breaking news
telerobotic method
-
16 నెలల బాబుకు.. 1600 కి.మీ. దూరం నుంచి శస్త్రచికిత్స!
హైదరాబాద్: రోబోటిక్ సర్జరీల గురించి మనకు తెలుసు, టెలి సర్జరీల గురించి కూడా విన్నాం. కానీ ఈ రెండింటినీ కలిపి చేసి, ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న రోగులకు ఊరట కలిగించిన ఘటనలు తాజాగా జరిగాయి. పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసిన ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగించి ఈ టెలి రోబోటిక్ సర్జరీలు చేయడం విశేషం. నగరానికి చెందిన ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ వి. చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.‘‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత జన్యుసమస్య ఉన్న 16 నెలల బాలుడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. మూత్రపిండాలలో గరాటు ఆకారంలో ఉండే రీనల్ పెల్విస్ అనే భాగం మూత్ర నాళాలను, మూత్రపిండాలను కలుపుతుంది. సరిగ్గా అక్కడ ఆ బాబుకు ఒక అడ్డంకి ఏర్పడింది. దాన్ని యూరేటరోపెల్విక్ అబ్స్ట్రక్షన్ అంటారు. దానివల్ల మూత్రపిండం నుంచి మూత్రకోశంలోకి మూత్రం వెళ్లడం లేదు. దాంతో ఆ బాబుకు శస్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకిని తొలగించాల్సి వచ్చింది. అయితే బాబు వయసు కేవలం 16 నెలలే కావడంతో రోబోటిక్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.బాబును కొండాపూర్‌లోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్‌కు తీసుకురాగా.. డాక్టర్ చంద్రమోహన్ గుర్‌గ్రామ్‌లోని ఎస్ఎస్ఐ మంత్ర కార్యాలయంలో ఉన్న కన్సోల్ వద్ద కూర్చుని ఈ శస్త్రచికిత్స చేశారు. రెండు నగరాల మధ్య 1600 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్నా, అక్కడి నుంచి ఇక్కడి రోబోతో శస్త్రచికిత్స చేశాం. ఇందుకు గంట సమయం పట్టింది. ఇదంతా 5జి టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీ వల్ల సాధ్యమైంది. గతంలో చైనాలో 8 ఏళ్ల వయసున్న వారికే ఇలా టెలిసర్జరీ చేశారు. దీంతో దేశంలో, ప్రపంచంలో అతి చిన్న వయసున్న 16 నెలల బాబుకు విజయవంతంగా టెలిసర్జరీ చేసి, మర్నాడే డిశ్చార్జి కూడా చేసినట్లయింది.మరో కేసులో.. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నగరంలో ఒక మహిళకు హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేసిన తర్వాత మూత్రం లీకేజి కావడం మొదలైంది. దాంతో ఆమెకు అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా నయం చేయాలని భావించారు. అయితే, అక్కడున్న వైద్యులకు ఓపెన్ శస్త్రచికిత్స అలవాటు ఉంది గానీ రోబోటిక్ శస్త్రచికిత్స చేయలేరు. దాంతో ఇక్కడ మమ్మల్ని సంప్రదించగా, 5జి ఇంటర్నెట్ ప్లాట్‌ఫాం, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టమ్, టెలిసర్జరీ సాయంతో ఆమెకు ఇక్కడినుంచే శస్త్రచికిత్స చేశాం. గంటా 20 నిమిషాల్లో ఇది పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన తొలి శస్త్రచికిత్స ఇదే అవుతుంది.ఈ శస్త్రచికిత్సలకు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రూప, సీఈఓ డాక్టర్ రంగప్ప, సీనియర్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ, సీనియర్ యూరాలజిస్టులు డాక్టర్ హేమంత్, డాక్టర్ సౌందర్య, పీడియాట్రిక్ ఎనస్థటిస్ట్ డాక్టర్ దేవేందర్, పీడియాట్రీషియన్ డాక్టర్ వంశీ, సమన్వయకర్తలు రాజేందర్, గణేశ్, అనిల్, సీనియర్ టెక్నీషియన్ శ్రీధర్, రోబోటిక్ ఇంజినీర్లు దుర్గేష్, ఇషాన్ ప్రశాంత్, ఎస్ఎస్ఐ మంత్ర డైరెక్టర్ విశ్వ, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్స్ సీఈఓ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ తదితరుల సహకారం ఎంతగానో ఉపకరించింది. ఈ భారతీయ బృందం అంతా కలిసి శస్త్రచికిత్సలు చేయడానికి దూరం అనేది అడ్డం కాదని నిరూపించారు.భారతదేశం చాలా సువిశాలమైన దేశం. అన్నిచోట్లా ఇంత నిపుణులైన వైద్యులు ఉండడం సాధ్యం కాదు. అందువల్ల నలుగురైదుగురు వైద్యులు కలిసి ఒక సర్జికల్ రోబో కొనుక్కుంటే.. ఇక్కడినుంచి దాంతో సర్జరీ చేయగలం. ఒకే కన్సోల్‌తో ఒకే సమయంలో పది రోబోలకు కనెక్ట్ చేయొచ్చు. ఈ విధానం అక్కడి వైద్యులకు శస్త్రచికిత్స విధానాలు నేర్పడానికి ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ చంద్రమోహన్ వివరించారు. -
అంతరిక్షం నుంచి షేక్‌హ్యాండ్!
వాషింగ్టన్: మీ స్నేహితుడికో, పరిచయస్తుడికో షేక్‌హ్యాండ్ ఇస్తున్నారు.. ఎంత దూరంలో నిలుచుని ఉంటారు. మహా అయితే ఒకటి రెండు అడుగులు కదా. కానీ ఎక్కడో అంతరిక్షంలో 8,046 కిలోమీటర్లపై నుంచి భూమిపై ఉండేవారికి షేక్‌హ్యాండ్ ఇచ్చేస్తే..!? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న నాసా వ్యోమగామి టెర్రీ వర్ట్స్ నెదర్లాండ్స్‌లో ఉన్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) శాస్త్రవేత్త ఆండ్రె స్కీలీతో ఇలా చేయి కలిపాడు. కాకపోతే ఈ షేక్‌హ్యాండ్ ఇచ్చింది టెలీరోబోటిక్ పద్ధతిలో! ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన జంట రోబో చేతులను వినియోగించారు. ఇందులో ఒకటి ఐఎస్ఎస్లో ఉండగా.. రెండోది ఈఎస్ఏ పరిశోధనశాలలో ఉంది. ఈ రెండూ పూర్తిగా అనుసంధానమై ఉంటాయి. ఒకదానితో మనం చేయికలిపితే ఏర్పడే ఒత్తిడి, కదలికలను గుర్తించి.. రెండో రోబో చేయికి షేక్‌హ్యాండ్ ఇచ్చేవారికి అదే స్థాయిలో ఒత్తిడి, కదలికలను కదిలిస్తుంది. దీంతో ఆ వ్యక్తే నేరుగా షేక్‌హ్యాండ్ ఇచ్చిన భావన కలుగుతుంది. అన్నట్లు ఇలా అంతరిక్షం నుంచి భూమిపై వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం.