breaking news
Totalitarian regime
-
చంద్రబాబుది నిరంకుశ పాలన
చిలకలూరిపేటటౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పద్ధతుల్లో పాలన చేస్తున్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు విమర్శించారు. స్థానిక నన్నపనేని వెంకటరత్నం కళ్యాణమండపంలో సీపీఎం జిల్లా మహాసభలు ఆదివారం ముగిసాయి. కార్యక్రమంలో మధు మాట్లాడుతూ గత ఆరునెలల కాలంలో రాజధాని నిర్మాణం, హుద్‌హుద్ తుపాను, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు అంశాలపై ప్రతిపక్షాలతో ఒక్కసారి కూడా చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. అలాంటిది తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలతో సంప్రదించి ఏకగ్రీవం చేసుకోవటానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలపై నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసుల ద్వారా ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ,టీడీపీలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ దారుణంగా నష్టపోగా, విభజనకు మద్దతు పలికిన టీడీపీ రాజకీయంగా లబ్ధి పొందిందన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతర పోరాటాలు, ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు డాక్టర్ హేమలత, నాయకులు వి.కృష్ణయ్య, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రసంగించారు. జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు సీపీఎం జిల్లా కార్యదర్శిగా పాశం రామారావు తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా మహాసభల్లో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా సింహాద్రి శివారెడ్డి, గద్దె చలమయ్య, వై నేతాజీ, జొన్నా శివశంకర్, జేవీ రాఘవులు, వై రాధాకృష్ణమూర్తిలను ఎన్నుకున్నారు. మరో 31 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా నియమించారు. -
‘సమాచార హక్కు’తో ప్రజాస్వామ్య పటిష్టత
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీధరాచార్యులు కేయూలో ‘పాములపర్తి’ స్మారకోపన్యాసం కేయూ క్యాంపస్,న్యూస్‌లైన్ : నిరంకుశ పాలన వల్ల వాక్ స్వాతంత్య్రం దెబ్బతినడమే కాకుండా మనుషుల నూతన ఆలోచనలు నిలిచిపోయే లా చేస్తుందని.. ఈ మేరకు పరిపాలనలో రహస్యం ఉండొద్దనే భావనతో భారతదేశంలో తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య పటిష్టతకు దోహదం చేస్తోందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత పాములపర్తి సదాశివరావు ఆరో స్మారకోసన్యాసం కేయూలోని పరిపాలన భవనంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన శ్రీధరాచార్యులు ‘పౌరులకు సమాచార హక్కు చట్టం - ప్రజాస్వామ్య పటిష్టత’ అంశంపై మాట్లాడారు. సమాచార హక్కు చట్టంతో సామాన్యులకు సైతం సమాచారం తెలుసుకునే అధికారం కలుగుతుందని, దీంతో ప్రశ్నించేతత్వం ఏర్పడుతుందని, ప్రశ్నించేతత్వమే ప్రజాస్వామ్యంలో కీలకమని అన్నారు. ఢిల్లీ మాదిరి చైతన్యం రావాలి సమాచార హక్కు చట్టం కింద వ్యక్తిగత సమాచారం, దేశ భ ద్రత సమాచారం మినహాయించి ఏ సమాచారాన్ని అయినా పొందొచ్చని శ్రీధరాచార్యులు తెలిపారు. ఢిల్లీ పరిసర ప్రాం త ప్రజల్లో చైతన్యం ఎక్కువగా ఉందని చెబుతూ ఈ చట్టంకింద తన పరిధిలోనే రెండు వేల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అక్కడ అడిగే సమాచారం ఇవ్వలేక అధికారులు ఉర్కిరిబిక్కిరవుతున్నారని, అదే మాదిరిగా తెలంగాణ ప్రజల్లో కూడా చైతన్యం రావాలని ఆయన ఆకాంక్షించారు. ఓ 11 ఏళ్ల బాలిక మహాత్మాగాంధీని జాతిపితగా పేర్కొనేం దుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని పీఎం కార్యాలయానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిందని, కరెన్సీ నోట్లపై నవ్వుతున్న గాంధీ ఫొటో కాకుండా మిగతా చిత్రాలు ఎందుకు ముద్రించడం లేదని ప్రశ్నించారని.. ఇలా కొత్తకొత్త ఆలోచనలతో సమాచారం కోసం వస్తున్న దరఖాస్తులకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు కొందరు ఇష్టపడడం లేదన్నారు. సదాశివరావు బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత పాములపర్తి సదాశివరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఎమర్జెన్సీ రోజుల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఐక్యరాజ్య సమితికే లేఖ రాసిన ధీరోదత్తుడని శ్రీధరాచార్యులు తెలిపారు. అలాగే, మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావుకు సదాశివరావు గురువుగా పేర్కొనవచ్చన్నారు. పీవీ నర్సింహారావు ఐదేళ్లపాటు భారత ప్రధానిగా నెగ్గుకువచ్చారంటే ఆయన రాజకీయచతురతలో పాములపర్తి సదాశివరావు ప్రభావం కూడా ఉందన్నారు. సమాచార హక్కు చట్టం వస్తుందని తాను ఊహించలేదని, అది తీసుకురావటమే కాదు.. తాను కేంద్ర సమాచార కమిషనర్‌గా ఎంపికయ్యానని చెపుకొచ్చారు. కాగా, ఢిల్లీలో కేంద్ర సమాచార కార్యాలయానికి వివిధ కేసులపై వచ్చే వారు హిందీలో అడుగుతున్నారని, వారు హిందీలోనే మాట్లాడుతారని శ్రీధరాచార్యులు అన్నారు. అరుుతే తనకు హిందీ భాష వచ్చేది అంతంత మాత్రమేనని, తాను ఇంగ్లిష్‌లో మాట్లాడితే వారికి రావటం లేదని, దీంతో కొంత సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే తాను త్వరలోనే హిందీ కూడా పూర్తి స్థాయిలో నేర్చుకుంటానని తెలిపారు. అక్బర్ దర్బార్‌లోనే ప్రశ్నించేతత్వం ప్రశ్నించే తత్వం అందరికీ రావాలనే అంశాన్ని వివరిస్తూ శ్రీధరాచార్యులు.. అక్బర్ చక్రవర్తి దర్బార్‌కు సంబంధించిన కథ చెప్పారు. ‘ఓ రోజు అక్బర్ ఉదయమే పండ్లు అమ్ముకునే వ్యాపారి ముఖం చూడగా, చేయి కోసుకుపోయిందట. వ్యాపారి ముఖం చూడడం వల్లే అనర్థం జరిగిందని భావించిన చక్రవర్తి సూచన మేరకు భటులు ఆ వ్యాపా రిని ఉరి తీసేందుకు తీసుకొచ్చారు. అయితే, ఆ వ్యాపారి.. మీరు నా ముఖం చూసినందుకే చేయి కోసుకుపోయిందంటున్నారు.. మరి నేను ఉదయం మీ ముఖం చూసినందుకు ఉరి శిక్ష అనుభవించబోతున్నాను.. అని అక్బర్‌తో చెప్పారట. దీంతో చక్రవర్తికి కనువిప్పు కలిగి ఆ వ్యాపారిని వదిలివేశారు.’ ఇలా ప్రశ్నించేతత్వం వల్లే వ్యాపారి ప్రాణాలతో బతికి బయటపడ్డాడనని, పౌరులు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీధరాచార్యులు సూచించారు. సమావేశంలో కేయూ వీసీ ప్రొఫెసర్ బి వెంకటరత్నం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, ప్రొఫెసర్ కె.సీతారామారావు, సదాశివరావు కుమారుడు నిరంజన్‌రావు, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ టి.యాదరగిరిరావు, ప్రొఫెసర్ జీవీ.భవానీప్రసాద్, ప్రొఫెసర్ పి.కృష్ణమాచార్య, డాక్టర్ పి.రామరావు, పి.నిరంజన్‌రావు, వీఎల్.నర్సింహారావుతోపాటు పరిశోధకులు, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, ప్రముఖ జర్నలిస్టు, జనధర్మ పత్రిక సంపాదకులు దివంగత ఎంఎస్.ఆచార్య పేరున ఎండోమెంట్ లెక్చర్ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన కుమారుడు కేయూ ఆంగ్ల విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.రాజగోపాలచారి, సురవరం ప్రతాప్‌రెడ్డి పేరున ఎండోమెంట్ లెక్చర్ ఏర్పాటుచేస్తున్నట్లు పాములపర్తి సదాశివరావు ట్రస్టు సభ్యులు ప్రభాకర్‌రావు ప్రకటించారు.