అమెరికా : సాహిత్‌కు TFAS ఉగాది పురస్కారం
న్యూజెర్సీ : ప్రసంగాలతో అదరగొడుతున్న ప్రవాసాంధ్ర విద్యార్థి సాహిత్ మంగును అమెరికా తెలుగు కళా సమితి Telugu Fine Arts Society సత్కరించింది. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు మధు రాచకుల్ల, కార్యదర్శి రవి అన్నదానం Telugu Fine Arts Society తరపున సాహిత్‌కు పురస్కారం అందించారు.
న్యూజెర్సీ సోమర్సెట్లోని సెడార్ హిల్ ప్రిపరేటరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సాహిత్.. ఇటీవల ప్రతిష్టాత్మక గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు దక్కించుకున్నాడు. వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్ మంగు, అతని బృందం అద్భుతంగా ప్రసంగించి విజేతగా నిలిచారు.
గోల్డెన్ గావెల్ టాప్ స్పీకర్ అవార్డు గురించి తెలుగు కళా సమితి కార్యదర్శి రవి ప్రశ్నించగా.. టాప్ స్పీకర్ కోసం పోటీ తీవ్రంగా ఉండిందని, తాను, తన బృందం ప్రతీ రోజు 5 నుంచి 6 గంటలు ప్రత్యేక శ్రద్ధతో పరిశోధన చేశామని, తన తల్లిదండ్రులు యశోదా నందన్, హేమ సహకారంతో ఈ అవార్డు గెలుచుకున్నానని చెప్పాడు సాహిత్.
పర్యావరణానికి మేలు చేసే సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించాలన్న డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపాడు సాహిత్ మంగు.