breaking news
telangana sarpanches association
-
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్‌బాల్ ఆడుతుంటే కాళ్లతో తంతారు. అలా తంతారని, కాళ్లు తగులుతాయని ఫుట్‌బాల్ ఆడకుండా ఉంటామా? అలా కాలితో తన్నడమే ఫుట్‌బాల్ గేమ్ రూల్. అలాగే రాజకీయాల్లో కూడా కాళ్లలో కట్టెలు పెడుతుంటారు. అదే రాజకీయాల గేమ్‌రూల్. ఆ కట్టెలను తీసి పక్కన పెట్టి ముందుకెళుతుండాలి. నా కాళ్లలో కట్టెలు పెట్టారు. నేను బోర్లా పడిపోతాను. ఎవరో ఒకరు వచ్చి నన్ను లేపాలి అంటే కుదరదు. రాజకీయాల్లో మనమే లేవాలి.’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, రాహుల్‌గాంధీ లాంటి వారిని ఇబ్బంది పెట్టాలని జీ–23 పేరుతో లేఖలు వస్తుంటాయని చెప్పారు. అలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టే పార్టీ 140 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉందని, లేదంటే జనతా పార్టీలాగానో, ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనో కనుమరుగయ్యేదని అన్నారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవికి సమయస్ఫూర్తి ముఖ్యం ‘కాంగ్రెస్ పార్టీలో సీఎం, మంత్రులు కావడం కంటే పార్టీ అధ్యక్షుడు కావడమే కష్టం. డీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీ కుటుంబానికి పెద్దలా వ్యవహరించాలి. ఈ పదవికి వయసు ముఖ్యం కాదు. అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే సమయస్ఫూర్తి ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పనికాదు. డీసీసీ అధ్యక్షుల విషయంలోనూ అంతే. మన సమాజంలో దాదాపు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. దేవుళ్లు ఎంత మంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలుంటాయి. దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదు. డీసీసీ అధ్యక్షుల విషయంలో ఎలా సాధ్యమవుతుంది? మీరు డీసీసీ అధ్యక్షులు అవడం కొందరికి ఇబ్బంది కావచ్చు. మీరే వెళ్లి వారితో మాట్లాడండి. సీనియర్ల దగ్గరికెళ్లి కలిసి పనిచేద్దామని అడగండి. పదవి రాకముందు అనేక సమస్యలుంటాయి. పదవి వచి్చన తర్వాత అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి. పనిచేసే క్రమంలో వచ్చే సమస్యలను పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.ఆరు నెలలే మీకు సమయం ‘కొత్తగా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన వారికి ఆరునెలలు మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో అందరూ కష్టపడి పనిచేయాల్సిందే. ప్రతి నెలా రిపోర్టు తెప్పించుకుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్‌గాం«దీని ప్రధానిని చేసే దిశలో ఎవరు పనిచేయకపోయినా అధ్యక్ష పదవి ఉండదు..’ అని రేవంత్ అన్నారు. అభివృద్ధిపై చర్చ పెట్టండి ‘రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, చేసింది చెప్పుకోగలగడం కూడా అంతే ముఖ్యం. అందరి కృషితో రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశలో నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ చేరవేయండి. అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదికపై చర్చ పెట్టండి. పెళ్లి, చావు, దావత్, కల్లు కాంపౌండ్లు.. ఇలా ఎక్కడైనా నాటి, నేటి పాలన గురించి చర్చ పెట్టండి. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు సారె కింద కోటి చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఆడబిడ్డల దగ్గరికి చేర్చడం డీసీసీ అధ్యక్షులుగా మీ టాస్క్. ఏ ఆడబిడ్డా మాకు చీర రాలేదని చెప్పొద్దు. అలా చెపితే డీసీసీ అధ్యక్షులుగా మీరు పనిచేయనట్టే..’ అని సీఎం అన్నారు.మోదీ, అమిత్‌షాకు భయపడేవారెవరూ లేరు.. ‘నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ భయపడబోదు. మోదీ, అమిత్‌షాలకు భయపడేవారు ఇక్కడెవరూ లేరు. తమ ప్రాణాలనే కాదు ఆస్తులను కూడా త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కష్టపెడితే దేశ ప్రజలను కష్టపెట్టినట్టే. ఓట్ చోరీ అంశం దృష్టి మరల్చేందుకే ఈ కేసులు పెడుతున్నారు. ఇలాంటి చర్యలను దేశం సహించదు. గాంధీ కుటుంబానికి మనం అండగా నిలబడదాం. ఎందాకైనా పోరాడదాం. రావాల్సినవి ఇవ్వకపోతే కేంద్రాన్ని నేలమట్టం చేస్తాం మోదీ గుజరాత్‌కు ప్రధానిలా కాదు..దేశానికి ప్రధానిలా వ్యవహరించాలి. బుల్లెట్ ట్రైన్ ఆయన రాష్ట్రానికి తీసుకెళ్లినట్టే మన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఒకటికి పదిసార్లు అడుగుతాం. ఇస్తే సరి..ఇవ్వకపోతే నేల మట్టం చేస్తాం. తెలంగాణ ప్రజల వ్యవహారం ఎలా ఉంటుందో బీజేపీ రుచి చూస్తుంది..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా సోనియా, రాహుల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2029లో రాహుల్‌ను ప్రధానిని చేయాలి మీనాక్షి మాట్లాడుతూ.. గుజరాత్ డీసీసీ అధ్యక్షుల పనితీరును ప్రతి వారం సమీక్షిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇది మనకు పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితేనే 2028లో జరిగే పరీక్షలో గెలుస్తాం. ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేసుకోగలం. అలా చేసుకోలేకపోతే మీరు నేను ఉండి ప్రయోజనం లేదు.’ అని వ్యాఖ్యానించారు. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసుకుంటూ వెళుతుంటే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గుర్తిస్తారని చెప్పారు. ఈ రోజు పనిచేసి రేపే ఫలితం రావాలంటే కుదరదని అన్నారు. డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, డీసీసీల కొత్త, పాత అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు పాల్గొన్నారు. కొందర్ని గదిలో వేసి కొట్టాలనిపించేది – సీఎం రేవంత్‌రెడ్డి నాకు ముఖ్యమంత్రి కాక ముందు చాలామంది మీద కోపంగా ఉండేది. కొంతమందిని గదిలో వేసి కట్టె తీసుకుని అలసి పోయేంతవరకు కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టా. మన శక్తినెందుకు వేస్ట్ చేసుకోవాలనుకున్నా. అందుకే ప్రజలకు సేవ చేసే పని మీద ఉన్నా. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు హజరే శ్రీనివాస్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సర్పంచ్‌లకే కాకుండా పూర్వ సర్పంచ్‌లకు కూడా ఈ ఓటు హక్కు వర్తిం చేలా చూడాలన్నారు. రాజ్యాంగంలోని 73వ అధికరణ ప్రకారం పంచాయతీ నిధులు, విధులు గ్రామ సర్పంచ్‌లకే ఇవ్వాలన్నారు. మైనర్ గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా, మోటారు కరెంట్ బిల్లు, వీధిలైట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎస్ఎఫ్సీ బిల్లులు నేరుగా గ్రామ పంచాయతీలకే చెందేలా చూడాలన్నారు. గ్రామ సర్పంచ్‌లకు రూ.2500 వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్.నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శంకర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బొడ్డు నిర్మల, సంతోష, బాబు తదితరులు పాల్గొన్నారు.


