breaking news
TPCC President N.Uttam Kumar Reddy
-
సానుభూతి X అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ రావడంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై మెదక్ జిల్లా నేతలతో మాట్లాడారు. ఇక టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం జపిస్తూ ఎన్నికకు సమాయత్తమవుతోంది. సానుభూతిపైనే కాంగ్రెస్ ఆశలు కాంగ్రెస్‌కు నారాయణఖేడ్ నియోజకవర్గంలో బలమైన పునాది ఉంది. ఇక్కడ ఇప్పటిదాకా కేవలం ఒక్కసారే(1994లో) కాంగ్రెస్ ఓడిపోయింది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ వరుస విజయాలు సాధించింది. వీటికితోడు నియోజకవర్గంలో పార్టీ నేతలు పి.కిష్టారెడ్డి, సురేశ్ షెట్కార్ కుటుంబాలకు బలమైన అనుచర వర్గం ఉంది. ఈ రెండు కుటుంబాలు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్‌ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ నేతల విశ్వాసం. ఈ కుటుంబాల నుంచి ఒకరు లోక్‌సభకు, మరొకరు శాసనసభకు పోటీలో ఉంటూ పరస్పరం సహకరించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీచేయగా, పి.కిష్టారెడ్డి అసెంబ్లీకి పోటీచేశారు. నారాయణఖేడ్ నుంచి పోటీ చేసిన కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, షెట్కార్ ఓడిపోయారు. కిష్టారెడ్డి అకాల మృతితో వస్తున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని షెట్కార్ అభిలషించారు. అయితే కిష్టారెడ్డిపై ఉన్న సానుభూతితో ఆయన కుమారుడు సంజీవరెడ్డిని పోటీలోకి దించాలని టీపీసీసీ నిర్ణయించింది. షెట్కార్తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతి పక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మెదక్ జిల్లా ముఖ్య నేతలు దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి సమావేశమై ఉప ఎన్నికల్లో సహకరించాలని కోరారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల తరఫున పనిచేయాలని, రానున్న సాధారణ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని నచ్చజెప్పారు. టీఆర్ఎస్ అభివృద్ధి జపం.. సాధారణ ఎన్నికల నాటికి నారాయణఖేడ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలహీనంగానే ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నేతలను పెద్దఎత్తున చేర్చుకుంది. జిల్లాకు చెందిన మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గంలోని చెరువులు, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి వాటికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఉప ఎన్నికల కోణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల్లోనూ ఈ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి పదవులు, కాంట్రాక్టులను ఎరగా చూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను కూడా తమకు అనుకూలంగా మల్చుకోవడానికి టీఆర్ఎస్ యత్నిస్తోంది. -
కేసీఆర్‌కు చెంపపెట్టు
హైకోర్టు ఉత్తర్వులపై ఉత్తమ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను పాతవిధానంలోనే నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి హితవు పలికారు. గురువారం ఉత్తమ్‌కుమార్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ, హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒంటెత్తు పోకడలు, నియంతృత్వ వైఖరితో ఉన్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లామని, ప్రతిపక్షపార్టీగా తమ వాదనను కోర్టు కూడా అంగీకరించిందని చెప్పారు. రిజర్వేషన్లపై, షెడ్యూల్ గడువు తగ్గింపుపై తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తే పార్టీలో చర్చించి ఎన్నికలను బహిష్కరించే విషయాన్ని కూడా యోచిస్తామని ఉత్తమ్ హెచ్చరించారు. అధికారులు కూడా అధికారపార్టీకి తొత్తులుగా కాకుండా రాజ్యాంగ నియమాలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. డివిజన్ల రిజర్వేషన్లు ఉదయం ప్రకటించి, సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్లకు రెండు రోజులే గడువు ఇస్తే అభ్యర్థులను ఎలా ఎంపికచేస్తాం, ప్రచారానికి గడువు ఏదీ, పోటీ ఎలా చేస్తాం అంటూ ఉత్తమ్ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పాకిస్తాన్, మయన్మార్లా ఉందని, అలాంటి పరిస్థితులుంటే పోటీ ఎలా చేస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇదిలాఉండగా, మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పిటిషన్‌కు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో గాంధీభవన్‌లో గురువారం సాయంత్రం సంబరాలు చేసుకున్నారు. ఉత్తమ్కుమార్డ్, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. టపాకాలు కాల్చి, మిఠాయిలను పంచుకున్నారు. దివాళాకోరుతనానికి నిదర్శనం డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ప్రకటిస్తామని, జనవరి 1న షెడ్యూల్ విడుదల చేస్తామని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పై నిలబడకపోవడం కేసీఆర్ దివాళాకోరుతనానికి నిదర్శనం. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ బలహీనంగా ఉండటం వల్లనే ఎన్నికలు వాయిదా వేయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కనువిప్పు కావాలి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ వ్యవహరించిన ప్రభుత్వానికి ఈ తీర్పు కనువిప్పుకావాలి. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు వ్యతిరేకించాలి. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం కార్యదర్శి సర్కార్ కుట్ర విఫలం ఆదరాబాదరాగా అధికారాన్ని చేపట్టాలని టీఆర్ఎస్ చే స్తున్న ప్రయత్నాలకు ఈ తీర్పుతో బ్రేక్ పడింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇదొక మెట్టులాంటిది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా చేసేందుకు పన్నిన కుట్ర విఫలమైంది. - చాడ వెంకటరెడ్డి, సీపీఐ కార్యదర్శి