సమైక్యాంధ్ర కోసం పంచాయతీ తీర్మానం
తంపటాపల్లి (పాలకొండ రూరల్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం పాలకొండ మండలం తంపటాపల్లి పంచాయతీ నూతన పాలకవర్గం శనివారం ఏకగ్రీవంగా తీర్మానించింది. సర్పంచ్ చందక జగదీష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపసర్పంచ్ వంజరాపు రామకృష్ణ, సభ్యులు అల్లు సన్యాసినాయుడు, మిడితాన కనకం నాయుడుతో ఇతర సభ్యులు పాల్గొన్నారు. పాలకవర్గం ఆమోదంతో అద్దె భవనంలో పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేశారు. తొలి సమావేశంలో సమైక్యాంధ్రను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్‌కుమార్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో భారీ వర్షాలతో సుమారు 600 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములతో పాటు ఇతరుల పొలాల్లో వరి పంట నష్టపోయిందని, దీనికి తక్షణమే ప్రభుత్వం సాయమందించాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వీధి దీపాల పునరుద్ధరణ, రక్షిత పథకం నిర్వహణ తదితర అంశాలపై తీర్మానం చేశారు. గ్రామంలో ఉన్న పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అద్దె భవనంలో పంచాయతీ కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించారు. పంచాయతీ భవనం నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం సభ్యులతో పాటు గ్రామస్తులంతా భవనం ముందు నిలబడి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ ఉషారాణితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఉద్యోగుల మానవహారం
సీతంపేట : సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం ఐటీడీఏ ఉద్యోగులు రోడ్డుపై మానవహారం నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు ఐటీడీఏ నుంచి ర్యాలీగా వచ్చి గేటువద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్జీవో సంఘం డివిజన్ కార్యదర్శి రంగాచారి, ఐటీడీఏ మేనేజర్ గణపతిరావు, ఉద్యోగులు వై.సతీష్, శ్రీధర్‌పాత్రో, ముకుందరావు, మోహనరావు, ఆదినారాయణ, కామేశ్వరరావు, విష్ణువర్దన్ తదితరులు పాల్గొన్నారు.