breaking news
Tobacco sales
-
సంక్షోభంలో పొగాకు రైతు
వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మార్కెట్లో తగ్గిన కొనుగోళ్లు, కానరాని గిట్టుబాటు ధరలు వెరసి పొగాకు రైతును సంక్షోభంలోకి నెట్టాయి. బయ్యర్లతో సమావేశాలు పెట్టి రైతన్నను కాపాడాల్సిన పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో పొగాకు రైతు ఈ ఏడాది భారీ నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పొదిలి-2 కేంద్రం పరిధిలోని కనిగిరి ప్రాంత రైతులు పొగాకు రైతులు వచ్చే ఏడాది పొగాకు పంటకు క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. - ఇళ్లల్లో మగ్గుతున్న బేళ్లు - భారీ నష్టం చవిచూసే ప్రమాదం - లబోదిబోమంటున్న రైతులు - క్రాప్ హాలిడే ప్రకటించిన పొదిలి-2 కేంద్రం రైతులు కనిగిరి జిల్లాలో పొగాకు విక్రయాల్లో సంక్షోభం ఏర్పడడంతో ఆ రైతుల్లో భయోందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 11 వేలం కేంద్రాలుండగా వాటికి సంబంధించి 90 మిలియన్ కేజీల అనుమతి ఉండగా, 108 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు అంచనా. పొదిలి వేలం కేంద్రం-2 పరిధిలో 14 మండలాలున్నాయి. ఈ కేంద్రం పరిధిలో 1750 వరకు బ్యారన్లుండగా ఒక్క కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనే 1350 బ్యారన్లున్నాయి. దీనికి సంబంధించి 2,200 మంది పొగాకు లెసైన్స్ రైతులున్నారు. ఈ రైతులు గత ఏడాది 9.4 మిలియన్ కేజీలు పొగాకు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 8.5 మిలియన్ కేజీలు మాత్రమే చేశారు. గత ఏడాది జూన్ నాటికి 4.8 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరగ్గా, ఏడాది జూన్ నాటికి 1.2 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగినట్లు అధికారిక నివేదికలున్నాయి. భారీగా నష్టంవాటిల్లే ప్రమాదం అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు వరకు పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటికే 45 శాతం పొగాకు అమ్మకాలు జరిగి ఉండాలి . కారణాలు ఏమైనా బయ్యర్లు పొగాకును కొనుగోలు చేసే వాతావరణం కనిపించడం లేదు. అంటే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 5 మిలియన్ కేజీల అమ్మకాలు జరిగినా, దాదాపు 3.5 మిలియన్ కేజీల పొగాకు నిలిచిపోతోంది. అందులో గ్రేడ్ 1 రకం కనీసం 1.5 మిలియన్ కేజీలుంటుందనేది రైతుల అంచనా. లేదా ప్రస్తుతం గ్రేడ్ 1 రకానికి కేజీకి సరాసరిన రూ.90 నుంచి రూ.108 వరకు ఇస్తున్నారు. దానిని సగం రేటుకు అమ్ముకున్నా నష్టం వస్తుంది. ప్రస్తుతం ఒక్కో రైతు ఇంట్లో 30, 40 బేళ్లు మగ్గిపోతున్నాయి. సరైన గిట్టు బాటు ధరలేక, లోగ్రేడ్ పొగాకు అమ్మకాలు జరగక తీసుకెళ్లిన బేళ్లు వెనక్కి తీసుకుని రావాల్సిందే. ఈ ఏడాది ఒక్కో రైతుకు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. విదేశీ ఆర్డర్లు తగ్గినందునే... దీనిపై ఆక్షన్ సూపరిండెంట్ సత్యన్నారాయణ రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా దేశంలో పొగాకు ఉత్పత్తుల వాడకం తగ్గింది. విదేశీ అర్డర్లు తగ్గినందువల్ల బయ్యర్లు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. కనిగిరి ప్రాంత పొగాకు రైతులు వచ్చే ఏడాదికి క్రాప్ హాలిడే ప్రకటిస్తూ తీర్మానం చేసి వినతి పత్రం ఇచ్చిన విషయం వాస్తవమే. -
ప్రజలు సహకరించాలి
- స్కూళ్ల వద్ద పొగాకు విక్రయాల నియంత్రణపై విద్యా మంత్రి - అత్యధికంగా దానికి బానిసలవుతున్నది 15 ఏళ్లలోపు వారేనని వెల్లడి - 10 నిమిషాల నిడివి ఉన్న లఘ చిత్రం విడుదల - ఘనంగా ఐసీఎస్ వ్యవస్థాపక దినోత్సవం సాక్షి, ముంబై: పాఠశాల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడానికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహాయం అవసరమని విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే అభిప్రాయపడ్డారు. శనివారం ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ఐసీఎస్) అనే ఎన్జీవో సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పొగాకు వ్యతిరేక చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పొగాకు వ్యతిరేక చట్టాన్ని అమలు చేసేందుకు ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో 90 మీటర్ల మేర పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించినట్లు తెలిపారు. అయినా కొందరు విక్రయాలను కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. దీంతో పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరిగితే నివేదిక సమర్పించాల్సిందిగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్స్ (పీటీఏఎస్) సభ్యులకు కూడా విజ్ఞప్తి చేశానన్నారు. విద్యా శాఖకు వీరు ఫోన్లు లేదా ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ మాట్లాడుతూ.. తాను 15 ఏళ్ల వయస్సులో ధూమపానానికి అలవాటు పడ్డానని, తరువాత స్నేహితుల సాయంతో వదిలించుకున్నానని తెలిపారు. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా రూపొందించిన 10 నిమిషాల నిడివి ఉన్న ఓ లఘు చిత్రాన్ని కార్యక్రమంలో ప్రదర్శించారు. ఐసీఎస్ లెక్కల ప్రకారం.. పొగాకు వినియోగానికి బానిసలైన వారిలో సగం మంది 15 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారని తేలింది. ప్రతి ఏడాది పొగాకుకు బానిసలై దాదాపు మూడు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. గన నాలుగేళ్లుగా 1,320 మంది క్యాన్సర్ రోగులకు ఎన్జీవో సంస్థ సహాయాన్ని అందజేసింది. ఇందులో 196 మంది రాష్ట్రానికి చెందినవారు ఉండగా, 249 మంది బెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు.