breaking news
Telugu cine-writer Ganesh
-
అనుబంధాల ‘కలం’ ఆగింది
అస్తమించిన గణేష్ పాత్రో తమిళ సినిమా : కుటుంబ అనుబంధాలను ఎంతో హృద్యంగా అత్యంత సహజ సిద్ధంగా ఆవిష్కరించే ప్రత్యేక కథా రచయిత గణేష్ పాత్రో సోమవారం చెన్నైలో కన్నుమూశారు. 69 ఏళ్ల ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. బాల్యం నుంచి కథలు రాయడం, నాటకాల్లో నటించడం అలవరచుకున్న గణేష్ పాత్రో స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీ పురంలో 1945 జూన్ 22న ఆదిలక్ష్మీనారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు ఆయన జన్మించారు. ఈ దంపతులకు 17 మంది సంతానంలో పెద్ద వాడు గణేష్‌పాత్రో. ఈయన అసలు పేరు వేహ్రా సత్య గణ గంగ పోలీసు వెంకటరమణ మహా పాత్రో. బీఏ పట్టదారుడైన ఆయనకు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే చిత్ర రంగంలోకి వచ్చారు. నాటకాలు రాయడం, నటించడంపై మక్కువ చూపించే గణేష్ పాత్రోకు ప్రముఖ రంగ స్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వరరావు నటన కంటే రచనలపై దృష్టి సారించాలని సలహా ఇవ్వడంతో పలు కథలను రచించా రు. పావల, కొడుకు పుట్టాల, ఆలోచించండి వంటి పలు నాటకాలను ఆయన రచిం చారు. తొలి నాటకం కొడు కు పుట్టాలకు జాతీయ అవార్డు రావడం విశేషం. ఈ నాటకం పలు భాష ల్లో అనువాదం అయిం ది. రేడియోల్లోనూ ప్రసారం అయింది. సినీ ప్రస్తానం గణేష్ పాత్రో సినీ రంగ ప్రస్తానం 1965లో మొదలైంది. అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని అయిన గణేష్ పాత్రో ఆయనలాగే నటించాలని ఆశపడే వారట. అయితే, ఆయన రాసిన పావల, కొడుకు పుట్టాల నాటకాల సమ్మేళనంతో మాకు స్వతంత్రం కావాలి అనే చిత్రాలను తెరకెక్కించారు. కృష్ణం రాజు, జయ ప్రద హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. అలా, కథా రచయితగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన గణేష్‌పాత్రో 125కు పైగా చిత్రాలకు కథలు, మాటలను అందించారు. బాలచందర్‌తో అనుబంధం దివంగత ప్రఖ్యాత దర్శకుడు కే బాల చందర్‌తో గణేష్‌పాత్రో అనుబంధం విడదీయరానిది. ఆయన చేసిన ప్రతి చిత్రానికి తెలుగులో గణేష్‌పాత్రో సంభాషణలు అందించారు. వారి మధ్య మంచి సాన్నిహిత్యానికి ఇదొ క నిదర్శనం. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర, గుప్పెడు మనసు,ఆకలి రాజ్యం, రుద్ర వీణ, ఇది కథకాదు లాంటి పలు చిత్రాలు గణేష్‌పాత్రోకి మంచి పేరుతెచ్చి పెట్టాయి. బాలచందర్ అస్తమించిన వెళ్లిన రెండు వారాల్లోనే గణేష్‌పాత్రో కలం ఆగిపోవడం సినీరంగానికి తీరని లోటు. కోడి రామకృష్ణతో 40 చిత్రాలు సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ, గణేష్‌పాత్రోల కలయికలో 40 చిత్రాలు తెరకెక్కడం విశే షం. ముఖ్యంగా భార్గవ ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత దివంగత ఎస్ గోపాల్ రెడ్డికి ఆస్థాన రచయితగా గణేష్‌పాత్రో వ్యవహరించారు. అలాగే, ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్‌తో కలసి ప లు చిత్రాలకు పనిచేశారు. మనిషికో చరిత్ర, మయూరి, ప్రేమించి పెళ్లాడు, నాట్య మయూ రి, అత్తవారిళ్లు, స్వాతి, చిలకమ్మ చెప్పింది, వం టి ఎన్నో చిత్రాలు రచయితగా గణేష్‌పాత్రోకు కలికి తురాయిగా మిగిలాయి. మంచి సంభాషణలేగానీ, పంచ్ డైలాగులు రాయన న్న నిబద్ధతతో మానవత విలువలకు అద్దం పట్టే చిత్రాలను చేసిన గణేష్‌పాత్రో చివరి చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావడం విశేషం. నంది అవార్డులు గణేష్‌పాత్రో స్వాతి చిత్రానికి 1983లో, రుద్రవీణ చిత్రానికి గాను 1988లో ఉత్తమ నంది అవార్డులను అందుకున్నారు. మయూరి చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును దక్కించుకున్నారు. 2009లో ఆయన అభిమానంగా ప్రేమించే అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని, 2013లో మనసు కవి ఆత్రేయ బిరుదును అందుకున్నారు. గణేష్‌పాత్రోకు భార్య లక్ష్మికుమారి, కుమార్తెలు కనకమహాలక్ష్మి, సంయుక్త, కుమారుడు సీతారామ పాత్రో తదితరులు ఉన్నా రు. గణేష్‌పాత్రోకు తొలి రోజుల్లోనే దర్శకత్వ అవకాశం వచ్చినా, అని వార్య కారణాలతో తెరరూపం దాల్చ లేదు. కుటుంబ సభ్యులతో కలసి విశాఖ పట్నంలో నివశించాలన్న కోరిక ఆయనకు ఉన్నా, అది నెరవేరకుండానే అందరికీ దూరమయ్యారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కన్నీటి వీడ్కోలు గణేష్‌పాత్రో భౌతిక కాయానికి ఆప్తులు, కుటుంబీకులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన భౌతిక కాయాన్ని నందనం సమీపంలోని నివాసంలో ఉంచారు. ప్రముఖ నటుడు గొల్లపుడి మారుతీ రావు తనయుడు సుబ్బారావు తదితరులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇంటి నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఊరేగింపుగా టీ నగర్ కన్నమ్మ పేట శ్మశాన వాటికకు చేర్చారు. తనయుడు సీతారామ పాత్రో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
గుర్తుకొస్తున్నాయీ...
గణేశ్ పాత్రో 1945 జూన్ 22 - 2015 జనవరి 5 ప్రముఖ నాటక, సినీ రచయిత గణేశ్ పాత్రో మరణంతో ఒక మంచి కలం కాలంలో కరిగిపోయింది. ఆయన మరణం పట్ల దర్శకుడు కె. విశ్వనాథ్, చిరంజీవి, తెలుగు సినీ రచయితల సంఘం సభ్యులు పరుచూరి బ్రదర్స్, జొన్న విత్తుల, ఆకెళ్ళ, దర్శకుడు వీరశంకర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పాత్రోతో తమకున్న అనుబంధం గురించి మరికొందరు సినీ ప్రముఖుల జ్ఞాపకాలు... మాది చక్కటి టీమ్! ‘‘నేను స్కూల్లో చదివే రోజుల్లోనే గణేశ్ పాత్రోగారి ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’ నాటకాలు చూశా. పాత్రో రచయితగా, ఆయన మామగారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు నాటక ప్రయోక్తగా అప్పటి నుంచే బాగా తెలుసు. నేను, ఆయన కలసి పనిచేసిన తొలిసినిమా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ‘ముక్కుపుడక’. అక్కడ నుంచి మా ఇద్దరి కాంబినేషన్లో ‘మంగమ్మ గారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మా బాలాజీ’ - ఇలా మొత్తం 26 సినిమాలు వచ్చాయి. నేను, నిర్మాత ‘భార్గవ్ ఆర్ట్స్’ గోపాలరెడ్డి, పాత్రో - ముగ్గురం ఒక చక్కటి టీవ్.పాత్రో మంచి రచయితే కాక, మంచి విమర్శకుడు, విశ్లేషకుడు కూడా! అందుకనే, నేను ఇతరులతో చేస్తున్న బయట సినిమాల కథా చర్చలకు కూడా ఆయనను పిలిచేవాణ్ణి. ఆ కథలు చెప్పి, సలహాలు, సూచనలు తీసుకొనేవాణ్ణి. మా సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే మరోపక్క ఆయన దర్శకులు కె. బాలచందర్ గారి చిత్రాలకూ, నట - నిర్మాత మురళీమోహన్ గారి చిత్రాలకూ, దర్శక - నిర్మాత క్రాంతికుమార్ గారి సినిమాలకూ రెగ్యులర్ రైటర్. పాత్రో గారి ద్వారానే నాకు బాలచందర్ గారితో పరిచయమైంది. ఆయనతో నా కథలు చర్చించే వీలు చిక్కింది. రచయితగా పాత్రోలోని గొప్పతనం ఏమిటంటే - ఆయన సెంటిమెంట్, ఎమోషన్ ఎంత బాగా రాస్తారో, అదే సమయంలో కామెడీ కూడా అంతే బాగా రాసేవారు. అలాగే, ఆయన మంచి పాటల రచయిత కూడా! నా దర్శకత్వంలో మురళీమోహన్ గారి ‘పెళ్ళాం చెబితే వినాలి’లో ఒక మంచి పాట రాశారు. ఇక, ఆ తరువాత ‘నిర్ణయం’లో రాసిన పాట బాగా పాపులర్. ఆయన కెరీర్లో మొత్తం పది పదిహేను పైగా పాటల దాకా రాశారు. సన్నివేశంలో ఏదో ఒక ఎమోషన్, టచ్ ఉండాలని రచయితగా ఆయన, దర్శకుడిగా నేను ఆలోచించేవాళ్ళం. ఎప్పటికప్పుడు మనల్ని మనం కాలానికి తగ్గట్లు మార్చుకోవాలని ఆయన అనేవారు. తన రచనను కూడా అలాగే మార్చుకొనేవారు. అందుకే, బాలచందర్ సైతం ‘‘పాత్రో ఎప్పుడూ విద్యార్థి లాగా ఉంటారు. ఎప్పటికప్పుడు జనం నుంచి నేర్చుకోవాలని అనుకుంటారు. అది ఆయనలోని విశేషం’’ అని ఆయనను మెచ్చుకుంటూ, నాతో అభిమానంగా చెప్పారు. కథ సిద్ధమయ్యాక, దర్శకుడి ఆలోచనల్లో దాని ట్రీట్మెంట్తో సహా మొత్తం చెప్పించుకొనేవారు. ఆ వెంటనే నాలుగు రోజుల్లో మొత్తం స్క్రిప్టు ఫస్ట్ వెర్షన్ రాసి ఇచ్చేసేవారు. రచయితగా ఆయనలోని మరో గొప్పదనం ఏమిటంటే, దర్శకుడు గనక ‘గురూజీ! ఎందుకో తృప్తిగా లేదు’ అని అంటే, మారుమాట్లాడకుండా, మరో నాలుగు రోజులు టైమ్ తీసుకొని మార్చి, మరో వెర్షన్ రాసి ఇచ్చేవారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొత్త వెర్షన్స్ రాసి ఇచ్చేవారు. మా కాంబినేషన్లోని తొలి చిత్రం ‘ముక్కుపుడక’ కోసం ఆయన ఏకంగా నాలుగు వెర్షన్లు రాసి ఇచ్చారు. అలాగే, ఒక్కో సీన్ ఒక్కోసారి కాకుండా ఏకబిగిన స్క్రిప్టు మొత్తం రాస్తే, ఆ బిగి వస్తుందని ఆయన నమ్మేవారు. అలాగే, చకచకా రాసి ఇచ్చేవారు. డిస్కషన్సలో మేము దెబ్బలాడుకున్న రోజులూ ఉన్నాయి. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా అంతా పూర్తయ్యాక, విడుదలకు వారం ముందు క్లైమాక్స్‌పై ఆయనకు ఏదో అనుమానం వచ్చింది. కానీ, చివరకు నా జడ్జిమెంటే కరెక్టని అభినందించారు. అలాగే, ‘మంగమ్మ గారి మనవడు’లోని కొన్ని డైలాగుల్ని భానుమతి గారు చెప్పనంటే, ఆమెను సమాధానపరిచి, ఆమెతో ఆ డైలాగులు చెప్పించాం మేమిద్దరం. పాత్రో గారి ఇంట్లో రాత్రి తెల్లవార్లూ కూర్చొని కథలు చర్చించుకొంటూ, అక్కడే నిద్రపోయిన రోజులూ ఉన్నాయి. నేను తీసిన చిత్రాలు కాకపోయినా, ‘మనిషికో చరిత్ర’కూ, బాలచందర్ గారి ‘మరో చరిత్ర’కూ, ‘దాహం దాహం’ (తమిళ ‘తన్నీర్ తన్నీర్’కు అనువాదం)కూ ఆయన అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఆయన డైలాగ్స్‌లో అనేకం కొటేషన్లుగా వాడడానికి తగ్గట్లుండేవి. అక్కినేని గారు సైతం ఆ మాట నాతో అన్నారు. అయితే, తన విలువల్ని నమ్మి తన దగ్గరకొచ్చిన దర్శక, నిర్మాతలకు పాత్రో రాసేవారే తప్ప, తానుగా అవకాశాల కోసం వెంటపడేవారు కాదు. ఆ మధ్య కూడా మా గురువు గారు దాసరి పిలిపించి, ఆయనతో స్క్రిప్ట్ డిస్కషన్ చేశారు. ఏడాది క్రితం ఆయన హైదరాబాద్ వచ్చి నాకు ఒక స్క్రిప్టు నాలుగు వెర్షన్లు రాసిచ్చారు. అందుకే, పాత్రో నాకు నచ్చిన రచయితే కాదు... ఒక దర్శకుడికి కావాల్సిన రచయిత.’’ - కోడి రామకృష్ణ, దర్శకుడు - పాత్రోకు సన్నిహితుడు తెరపై అద్భుతమైన నా పాత్రలన్నీ అతని రచనలే! ‘‘నాకూ, పాత్రోకూ ఉన్న స్నేహానికి చాలా వయసుంది. నన్ను ‘గురువా’ అనేవాడు. ప్రేమ పెరిగినప్పుడు ‘ఒరే‘ అనేవాడు. అలా నన్ను పిలిచే అతి కొద్దిమందిలో అతను ఒకడు. ఆప్యాయత పెల్లుబికినప్పుడు ‘మారుతీ’ అనేవాడు. నిజానికి, పాత్రో నా శిష్యుడు. నా రచనా శైలికి వీరాభిమాని. ఆ మాట అతనే సభాముఖంగా చాలాసార్లు చెప్పాడు. తొలి రోజుల్లో నాతో పరిచయం పెంచుకోవడం కోసం మా తమ్ముణ్ణి పట్టుకొనేవాడు. నేను ఎప్పుడు పని మీద విశాఖపట్నం వచ్చినా, మళ్ళీ నేను తిరుగు ప్రయాణమయ్యే దాకా నా వెంటే ఉండేవాడు. రచన ఎలా చేయాలి, వ్యాసం ఎలా రాయాలి, నాటకం ఎలా రాయాలి లాంటివి నేను మాట్లాడుతుంటే చెవులొగ్గి వినేవాడు. ఆ తరువాత అతనూ నాటక రచయితగా చాలా పేరు తెచ్చుకున్నాడు. సినీ రంగానికి వచ్చి పైకి ఎదిగాడు. రచయితగా అతను అద్భుతమైన తెలుగు పలుకుబడి ఉన్నవాడు. ఒడుపు ఉన్నవాడు. నటజీవితంలో నేను పోషించిన అద్భుత పాత్రలన్నీ అతని రచనలే! ‘సంసారం ఒక చదరంగం’, ‘మనిషికో చరిత్ర’, ‘ఇద్దరూ ఇద్దరే’ - ఇలా నాకు పేరు తెచ్చిన అనేక చిత్రాలు, పాత్రలూ పాత్రో కలం నుంచి వచ్చినవే. అలవాట్లు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయనిపిస్తుంది. మందలించే వయసూ వాడిది కాదు... మందలించాల్సిన పాత్రా నాది కాదు. అయినా సరే, జర్దా కిళ్ళీ మానుకోమని కొన్నేళ్ళ క్రితం హెచ్చరించాను. అప్పటికే ఆలస్యమైనట్లుంది. గతంలో ఒకసారి అతని పెద్ద పేగుకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ సరిగ్గా జరగక అవస్థ పడ్డాడు. జర్దా కిళ్ళీ అలవాటు వల్ల ఈ మధ్యే నాలుకకు ఆపరేట్ చేశారట! క్యాన్సర్ మరో మంచి రచయితనూ, స్నేహితుణ్ణీ తినేసింది. ఇరవై రోజుల క్రితమే నాకో మెసెజ్ పెట్టాడు. అప్పుడు రిప్లై ఇచ్చా. మళ్ళీ మొన్న 2వ తేదీన ‘ఆర్ యు ఇంప్రూవింగ్’ అని మెసేజ్ ఇచ్చా. జవాబివ్వకుండానే వెళ్ళిపోయాడు. నాటక, సినీ రంగాలకే కాదు... నాకూ తీరని దుఃఖం మిగిల్చాడు.’’ - గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ నాటక - సినీ రచయిత ఆయన ప్రేరణతోనే ‘కుక్క’ రాశా! ‘‘నాకూ, గణేశ్ పాత్రోకూ వ్యక్తిగత పరిచయం తక్కువే కానీ, అతని నాటకాలతో, సినీ రచనలతో పరిచయం ఎక్కువే. పాత్రో నాటకాలు రాసే రోజుల్లో అతని నాటకాలతో పోటీపడడం అప్పట్లో నాటకాలు రాస్తున్న మాకో సవాలుగా ఉండేది. కానీ, ఎప్పుడూ అతనే నెగ్గేవాడు. దానికి కారణం - అతని మామ గారైన ప్రసిద్ధ రంగస్థల ప్రయోక్త కె. వెంకటేశ్వరరావు గారు అని మేము సమాధానపడేవాళ్ళం. కానీ, నిజానికి నాటకీయత, సహజత్వం (రియలిజమ్) - ఈ రెంటినీ సమర్థంగా రాయడంలో పాత్రో అంతటివాడు లేడనేది నిర్వివాదాంశం. ఆయన విశాఖ మాండలికంలో ఆయన ‘కొడుకు పుట్టాల’ నాటకం రాస్తే, ఆ ప్రేరణతోనే నేను తెలంగాణ మాండలికంలో ‘కుక్క’ నాటకం రాశాను. ఒక మంచి నాటక రచయితను మనం పోగొట్టుకున్నాం.’’ - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ నాటక - సినీ రచయిత ఆ పాటతో గుర్తుండిపోయారు! ‘‘సినీ రంగానికి రాక ముందు నుంచి పాత్రో గారి రచనలతో నాకు పరిచయం. మద్రాసుకు వచ్చాక మంచి స్నేహితుడయ్యారు. అప్పట్లో ‘భార్గవ్ ఆర్ట్స’ గోపాలరెడ్డి గారు తీసిన చిత్రాలకు సి. నారాయణరెడ్డి గారి తరువాత ఆస్థాన గీతరచయితను నేనైతే, పర్మినెంట్ డైలాగ్ రైటర్ గణేశ్ పాత్రో. నిర్మాత గోపాలరెడ్డి గారికి మా మీద ఎంత గురి అంటే - ప్రముఖ దర్శకుడు విసుతో సినిమా తీయడానికి ఆయన సిద్ధమయ్యారు. అన్నీ మాట్లాడుకున్నారు. సరే అనుకున్నారు. కాకపోతే, డైలాగ్ రైటర్‌గా పాత్రో, పాటల రచయితగా వెన్నెలకంటి ఉండాలనీ, మిగతావాళ్ళను ఇష్టమైనవాళ్ళను పెట్టుకోమనీ గోపాలరెడ్డి చెప్పారు. కానీ, విసు తన వాళ్ళనే పెట్టుకుంటానన్నారు. దాంతో, పాత్రో గారినీ, నన్నూ వదులుకొనేది లేదని చివరకు ఆ సినిమానే చేయడం మానుకున్నారు గోపాలరెడ్డి. పాత్రో రచన మీద గోపాలరెడ్డి గారికి అంత గురి. మధ్యతరగతి జీవితంలోని సంఘటనల్నీ, పాత్రల్నీ అంత అద్భుతంగా మాటల్లో పొదిగిన రచయితలు చాలా తక్కువ. పాత్రో గారు స్వతహాగా మాటల రచయితైనా, ‘నిర్ణయం’ చిత్రంలో నాగార్జున, అమలను టీజ్ చేస్తూ పాడే ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం...’ పాట ఆయనను పాపులర్ గీత రచయితను చేసింది. బాలచందర్, నటి రాధిక తీసిన అనేక సీరియల్స్‌కూ పాత్రో రచన చేశారు. ఎంతో అనుబంధమున్న బాలచందర్, పాత్రోలిద్దరూ కొద్ది రోజుల తేడాలో వెళ్ళిపోవడం దురదృష్టం.’’ - వెన్నెలకంటి, సినీ రచయిత ఆ మర్మం తెలిసిన రచయిత ‘‘పాత్రో గారూ, నేనూ ఎప్పుడు కలిసినా సాహిత్యం, రష్యన్ నవలల గురించే మాట్లాడుకొనేవాళ్ళం. 1950ల తర్వాతి రైటర్స్‌ను గమనిస్తే, పింగళి, ఆత్రేయ, ముళ్ళపూడి లాంటి వారు ఒక్కొక్కరూ ఒక్కో శైలితో అలరించారు. పాత్రోది వాళ్ళందరి కన్నా విభిన్నశైలి. అప్పటి ‘మరో చరిత్ర’ మొదలు ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘రుద్రవీణ’ లాంటి సినిమాల దాకా అనేక చిత్రాలు అందుకు నిదర్శనం. ఆయన రచన ఎక్కడా రొటీన్‌గా ఉండదు. మాటను ఎంత వరకు, ఎలా ఉపయోగించాలో తెలిసిన పర్ఫెక్ట్ రైటర్ ఆయన. నాటక రచన నుంచి వచ్చిన అనుభవం అది. అలాగే, పాత్రను పోషించే నటుణ్ణి బట్టి, అతని డైలాగ్ డిక్షన్‌ను బట్టి ‘టైలర్ మేడ్ డైలాగ్’లు రాసే మర్మం పాత్రోకు బాగా తెలుసు. దృశ్యమాధ్యమమైన సినిమాల్లో అభాసు పాలుకాకుండానే విప్పీ విప్పకుండా, చెప్పీ చెప్పకుండానే శృంగారాన్ని డైలాగుల్లో చెప్పడమనే ఒరవడిని ఆయన తెచ్చారు. రచయితతో పాటు చక్కటి విమర్శకుడు కూడా ఆయనలో ఉండేవాడు. ఒక సినిమా చూశాక అందులోని మంచి, చెడుల్ని విశ్లేషణాత్మకంగా చెప్పేవారు. మద్రాసులో తెలుగు సినీ రచయితల సంఘం ఏర్పడినప్పుడు ఎం.ఎం. థియేటర్లో సంఘానికి సంబంధించిన బై లాస్, వగైరా తయారుచేసే బరువు బాధ్యతలు తలకెత్తుకొని, ఆ పని చేసి పెట్టారు. ప్రత్యేక వ్యక్తిత్వమున్న రచయితగా నిలబడడమే కాక, రాసిన డైలాగ్స్‌కు కూడా గొప్ప వ్యక్తిత్వమిచ్చిన ఆయనకు రావాల్సినంత పేరు, గౌరవం దక్కలేదనిపిస్తుంటుంది.’’ - భువనచంద్ర, సినీ గీత రచయిత