breaking news
technical defect
-
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
కొచ్చి:బెంగళూరు నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కేరళలోని కొచ్చికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అంశంపై ఇండిగో స్పందించింది. సాంకేతిక సమస్య తలెత్తిన విమానానికి అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి వినియోగంలోకి తెస్తామని ఇండిగో తెలిపింది.ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.సాంకేతిక లోపంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 91మంది భారతీయ పౌరులు కాగా 49మంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. -
‘పిస్టల్’ పని చేయలేదు!
టోక్యో: తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యువ షూటర్ మనూ భాకర్ గుండె పగిలింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కచ్చితంగా పతకం సాధించగలదని భావించిన భాకర్, ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. తాను నమ్ముకున్న ‘ఆయుధం’ ఆమెను చివరకు దెబ్బ తీసింది. క్వాలిఫయింగ్ ఈవెంట్ సందర్భంగా భాకర్ పిస్టల్ సాంకేతిక లోపంతో పని చేయలేదు. పోటీ జరుగుతున్న వేదిక నుంచి కాస్త దూరంగా వెళ్లిన భారత షూటర్... దానిని సరి చేయించుకొని వచ్చి మళ్లీ బరిలోకి దిగే సరికే అమూల్యమైన సమయం వృథా అయింది. దాంతో 19 ఏళ్ల మనూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 6 రౌండ్లలో వరుసగా 98, 95, 94, 95, 98, 95 (మొత్తం కలిపి 575 పాయింట్లు) స్కోర్ చేసిన ఆమె 12వ స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలు చేజార్చుకుంది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత షూటర్ యశస్విని సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు సాధించిన ఆమె 13వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారే ఫైనల్‌కు చేరుకుంటారు. రెండో పిస్టల్ ఉన్నా కూడా... సాధారణంగా షూటర్లు ఈవెంట్ సమయంలో ‘స్పేర్ గన్’ను ఉంచుకుంటారు. పేరుకు ఇది కూడా గ్రిప్, ట్రిగ్గర్ తదితర అంశాల్లో దాదాపుగా మొదటి పిస్టల్‌లాగే ఉన్నా... సుదీర్ఘ కాలంగా మొదటి గన్‌తోనే ప్రాక్టీస్ చేసిన అలవాటు వల్ల కొత్త గన్ను అంత సమర్థంగా ఉపయోగించడం కష్టమవుతుంది. పైగా రెండో గన్ తీసుకుంటే ఎలా పని చేస్తుందో చూసేందుకు ‘సైటర్స్’ (షూట్ చేసి పరీక్షించడం) చేయాల్సి ఉంటుంది. మొత్తం పిస్టల్ చెడిపోవడంవంటి అత్యవసర పరిస్థితి అయితే తప్ప రెండో గన్ను బయటకు తీయరు. భాకర్ ఘటనతో కొత్త గన్ను పరీక్షించడంతో పోలిస్తే మొదటి గన్ను రిపేర్ చేయడానికే తక్కువ సమయం పడుతుంది కాబట్టి దానినే ఎంచుకున్నట్లు రోనక్ పండిట్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మనూ మంచి స్కోరు సాధించగలిగింది. ఇలాంటి స్థితిలోనూ ఆమె కుప్పకూలిపోలేదు. గన్లకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కానీ అసలు లివర్ విరిగిపోవడం అనేది అనూహ్యం. మనూ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా’ అని పండిట్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మరో రెండు ఈవెంట్లు (25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్)లలో భాకర్ ఇంకా పోటీ పడాల్సి ఉంది. అసలేం జరిగింది? వేర్వేరు ప్రపంచకప్‌లలో 9 స్వర్ణాలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలతో పాటు ప్రస్తుత వరల్డ్ నంబర్ 2 అయిన హరియాణా టీనేజర్ మనూ భాకర్‌పై ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మనూ కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్కోరు సాధించే మొత్తం 60 షాట్లు అందుబాటులో ఉంటాయి. ఆరు సిరీస్‌లలో కలిపి 75 నిమిషాల్లో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 షాట్లు ఆడిన తర్వాత ఆమె పిస్టల్ మొరాయించింది. ఈ 16 షాట్లను అద్భుతంగా వాడుకున్న భాకర్ స్కోరులో 10 పాయింట్ల షాట్లు 10... 9 పాయింట్ల షాట్లు 6 ఉండటం విశేషం. అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె సరైన దిశలోనే సాగింది. ‘పిస్టల్ కాకింగ్ లివర్ విరిగిపోయింది. ఇలాంటిది సాధారణంగా ఎప్పుడూ జరగదు. లివర్ మార్చాలంటే గ్రిప్, ట్రిగ్గర్ సర్క్యూట్ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. దీనిని సరి చేసిన తర్వాత సర్క్యూట్ పని చేయలేదు. దాంతో దానిని కూడా మార్చాల్సి వచ్చింది’ అని మనూ భాకర్ కోచ్ రోనక్ పండిట్ వివరించారు. నిబంధనల ప్రకారం షూటర్ల వ్యక్తిగత సమస్యకు ఎలాంటి అదనపు సమయం లభించదు. మనూ మళ్లీ తన స్పాట్ వద్దకు వచ్చి షూట్ చేసే సమయానికి మరో 38 నిమిషాలు మిగిలి ఉండగా, 44 షాట్లు పూర్తి చేయాల్సి ఉంది. దాంతో వేగం పెంచిన మనూ తన సామర్థ్యానికి తగినట్లుగా చివర్లో షూట్ చేయలేక 2 పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయింది. ముఖ్యంగా 60వ షాట్లో 10 పాయింట్లు స్కోర్ చేసి ఉంటే ముందంజ వేసే అవకాశం ఉండగా... 8 పాయింట్లు మాత్రమే సాధించింది. దీపక్, దివ్యాంశ్ విఫలం... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. బరిలోకి దిగిన ఇద్దరు షూటర్లు దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా... 622.8 పాయింట్లు సాధించిన దివ్యాంశ్ సింగ్ పన్వర్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్కీట్‌లో అవకాశం ఉందా! పురుషుల స్కీట్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు తొలి రోజు ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చారు. ఇదే పోటీ సోమవారం కూడా కొనసాగుతుంది. మొదటి రోజు అంగద్ సింగ్ అందుబాటులో ఉన్న 75 పాయింట్లలో 73 పాయింట్లు (24, 25, 24) సాధించి 11వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన రెండు సిరీస్‌లలో నేడు పోరాడతాడు. మరో భారత షూటర్ మేరాజ్ 71 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచాడు. మొత్తం ఐదు సిరీస్‌లు ముగిసిన అనంతరం టాప్–6 మాత్రమే ఫైనల్లోకి అడుగుపెడతారు. -
బెజవాడ విమానానికి తప్పిన భారీ ముప్పు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విమానాన్ని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే ఈ లోపం తలెత్తింది. అయితే పైలట్ అప్రమత్తంగా ఉండటం, లోపాన్ని గుర్తించడంతో వెంటనే ఏటీసీని సంప్రదించి మళ్లీ కిందకు దించేశారు. ఈలోపు దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ విమానంలో టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్, మోదుగుల వేణుగోపాల రెడ్డిలతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏఐ 544 నెంబరు గల ఈ విమానం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి టేకాఫ్ తీసుకుంది. తర్వాత పది నిమిషాల్లోనే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఏటీసీని సంప్రదించడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి రావడం.. ఇవన్నీ అయ్యేందుకు మరో 20 నిమిషాల సమయం పట్టింది. దాంతో 4.30 గంటలకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 81 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా పీఆర్వో చెప్పారు.