breaking news
Techie commits suicide
-
ఏ కష్టమొచ్చిందో!
♦ శృంగేరి వద్ద నదిలో దూకిన బ్యాంకు ఉద్యోగిని ♦ మైసూరులో ఇన్ఫోసిస్ టెక్కీ అనుమానాస్పద మృతి ♦ ఒకేరోజు రెండు విషాదాలు బొమ్మనహళ్లి/తుమకూరు/ మైసూరు: రాష్ట్రంలో ఒకేరోజు ఇద్దరు ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరులోని బసవేశ్వరనగరలోని హెచ్డిఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శిల్ప (26) అనే అమ్మాయి చిక్కమగళూరు జిల్లా శృంగేరి పుణ్యక్షేత్రం వద్ద తుంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శిల్ప స్వస్థలం తుమకూరు. ఐదేళ్లుగా ఆ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ పీజీ హాస్టల్లో ఉంటోంది. బుధవారం ఆమె బ్యాంకుకు వెళ్లకుండా, చిక్కమగళూరు సమీపంలోని ఉన్న శృంగేరికి వెళ్ళి అక్కడ దైవదర్శనం చేసుకుంది. అనంతరం దేవస్థానం సమీపంలోని తుంగా నదిలో దూకింది. వెంటనే అక్కడ ఉన్న పర్యాటకులు కాపాడటానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు సుమారు గంటకుపైగా గాలించగా, కిలోమీటర్ దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో సోదరుడు రాజశేఖర్ ఆమె ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. ఇంకా రాలేదని సిబ్బంది చెప్పారు. బ్యాంకుకు వెళ్లి అడగా, డ్యూటీకి రాలేదని చెప్పడంతో అనుమానంతో బుధవారం రాత్రి బసవేశ్వర నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆమె ఫోటోలను అన్ని పీఎస్‌లకు పంపారు. శృంగేరి పోలీసులు ఆమె ఆత్మహత్య విషయాన్ని బెంగళూరు పోలీసులకు తెలిపారు. ఆమె అవివాహిత, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి మైసూరులోని హెబ్బాళలో ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న మీనాక్షి (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై తేలింది. మీనాక్షి స్వస్థలం గుల్బర్గ. మైసూరులో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ హెబ్బాళలో ఉంటోంది. అయితే గత నాలుగు రోజులుగా మీనాక్షి డ్యూటీకి రాకపోవడంతో ఆమె స్నేహితులు మీనాక్షికి ఫోన్ చేయగా స్పందన లేదు. అదే సమయంలో గురువారం మీనాక్షి అద్దెకుంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు ప్రజలు హెబ్బాళ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు విరగ్గొట్టి చూడగా మీనాక్షి మృతదేహం కనిపించింది. ఆమె మరణంపై దర్యాప్తు సాగుతోంది. -
ప్రేమికురాలి ప్రాణం తీసిన 'సంప్రదాయం'
బెంగళూరు : వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను సంప్రదించారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. అయితే ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలన్న విషయంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం విషయంలో ఎంతకూ ఇరు కుటుంబ సభ్యులు రాజీకాలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమికురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వర్తూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన నిమిషా (28) స్థానిక కుందనహళ్లిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ)లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ మారతహళ్లి సమీపంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వివాహానికి ఇరు కుటుం బాల పెద్దలూ అంగీకరించారు. అయితే పెళ్లి తెలుగు సంప్రదాయంలో చేయాలని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు.. కాదు, కాదు బీహార్ సంప్రదాయంలోనే జరగాలని నిమిషా కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల వారు పట్టువీడకపోవడంతో సమస్య జఠిలమైంది. ఆఖరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిమిషా జీవితంపై విరక్తి చెందింది. బుధవారం రాత్రి తన చిన్నాన్న రంజిత్‌కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. సుమారు 15 నిమిషాల పాటు తన గోడును వెళ్లబోసుకుంది. కొద్దిసేపు తర్వాత రంజిత్‌కు అనుమానం వచ్చి నిమిషాకు ఫోన్ చేశాడు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించాడు. గురువారం మళ్లీ నిమిషాకు రంజిత్ ఫోన్ చేశాడు. అప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను నిమిషా ఉంటున్న హాస్టల్‌కు రావడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.