breaking news
Television channel
-
తెలంగాణలో చానళ్లపై నిషేధం న్యాయమే కానీ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై నిషేధం విషయంలో ఎంఎస్ఓల ప్రతి స్పందన న్యాయంగానే ఉన్నా.. దాని ప్రయోజనం పాలకుడి నియంతృత్వానికి దారి తీయొద్దని, ఉపయోగపడొద్దని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మీడియాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన నియంతృత్వ వ్యాఖ్యలు, నిషేధ ఫత్వాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛ అంటే పాలకులు, మీడియా యాజమాన్యల స్వేచ్ఛ కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న వైఖరి, మీడియా స్వేచ్ఛపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ బుధవారం సుదీర్ఘ లేఖను మీడియా సంస్థలకు విడుదల చేశారు. మీడియాపై నిషేధం తగదని పేర్కొంటూనే.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీవీ-9 యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. కేవలం పచ్చళ్ల వ్యాపారం చేసే రామోజీరావు పత్రికా స్వేచ్ఛ ముసుగులో 10 వేల ఎకరాల ఫిల్మ్ సిటీ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జగమెరిగిన సత్యమన్నారు. -
‘పది’లో పాఠ్యాంశంగా మాయాబజార్
ఘట్కేసర్ టౌన్: సాధారణంగా సినిమాలంటే పిల్లలకు మహా సరదా. అలాంటి సినిమాలనే పాఠ్యాంశాలుగా రూపొందిస్తే.. ఈ ఆలోచన బాగుంది కదూ.. ఆలోచనే కాదు.. ఈ ఏడాది పదో తరగతి కొత్త సిలబస్‌లో దీన్ని అమలు చేశారు కూడా. ఇష్టమైన రీతిలో బోధిస్తే కష్టంగా ఉన్నా ఇష్టంగా చదువుతారన్న సత్యాన్ని నమ్మిన సర్కార్ పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగే విధంగా నూతన సిలబస్‌ను అందించింది. తెలుగువారు గర్వించదగ్గ మేటి చిత్రం మాయాబజార్‌ను, మహానటి సావిత్రి జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చింది. ఇక తెలుగు ఉపవాచకంలో రామాయణం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అపురూప దృశ్యకావ్యం 1957లో నిర్మించిన మాయాబజార్ చలన చిత్ర గొప్పదనాన్ని ఇంగ్లిషు పాఠ్యాంశాల్లో వివరించారు. వందేళ్ల సినీ చరిత్రలో మాయాబజార్ కంటే ఉత్తమమైన చిత్రం లేదని ఓ టెలివిజన్ చానల్ నిర్వహించే సర్వేలో వెల్లడైంది. విశ్వవాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు చిత్రం కావడం విశేషం. అప్పుడున్న అతి తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిత్రాన్ని ఎంత కళాత్మకంగా రూపొందించారో ఈ పాఠంలో పేర్కొన్నారు. కెమెరా టెక్నిక్స్, ఛాయగ్రహణం, కళ, దర్శకత్వం ఇప్పటికీ అం తుచిక్కకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని భావితరాలకు అందించేందుకు బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న చిత్రాన్ని ఎంతో శ్రమించి కలర్లోకి మార్చారు. ఈ అపురూప దృశ్య కావ్యాన్ని విద్యార్థులకు తెలియపర్చేలా పాఠంలో చేర్చారు. సావిత్రి జీవిత విశేషాలు తెలుగు చిత్రసీమలో మహానటిగా వెలుగొందిన సావిత్రి జీవిత చరిత్రను సైతం ఇంగ్లిషు పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. సావిత్రి తన ఎనిమిదో ఏటనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది. కొత్తలో నటనకు పనికిరాదన్న ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. పట్టుదలతో అవకాశాలు దక్కిం చుకుని 300 చిత్రాల్లో ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించింది. నటనలో గొప్ప కీర్తిని సంపాదించుకుంది. రాష్ట్రపతి అవార్డు సైతం అందుకుంది. ఈ విశేషాలన్నీ పాఠ్యాంశంలో పొందుపర్చారు. ఆకట్టుకునేలా ముద్రణ.. కొత్త పాఠ్యపుస్తకాలను మల్టీకలర్ బొమ్మలతో ఆకర్షణీయంగా రూపొందించారు. తెలుగు పాఠ్య పుస్తకాన్ని తెలుగు దివ్వెలు-2 పేరుతో ముద్రించారు. ఉపవాచకంలో రామాయణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఆరు ఖండాలను ఇందులో వివరించారు. ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలో భారతీయ సినిమా విశేషాలతోపాటు వ్యక్తిత్వ వికాసం పెంపు, హాస్య చతురత, మానవ సంబంధాలు, ఫిలిం అండ్ ఆర్ట్ థియేటర్, బయోడైవర్సిటీ తదితర అంశాల్లో స్ఫూర్తినిచ్చే కథాంశాలతోపాటు పర్యావరణంపై చర్చించారు. జీవశాస్త్రంలో.. జీవశాస్త్రంలో పాఠ్యాంశాలన్నీ చదవడం, చెప్పించడంతోపాటు ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు తదితర అంశాలతోపాటు బోధన, అభ్యసన ప్రక్రియ మరింత మెరుగపడేలా రూపొం దించారు. శిశు వికాస దశలు, మానవ శరీర నిర్మాణం, గుండె నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించే విధంగా పాఠాలు పొందుపర్చారు. సాంఘికశాస్త్రంలో.. సాంఘికశాస్త్రం నాలుగు భాగాలు భూగోళం, చరిత్ర, పౌర, ఆర్థికశాస్త్రంగా ఉండేది. కొత్త సిలబస్‌లో వీటిని ఒక భాగంగా మార్చారు. వనరులు అభివృద్ధి-సమానత ఒక భాగంగా, స మకాలీన ప్రపంచం-భారతదేశం రెండో భాగంగా ఏర్పాటు చేశారు. బజారు, పంచాయతీ, పల్లెసీమల్లోని పొలాలు, వస్తు ప్రదర్శనలు తదితర అంశాలను తెలుసుకునేలా ఈ పుస్తకం ఉంది. విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించడమే కాకుండా వారి మేథోశక్తిని పెంపొందించేందుకు ఈ పుస్తకాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. -
నిప్పంటించుకుని.. కౌగిలించుకున్నాడు..
సోమవారం రాత్రి యూపీలోని సుల్తాన్పూర్ లో లోక్‌సభ ఎన్నికలపై దూరదర్శన్ చానెల్ నిర్వహించిన చర్చ సందర్భంగా ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న దృశ్యమిది. చర్చలో వివిధ పార్టీల నేతలు పాల్గొనగా.. నిప్పంటించుకున్న యువకుడు వారిమధ్యకు పరుగెత్తి బీఎస్పీ నేత కమ్రుజ్జమా ఫౌజీని కౌగిలించుకున్నాడు. దీంతో యువకుడికి 95% ఫౌజీకి 75% కాలిన గాయాలయ్యాయి. వారిద్దరూ లక్నోలోని ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని మంగళవారం పోలీసులు వెల్లడించారు. సంఘటన వెనక కారణాలు తెలియరాలేదు.