breaking news
Tirmanpalli
-
చదువే పెద్ద ఆస్తి
జీవితానికి ‘బాట’ వేయాలి కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ సదాశివనగర్ (ఎల్లారెడ్డి): అన్నిటి కంటే చదువే పెద్ద ఆస్తి అని, ఆ చదువుతోనే తలరాత మార్చుకోవచ్చని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ‘బడిబాట’ కార్యక్రమం చిన్నారుల జీవితానికి రాచబాట కావాలని ఆకాంక్షించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిర్మన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ కావాలంటే మొదట చదువు ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత జిల్లాగా కామారెడ్డి ఉందని, దీన్ని మార్చేందుకు ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. తాను ఐఏఎస్ కావడానికి తన తల్లిదండ్రులు పెద్దగా కష్టపడలేదని, ఎక్కువ డబ్బులు ఖర్చు చేయలేదని తన విద్యాభాస్యం మొత్తం ప్రభుత్వ బడిలోనే కొనసాగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, అదే ప్రైవేట్ పాఠశాలలో కనీస విద్యార్హత లేని ఉపాధ్యాయులతో బోధన చేయిస్తారన్నారు. ప్రైవేట్‌లో చదివితే చేతిలో బ్యాగ్ పట్టుకొని తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివితే నాలాగా కలెక్టర్‌గా ఉన్నత స్థానంలో నిలబడటానికి అవకాశం ఉంటుందన్నారు. తమ పిల్లలను వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ బడులకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న హెచ్ఎం రాజు, నందకిషోర్‌ను కలెక్టర్ అభినందించారు. ఢిల్లీ పబ్లిక్ పాఠశాలల్లో లేని మాస్టర్ డిగ్రీ చేసిన నిష్ణాతుడు నందకిషోర్ మీ గ్రామ పాఠశాలలో ఉండడం అదృష్టంగా భావించాలన్నారు. డీఈవో మదన్మోహన్, తహసీల్దార్ అమీన్‌సింగ్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో యోసెప్, జెడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్రావ్, విశ్రాంత ఎంపీడీవో విఠల్‌రావ్, సర్పంచ్ సురేశ్, ఉప సర్పంచ్ వెంకయ్య, ఎస్ఎంసీ చైర్మన్ నారాయణ, వీడీసీ చైర్మన్ నారాయణరెడ్డి, విండో డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, రాజయ్య, పాల కేంద్రం అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ పెద్దొల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
బాల్యానికి రక్షణ ఏది?
నందిపేట (నిజామాబాద్ జిల్లా) : అందరిలాగే చదువుకోవాలని తలంచినది ఆ బాలిక. తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి చూపిన బిక్షాటన మార్గంలో తగినంత అడుక్కురాలేక పోతోంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కన్న తండ్రి కాలయముడిగా మారి గదిలో బంధించి కట్టేసి చితకబాదాడు. పదేళ్ల ఆ బాలిక ఒళ్లంతా గాయాలవడమేకాక కాళ్లు చేతులు విరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన కోట ఎల్లప్ప కొంత కాలం క్రితం బతుకు దెరువు కోసం ఇద్దరు కూతుర్లను వెంట తీసుకుని నందిపేట వచ్చాడు. వీరు వృత్తిరీత్యా బుగ్గల వ్యాపారులు. ఎల్లప్ప తన భార్యను చంపిన ఘటనలో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే తిరిగి వచ్చాడు. వచ్చిన నాటి నుండి ఇద్దరు కూతుర్లను బిక్షటనకు పంపిస్తున్నాడు. ప్రతి రోజు ఇద్దరు కూతుర్లు బిక్షాటన చేసిన డబ్బులు తండ్రికి తెచ్చి ఇవ్వాలి. శనివారం చిన్న కూతురు బడ్డెవ్వ సరిపడా డబ్బులు తీసుకురాలేదు. తప్ప తాగిన తండ్రి ఆగ్రహాంతో ఊగిపోతూ బాలికను గదిలో బంధించి, కిటికీకి కట్టేసి కొట్టాడు. దీంతో ఒడ్డెవ్వకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కుడి చేయి, కాలు విరిగి పోయి నిస్సహాయ స్థితిలో పడిపోయింది. చుట్టుపక్కలవారు ఈ విషయం తెలుసుకుని, బాలికను రక్షించి అంబులెన్సుకు సమాచారం అందించారు. ఎల్లప్ప వారితోనూ గొడవకు దిగే ప్రయత్నం చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎల్లప్పను అదుపులోకి తీసుకున్నారు. గామపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. తండ్రి విచక్షణా రహిత చర్యకు సహాయ పడిన పెద్దకూతురు పోసాని పరారయింది.