breaking news
three persons die
-
ముగ్గురిని మింగేసిన మ్యాన్‌హోల్
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు మ్యాన్హోల్లోకి దిగి ప్రమాదవశాత్తూ మరణించారు. మృతులు ముగ్గురూ ఏపీకి చెందిన వలస కార్మికులు కావటం గమనార్హం. సోమవారం రాత్రి కృష్ణరాజపురం పరిధిలోని కగ్గదాసపురంలో ఈ ఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం కార్మికులైన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన ఆంజనేయరెడ్డి (34), శ్రీకాకుళ జిల్లా చెంగేడిపేట మండలం కలవలుస గ్రామానికి చెందిన యర్రయ్య(35), శ్రీకాకుళానికి చెందిన దవితానాయుడు అలియాస్ డీబీ నాయుడు(40) పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వచ్చారు. వీరిలో ఆంజనేయరెడ్డి సైట్ ఇంజినీర్‌గా, మిగతా ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కగ్గదాసపురలో మ్యాన్‌హోల్‌లో మురుగు ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఆంజనేయరెడ్డి, యర్రయ్య, దవితా నాయుడు మ్యాన్‌హోల్ వద్దకు చేరుకున్నారు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండానే యర్రయ్య, దవితా నాయుడు 15 అడుగుల లోతున్న మ్యాన్హోల్లోకి దిగి మరమ్మతు ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అందక గట్టిగా కేకలు వేశారు. దీంతో పైన ఉన్న ఆంజినేయరెడ్డి తాడు సాయంతో లోపలికి దిగాడు. ఈ క్రమంలోనే ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కాంట్రాక్టర్లు, జలమండలి అధికారులు సరైన జాగ్రత్త చర్యలను పాటించకకుండా నిర్లక్ష్యం వహించడంతోనే కార్మికులు తనవు చాలించారని స్థానికులు ఆరోపించారు. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కె.జె.జార్జ్, పాలికె మేయర్ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతదేహాలను బోరింగ్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బయపనహళ్లి పోలీసులు తెలిపారు. -
వైద్యం కోసం వెళుతుంటే విధి కాటేసింది
రాజోలు, న్యూస్‌లైన్ :మెరుగైన వైద్యం కోసం రాజోలు నుంచి ఓ కుటుంబం హైదరాబాద్ బయలుదేరింది. వారు హైదరాబాద్ చేరకముందే విధి కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. కృష్ణాజిల్లా కేసరిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు నాగమణి (42), పామర్తి కృష్ణ (52), డ్రైవర్ చిటికినీడి సతీష్ (28) మృతి చెందారు. కృష్ణ, నాగమణిల కుమారుడు చిరంజీవి (25) తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని విజయవాడ రెయిన్బో ఆస్పత్రిలో చేర్చారు. అదనపు డ్రైవర్‌గా కారులో ఉన్న ముత్యాల నరసింహారావు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పామర్తి కృష్ణకు మెరుగైన వైద్యం నిమిత్తం రాజోలు నుంచి టవేరా వాహనంలో ఆదివారం రాత్రి 9.30 సమయంలో కృష్ణ, నాగమణి, చిరంజీవి హైదరాబాదు బయలుదేరారు. డైవర్ చిటికినీడి సురేష్, మరో డ్రైవర్ ముత్యాల నరసింహారావు వీరి వెంట ఉన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరిపల్లి వద్ద సుమా రు 2గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వీరి టవేరా ఢీ కొట్టింది. టవేరా లారీ కిందిభాగంలోకి ఇరుక్కుపోయిం ది. డ్రైవర్ సురేష్ మృతి చెందగా, పక్కసీట్లో ఉన్న చిరంజీవికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్య సీటులో పడుకుని ఉన్న కృష్ణ, ఆయన భార్య నాగమణి అక్కడిక్కడే మృతి చెందారు. చివరిసీటులో ఉన్న అదనపు డ్రైవర్ ముత్యాల నరసింహారావుకు స్వల్పగాయాలు తగిలాయి. నరసింహరావు సెల్‌ఫోన్ లో ఈ ప్రమాదవార్తను రాజోలులో ఉ న్న కృష్ణ సోదరుడు పామర్తి రమణ కు తెలియజేశారు. కృష్ణ బంధువులు ప్రత్యేక వాహనాల్లో హుటాహుటిన కేసరిపల్లి చేరుకున్నారు. ప్రమాదంలో మృ తి చెందిన డ్రైవర్ సురేష్ రాజోలు ని యోజకవర్గం సోంపల్లి వాసి. ఆరోగ్యంతో వస్తాడనుకున్నాం.. తన కుమారుడు కృష్ణ హైదరాబాద్‌లో చికిత్స పొంది ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశతో ఉన్నామని కృష్ణ తల్లిదండ్రులు వెంకటనారాయణ, సావిత్రి దంపతులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తమ మనవడు చిరంజీవి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తూ ఆ వృద్ధ దంపతులు భోరున ఏడుస్తుంటే ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. చిరంజీవికి రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ఆయనకు భార్య రోహిణి, కుమార్తె జ్ఞానాంజలి (1) ఉన్నారు. భీమవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో చిరంజీవి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తండ్రిని వైద్యం కోసం తీసుకువెళ్లడానికి భీమవరం నుంచి అతడు రాజోలు వచ్చాడు. విషాదంలో సురేష్ కుటుంబం సురేష్ మృతితో తమ కుటుంబం వీధిన పడిందని అతడి తల్లి సత్యవతి హృదయవిదారకంగా విలిపిస్తోంది. చిన్న వయసునుంచే కుటుంబ పోషణ బాధ్యతను భుజాన వేసుకుని అన్నీ తానై చూసుకున్నాడని ఆమె కన్నీరుమున్నీరైంది. సురేష్‌కు భార్య సుమ, ఐదేళ్ల కొడుకులు జోగేంద్రసూర్యకుమార్ (5), మణికంఠ (2) ఉన్నారు.