breaking news
telangana developement forum
-
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. క్వాటామా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని విజయవంతం చేసారు.తెలుగుదనం ఉట్టి పడేలా.. మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటానికి కృషి చేసిన స్పానర్స్, పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వాలంటీర్స్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. TDFసంస్థ స్థాపించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, శుభాకాంక్షలు తెలిపారు. -
లక్ష్య సాధనకు దిక్సూచి అయ్యి...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ‘మేము సైతం’ అంటూ ప్రవాస తెలంగాణవారు ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్’ (టీడీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ప్రొ. జయశంకర్ సార్ స్ఫూర్తితో మలి ఉద్యమంలో మొలచి, వృక్షంలా ఎదిగింది ఈ సంస్థ. పట్టుమని పది మందితో అమెరికా కేంద్రంగా న్యూయార్క్ నగరంలో 1999లో ఏర్పాటైన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ఆ తర్వాత శాఖోపశాఖలుగా వివిధ దేశాల్లో విస్తరించింది. పొట్టకూటి కోసం గల్ఫ్ బాట పట్టిన కార్మికుడు మొదలు, ఆస్ట్రేలియా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువకుడు కూడా ‘జై తెలంగాణ’ అని నినదించేలా చేసింది ఈ సంస్థ. నిధులు, నీళ్లు, నియామకాల్లో అప్పట్లో జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వివరించటంలో విజయవంతం అయింది టీడీఎఫ్.సామాజిక ప్రచార సాధనాల పరిధి ఇంతగా లేని రోజుల్లోనే తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ వినూత్న పంథాలో విస్తరించింది. ఉద్యమం దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరినీ చైతన్యం చెయ్యడంలో కీలక భూమిక పోషించింది. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు, కవులు, కళాకారులను, మేధావులను కలవడం ద్వారా టీడీఎఫ్ తెలంగాణ వాణి, బాణీలను బలంగా వినిపించే ప్రయత్నం చేసింది.ఓ వైపు బతుకు దెరువు కోసం దేశ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపా రాలు చేస్తూనే, తాము కూడబెట్టిన దాంట్లో కొంత తెలంగాణ సాధన కోసం ప్రవాసులు ఖర్చు పెట్టి మరీ స్వరాష్ట్రం కోసం కృషి చేశారు. కవులు, కళాకారులను ఆహ్వానించి ఊరూరా తెలంగాణ ధూమ్ ధామ్ లను ఏర్పాటు చేశారు. వ్యయ ప్రయాసలు కోర్చి తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తనదైన పాత్ర పోషించింది ఈ సంస్థ.ముఖ్యంగా విద్యార్థులను జాగృతం చేసింది. భవిష్యత్ తెలంగాణ బలిదానాల తెలంగాణ కావొద్దంటూ నినదించింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ యువతే బాగుపడుతుందనే సందేశాన్ని బలంగా ప్రచారం చేసింది. రాజకీయ అవసరాలు, ప్రలోభాలతో ఉద్యమం పక్కదారి పట్టిన ప్పుడల్లా పట్టు విడవకుండా ఉద్యమ దివిటీని ముందుడి మోసింది. ఎక్కడెక్కడో పనిచేసే సంస్థ సభ్యులు తెలంగాణలో ప్రతీ పల్లెనూ, ప్రతీ గడపనూ తాకేలా తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించారనడం అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో జరిగిన మోసాలను, పక్కదారి పట్టిన నిధులను, నీటి కేటాయింపులో జరిగిన మోసాలను సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేసింది.రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ పాలన ఎజెండాను రూపొందించటంలోనూ సంస్థ కృషి మరవలేనిది. కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవటం, అమరుల కుటుంబాలను వీలైనంతగా ఆదుకోవటంలోనూ ఫోరం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటికీ హెల్త్ క్యాంపుల నిర్వహణ, యువతకు క్రీడా పోటీలు, డ్రగ్స్ మహమ్మారిపై పోరాటం, రైతు చైతన్య యాత్రలు వంటి పలు కార్యక్రమాల నిర్వహిస్తూ టీడీఎఫ్ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. విదేశాల్లో తాము ఉంటున్న ప్రాంతాల్లో తెలంగాణ పండగలను నిర్వహిస్తూ మలి తరాలకు కూడా సంస్కృతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తోంది.రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మారినా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాల నుంచి మరలకుండా పాలన, విధాన నిర్ణయాలు ఉండేలా టీడీఎఫ్ తన ప్రభావాన్ని చూపుతోంది. నిర్ణయాలు గాడి తప్పిన సంద ర్భాల్లో ఉద్యమ పంథానే కొనసాగిస్తూ పాలకులను, పార్టీలను ప్రశ్నించ టంతో ముందు ఉంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు దాటినా ప్రభుత్వాలు ప్రత్యేక ఎన్నారై పాలసీని ప్రకటించకపోవడం శోచనీయం. సమీప భవిష్యత్తులోనే ఎన్నారై పాలసీ రూపుదిద్దుకుంటుందనే ఆశా భావంతో టీడీఎఫ్ ఉంది. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది.– లక్ష్మణ్ ఏనుగు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ మాజీ అధ్యక్షుడు, న్యూయార్క్ -
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
పోర్ట్‌ల్యాండ్ : అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఛైర్మన్ శ్రీని అనుమాండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వేడుకలకి పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తెలంగాణ ధూమ్ ధామ్ సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు పాల్గొని ఆటా,పాటలతో ప్రేక్షకులను అలరించారు. టీడీఎఫ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి శ్రీని అనుమండ్ల వివరిస్తూ, ఈ వేడుకలు జరగడానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీఎఫ్ పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ టీం కొండల్ రెడ్డి, పుర్క రఘు స్వామి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కాంత్ కొడిదేటి, నిరంజన్ కూర, నరెందర్ చీటి, శివ ఆకుతోట, రాజ్ అందోల్, వీరేష్ బుక్కా, జయాకర్ రెడ్డి అడ్డ, సందీప్ రెడ్డి ఆశ, ప్రవీణ్, భాను పోగుల, సురేశ్ దొంతుల, ప్రవీణ్ ఎలకంటి, అజయ్ అన్నమనేని, హరినందన్ సదిరెడ్డి, వెంకట్ ఇంజం, సత్య సింహరాజులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు.