breaking news
Tata Consultancy Services Ltd
-
మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) స్టాక్ మార్కెట్లలో సంచలనానికి తెరలేపింది. బుధవారం ట్రేడింగ్‌లో షేరు బీఎస్ఈలో 2% లాభపడి రూ. 2,587 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక రికార్డు ధరకాగా, తద్వారా దేశీ కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి, కొత్త చరిత్రను సృష్టించింది. తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ. 5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా కొత్త రికార్డును లిఖించింది. ఇందులో విశేషమేమిటంటే... దేశీ ఐటీ రంగంలో తరువాతి స్థానాల్లో ఉన్న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ క్యాప్కంటే ఇది అధికం కావడ ం! ఇక టాటా గ్రూప్‌లోని ఇతర 16 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 3,06,334 కోట్లు మాత్రమే కావడం విశేషం! విశేషాలెన్నో... టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) మార్కెట్ క్యాప్‌లో 6% వాటాకు సమానం. దశాబ్దంక్రితం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్‌లో ఇది సగభాగం. 2004 జూలైలో ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 10 లక్షల కోట్లు. 2014 మే 9 - జూలై 23 కాలంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 83,000 కోట్లమేర పెరిగింది. 2009 మార్చిలో నమోదైన రూ. 52,700 కోట్లతో పోలిస్తే ప్రస్తుత విలువ 10 రెట్లు ఎగసింది. అక్టోబర్ 2009లో కంపెనీ సీఈవోగా ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టాక కంపెనీ మరింత వృద్ధి బాటలో సాగుతూ వచ్చింది. దేశీ ఐటీ సేవలకు ద్వితీయ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ ఆదాయం 2009-10లో రూ. 7,600 కోట్లు మాత్రమే ఎక్కువ. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆదాయం కంటే టీసీఎస్ టర్నోవర్ రూ. 20,000 కోట్లు అధికం. ఇదే విధంగా ఇన్ఫోసిస్ నికర లాభం కంటే టీసీఎస్ లాభం 2010లో రూ. 782 కోట్లు మాత్రమే అధికం. 2013-14లో ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ రూ. 8,300 కోట్లు అధికంగా నికర లాభాన్ని ఆర్జించింది. ఇన్ఫోసిస్ సిబ్బంది సంఖ్య సుమారు 1.6 లక్షలుకాగా, టీసీఎస్‌లో 3 లక్షలకుపైగా సిబ్బంది ఉన్నారు. విఖ్యాత మ్యాగజీన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచవ్యాప్త ఇన్నోవేటివ్ దిగ్గజాల జాబితాలో టీసీఎస్‌కు 40వ స్థానం లభించింది. టీసీఎస్ సంగతిదీ... 2004 ఆగస్ట్ తొలి వారంలో రూ. 850 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఆగస్ట్ 25న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. వాటాదారులకు రెండుసార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. 2006 జూలైలో ఒకసారి, 2009 జూన్‌లో మరోసారి వాటాదారుల వద్దనున్న ఒక్కో షేరుకి మరో షేరును ఫ్రీ(బోనస్)గా ఇచ్చింది. అంటే ఐపీవోలో రూ. 85,000 ఇన్వెస్ట్‌చేసి 100 షేర్లను కొనుగోలు చేసిఉంటే ప్రస్తుతం ఆ విలువ రూ. 11,54,800కు చేరి ఉండేది! ఎలాగంటే ఐపీవోలో లభించిన 100 షేర్లు 2006లో 200 షేర్లుగా మారి ఉండేవి. ఆపై 2009లో మరోసారి ఈ 200 షేర్లు 400 షేర్లు అయ్యేవి. వెరసి 400 షేర్లను ప్రస్తుత ధర రూ. 2,887 తో గుణిస్తే వచ్చే విలువ రూ. 11.54 లక్షలు!! కంపెనీలో ప్రమోటర్ల వాటా 74%కాగా, విదేశీ ఇన్వెస్టర్లకు వాటా 16.5%. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 64,673 కోట్లు కాగా.. నికర లాభం 18,475 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.5% వృద్ధి చెందగా, డాలర్ల రూపేణా 5.7% పుంజుకుంది. ఇదే కాలంలో మరో దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయం 2% మాత్రమే వృద్ధి చూపడం గమనార్హం. సాఫ్ట్వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఈ ఏడాది ఐటీ రంగం 13-15% పురోగమించగలదని అంచనా వేసింది. ఈ బాటలో ప్రస్తుత ఏడాదికి నాస్కామ్ అంచనాలను మించిన పనితీరును చూపగలమని టీసీఎస్ ప్రకటించగా, 7-9% వృద్ధిని సాధించగలమని ఇన్ఫోసిస్ అంచనా వేసింది. తొలి క్వార్టర్లో టీసీఎస్‌లో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 12%కు చేరగా, ఇన్ఫోసిస్‌లో ఇది 19%పైగా నమోదైంది. గతేడాది(2013-14)లో 100 మిలియన్ డాలర్ల క్లయింట్లు 24కు చేరారు. ఇన్ఫీ 13 మంది క్లయింట్లను పొందగా, విప్రోకు 10 మంది లభించారు. దేశీ ఐటీ సర్వీసుల ఆదాయంలో కేవలం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 40% వాటాను ఆక్రమిస్తుండటం విశేషం! అయితే గతేడాది డాలర్ల రూపేణా టీసీఎస్ 16% జోరు చూపగా, ఇన్ఫీ 11.5%, విప్రో 6.4% వృద్ధిని సాధించాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి టీసీఎస్ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. టర్నోవర్‌లో ఉత్తర అమెరికా వాటా 53%. బ్రెజిల్, ఉరుగ్వే, చిలీ, కొలంబియా, పెరూ, అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికా దేశాలలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఆఫ్రికాలో దేశాలలోనూ విస్తరణ పథంలో ఉంది. -
విప్రో ఫలితాలు ఓకే
బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో రూ.2,227 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 1,729 కోట్ల లాభంతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 29 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా వార్షికంగా 21.7 శాతం పెరుగుదలతో రూ.11,704 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.9,613 కోట్లుగా ఉంది. పరిశ్రమ విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.2,106 కోట్లుగా, ఆదాయాన్ని రూ.10,541 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)ను అంతంతమాత్రంగానే విప్రో ప్రకటించింది. డాలర్ రూపంలో 1.715-1.755 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువన 61.62గా పరిగణించి ఈ గెడైన్స్‌ను ఇచ్చింది. కాగా, క్యూ4లో ఆదాయం డాలర్ రూపంలో 1.72 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరిగింది. యూరప్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అమెరికాలో పటిష్టమైన వృద్ధి, మెరుగైన వ్యయ నిర్వహణ వంటివి ఫలితాల జోరుకు కారణాలుగా నిలిచాయి. సీక్వెన్షియల్‌గా: గతేడాది డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం రూ.2,015 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్లో లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 11,327 కోట్ల నుంచి 3.3 శాతం సీక్వెన్షియల్ వృద్ధిని నమోదు చేసుకుంది. పూర్తి ఏడాదికి ఇలా: 2013-14 పూర్తి ఏడాదిలో విప్రో నికర లాభం రూ,7,797 కోట్లకు ఎగబాకింది. 2012-13లో రూ.6,636 కోట్లతో పోలిస్తే 17.5% వృద్ధిచెందింది. మొత్తం ఆదాయం రూ.33,685 కోట్ల నుంచి రూ.43,755 కోట్లకు పెరిగింది. 16% వృద్ధి నమోదైంది. ఉత్పాదకత పెంపునకు అనుసరించిన మెరుగైన వ్యూహాలు, కాంట్రాక్టుల అమలు గడువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడం ద్వారా పటిష్టమైన ఫలితాలను సాధించగలిగామని విప్రో సీఈఓ టీకే కురియన్ చెప్పారు. ఇతర ముఖ్యాంశాలు.. ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ4లో రూ.10,619 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 24% చొప్పున పెరిగింది. పూర్తి ఏడాదికి ఈ విభాగం మొత్తం ఆదాయం 18% వృద్ధితో రూ.39,950 కోట్లకు ఎగసింది. క్యూ4లో కొత్తగా 59 మంది క్లయింట్లు జతయ్యారు. ఇందులో 5 మెగా డీల్స్ కూడా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి డివిడెండ్ మొత్తం రూ. 8కి చేరింది. మార్చి చివరినాటికి విప్రో ఐటీ సేవల వ్యాపారంలో సిబ్బంది సంఖ్య 1,46,053 మందిగా నమోదైంది. ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-8 శాతం, ఆన్సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెంపుదలకు అవకాశం ఉందని విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్) సౌరభ్ గోవిల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 2.39 శాతం ఎగబాకి రూ.586 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో టేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.