breaking news
tnk
-
ఆధార్ అనుసంధానం భేష్
కొవ్వలి (దెందులూరు) : ఆధార్ అనుసంధానం, ఆన్లైన్, ఈ–పోస్ అమలు స్ఫూర్తిదాయకమని బిల్‌గేట్స్ మెలిండా ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం ఆ సంస్థ బృంద సభ్యులు దెందులూరు మండలం కొవ్వలి, తణుకు ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కొవ్వలిలో మొటపర్తి భవన్, ఆంధ్రాబ్యాంక్, పంచాయతీ కార్యాలయం, కో ఆపరేటివ్ సొసైటీ, రేషన్‌షాపులను టీమ్ సభ్యులు పవన్ భక్తి, డేనియర్ మైఖేల్ రాడ్ క్లిఫ్, డేవిడ్ జాసాన్, పార్కర్, శారా, ఇ హ్యాండ్రిక్స్, లిజ్ కిల్సన్, జర్మీ ప్లేస్ పెప్రో, కింబర్లీ లింగ్లీ, నిక్ యాగన్, సునీల్ రామన్ పరిశీలించారు. వారికి అదనపు సంయుక్త కలెక్టర్ షరీఫ్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించే స్థాయికి ఎదగాలన్నారు. దారిద్ర్యరేఖ దిగువున ఉన్న ప్రతి ఒక్కరూ కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. ఆఫ్రికా, టాంజానియా, మలేషియా దేశాల్లో తమ ఫౌండేషన్ సేవలు అందిస్తుందని, త్వరలో భారత్‌కు పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్టు చెప్పారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకట రమణ, ఐసీడీఎస్ పీడీ చంద్రశేఖరరావు, డీఎస్వో శివశంకర్‌రెడ్డి, అగ్రికల్చర్ జేడీ సాయిలక్ష్మీశ్వరి, ఫిషరీస్ డీడీ భాషా, తహసీల్దార్, ఎస్.సత్యనారాయణ, ఎంపీడీవో ఎంవీ అప్పారావు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా..
ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైఎస్సార్ సీపీ శ్రేణులు నినదించాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 22న ఏలూరులో జరగనున్న యువభేరి సన్నాహకాల్లో భాగంగా ఆదివారం తణకులో జిల్లా సమన్వయ కమిటీ సమావేశమైంది. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని, జిల్లా ఇన్చార్జి పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, వంక రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. తణుకు : ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, హోదా కోసం ఎందాకైనా.. ప్రాణత్యాగానికైనా సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు నినదించారు. హోదా సాధన కోసం పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 22న ఏలూరులో నిర్వహించనున్న యువభేరి కార్యక్రమం సన్నాహకాల్లో భాగంగా ఆదివారం తణుకులో జిల్లా సమన్వయ కమిటీ సమావేశమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అధ్యక్షతన స్థానిక నెక్ కల్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజల గుండెలు ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదంతో మార్మోగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం రెండుగా చీలిపోయినప్పుడు ప్రజలు ఎంతగా రోదించారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తినేలా బీజేపీ, టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవల రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తే, ప్రజలందరూ భాగస్వాములయ్యారని, దీనిని సహించలేని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులకు పాల్పడిందని, బంద్‌ను నీరుగార్చేందుకు యత్నించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారని స్పష్టం చేశారు. యువభేరి విజయవంతానికి నియోజవర్గ కో–ఆర్డినేటర్లు కృషి చేయాలని సూచించారు. పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన బీజేపీ, టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏదో ఘనకార్యం చేసినట్లు వెంకయ్యనాయుడు సన్మానాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నరసాపురం పార్లమెంటు నియోజవకర్గ కో–ఆర్డినేటర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుమ్మక్కై ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పోరాడాలన్నారు. బలప్రదర్శన కాదు ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 22న ఏలూరులో నిర్వహించే యువభేరి సభ బలప్రదర్శన కోసం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతోపాటు వివిధ వర్గాల నుంచి మేధావులు, ప్రొఫెసర్లు పాల్గొంటారని చెప్పారు. కేవలం ప్రత్యేక హోదా అంశంపై ముఖాముఖి జరుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే అన్యాయాన్ని వివరించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 300 మంది విద్యార్థులు హాజరయ్యేలా నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు, నాయకులు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, పాతపాటి సర్రాజు, తెల్లం బాలరాజు, ఘంటా మురళి, గుణ్ణం నాగబాబు, కౌరు శ్రీనివాసు, పుప్పాల వాసుబాబు, దయ్యాల నవీన్‌బాబు, తలారి వెంకట్రావు, కొయ్యే మోషేనురాజు, మహిళా విభాగం జిల్లా అ«ధ్యక్షురాలు సాయిబాలపద్మ, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పేరిచర్ల నర్శింహరాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణస్వరూప్, నాయకులు చీర్ల రాధయ్య, ఎస్‌ఎస్‌రెడ్డి, నార్గన సత్యనారాయణ, ములగాల శ్రీనివాసు, కలిశెట్టి శ్రీనివాసు, బోడపాటి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.