breaking news
Telugu people of Karnataka
-
తెలుగు ఓటరు ఎటువైపు...?
ఓ వైపు పెద్ద ఎత్తున హంగ్ అసెంబ్లీ ఊహాగానాలు...జోస్యాలు... మరోవైపు అధికారపీఠం తమదేనంటూ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) అధినేతల ప్రకటనలు...మరో నాలుగు రోజుల్లో పోలింగ్... ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర సామాజికవర్గాలు, ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న సంక్షిష్టమైన వాతావరణంలో గణనీయ సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లు కూడా ముఖ్య భూమిక పోషించనున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేవలం ఒకటి లేదా రెండు శాతం ఓట్లే అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించనున్నాయి. కర్ణాటకలోని 15 శాతం వరకు జనాభా తెలుగు మాట్లాడేవారున్నారు. కన్నడ, ఉర్ధూల తర్వాత అత్యధికులు మాట్లాడేది తెలుగే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 40-50 స్థానాల్లో తెలుగు వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి. 12 జిల్లాల్లో ప్రభావం... కర్ణాటకలోని 12 జిల్లాల్లో... తుమ్కూరు, చిత్రదుర్గ, బీదర్, బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్, బళ్లారి, కొప్పల్, రాయచూర్, కలబురిగీ, యద్గిర్, కోలార్, చిక్‌బళ్లాపూర్‌లలో తెలుగువారు అధికసంఖ్యలో ఉన్నారు. బీదర్, కలబురిగీ, కోలార్, బళ్లారిలలో నైతే దాదాపు 30 శాతం తెలుగు ఓటర్లే. బెంగళూరు రూరల్లోనైతే 65 శాతం, అర్భన్‌లో 49 శాతం తెలుగు మాట్లాడే వారే. కోలార్‌లో 76 శాతం, రాయచూర్‌లో 64 శాతం, బళ్లారిలో 63 శాతం ఉన్నారు. బెంగళూరులోని 28 సీట్లలో... రాష్ట్ర రాజధాని «బెంగళూరులోని 28 సీట్లలో దాదాపు 25 లక్షల మంది తెలుగు ఓటర్లున్నారు. పలువురు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు, అక్కడ పనిచేసే వారితో పాటు సాఫ్ట్వేర్రంగ నిపుణులు ఎంతో మంది అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సంబంధ బాంధవ్యాలు, ఇక్కడి రాజకీయ పరిణామాల ప్రభావం అక్కడి తెలుగు ఓటర్లపై పడే అవకాశాలు తక్కువే. 2013 నాటి ఫలితాలనే ఓసారి పరిశీలిస్తే...49 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీతోనే విజయం సొంతమైంది. అదే 2008లోనైతే 64 సీట్లు ఈ విధంగా గెలిచినవే. ఏ పార్టీ వైపు మొగ్గు లేని ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 224 నియోజకవర్గాల్లో 65-70 చోట్ల నువ్వా, నేనా అన్నట్టుగా గట్టి పోటీ నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లోని తెలుగు ఓటర్లకు ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక అంశాలు, సమస్యలు, అక్కడున్న ట్రెండ్‌కు అనుగుణంగానే వారు వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జేపీ వ్యాఖ్యలు విడ్డూరం
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ(జేపీ) మాటలు విడ్డూరంగా ఉన్నాయని, సీమాంధ్రుల మనోభావాలకు ఆయన తూట్లు పొడుస్తున్నారని కర్ణాటక తెలుగు ప్రజా సమితి(కేటీపీఎస్) అధ్యక్షుడు బొందు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీబిల్లుపై చర్చ సందర్భంగా జేపీ మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ అనవసరమని, దానిని వెనక్కు పంపాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పడే తెలంగాణ వాసులు ప్రశాంత జీవనం గడుపుతారని అన్నారు. హైదరాబాద్‌లో ఉండేందుకు తెలుగువారికే స్థానం లేకపోతే ఇక పొరుగు రాష్ట్రాల వారి పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించలేమని అన్నారు. రాష్ర్ట విభజన అనంతరం ఛత్తీస్గడ్ నేటికీ అభివృద్ధికి నోచుకోలేకపోయిందని గుర్తు చేసారు. ఇదే పరిస్థితి సీమాంధ్రలోనూ తలెత్తకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణను కోరుకుంటున్నది శ్రీమంతులు, దొరలు మాత్రమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధికులు తెలంగాణ ఏర్పాటుకు అనుమతిస్తే అలాగే విభజన చేయాలని సూచించారు. సమావేశంలో కేటీపీఎస్ నాయకులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.