంది డమ్మీ అభ్యర్థులు’) ‘రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు నమ్మారు. కానీ, నిన్ను నమ్మడం లేదు. అందుకే ఈ ఘోర పరాజయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు నీ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. నువ్ హౌజింగ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలను బయటపెట్టకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీతో లాలూచీ పడ్డావ్. కేసీఆర్ చెప్పినట్టు విన్నావ్. కుంభకోణాలు బయటపెట్టొద్దని సరెండర్ అయ్యావ్. గతంలో చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందుగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మైహోమ్ రామేశ్వరరావుతో ఉత్తమ్ ఒప్పందం చేసుకోవడం వల్లనే కాంగ్రెస్ సీట్లను ఆలస్యంగా ప్రకటించింది’ అని ఉత్తమ్‌కుమార్‌పై కాంతం ఆరోపణలు గుప్పించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ‘కోదండరామ్ కేసీఆర్ సూచించిన మనిషి. ఉద్యకారుడు, మేధావి. ఆయన మేధావితనం వాడుకోవాలి. కానీ, కోదండరామ్ టీజేఎస్ పార్టీని ఎందుకు కూటమిలో కలిపావ్’ అని కాంతం ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. కూటమి ఏర్పాటు విషయంలో ఉత్తమ్ జాతీయ నాయకులను తప్పుదోవ పట్టించారని కాంతం విమర్శించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యకారుడు కానందునే ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ‘పార్టీ అంత ఘోరంగా ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిపోయి సిగ్గు లేకుండా మీటింగ్ ఎలా పెడుతావ్. ఉద్యమకారులను, దళిత నాయకులను కించపరిచావ్. టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలి’ అని కాంతం డిమాండ్ చేశారు. -
‘కాంగ్రెస్ ఓటమికి.. కోవర్టులు పనిచేస్తున్నారు’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ముగ్గురు బడా నేతలు కోవర్టులుగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. మంచి వారిగా నటిస్తూ.. పార్టీలోని అంతర్గత విషయాల్ని టీఆర్ఎస్కు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అందుకే, 20 మంది డమ్మీలను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమై.. ఎక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టాలో ఈ కోవర్టులు ఒప్పందం చేసుకున్నారని ఆయన మీడియాకు బుధవారం వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీ భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, కరీంనగర్లోనూ మరో ఇద్దరు కాంగ్రెస్ కోవర్టులున్నారని కాంతం అన్నారు. కేటీఆర్ చెప్పిన వారికే టికెట్లు వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు రాకుండా.. ఈ కోవర్టులంతా కలిసి హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో మాత్రం ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించారని అన్నారు. ‘రేపు (గురువారం) విద్యార్థి నాయకులం, ఉద్యమకారులం భేటీ అవుతాం. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో జరిగిన అవకతవకలను బయటపెడతాం’ అని ఆయన హెచ్చరించారు. వాస్తవాలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. -
కారు బోల్తా: టీపీసీసీ నాయకుడికి గాయాలు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర్ మండలం బాన్సువాడ క్రాస్ రోడ్డు వద్ద శనివారం టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్ గౌడ్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... మహేష్‌కుమార్‌ను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ విషయం తెలిసిన తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆసుపత్రికి చేరుకుని... మహేష్‌కుమార్‌ను పరామర్శించారు.