breaking news
Tamasha movie
-
లేచి నిలబడితేనే గౌరవమా?
న్యూఢిల్లీ: భరత భూమిలో దేశభక్తి రసం ఉప్పొంగి పొరలుతోందనడానికి ముంబైలోని ఓ పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ‘తమాషా’ హిందీ చిత్రం ప్రదర్శన సందర్భంగా జరిగిన ఓ ఉదంతమే తార్కాణం. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన జాతీయ గీతం ‘జన గణ మన అధినాయక జయహే’ అన్న పాట వస్తున్నప్పుడు అందరు లేచి నిలబడడం దేశ సంస్కృతి సంప్రదాయమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం కూడా. దీన్ని ఉల్లంఘించి సీట్లోనే కూర్చున్న ఓ ముస్లిం యువ దంపతులను థియేటర్ నుంచే తరిమేశారు. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్ హల్చల్ చేస్తోంది. క్రికెట్ ద్వారా దేశభక్తిని పూసుకున్న సినీ నటి ప్రీతి జింటా కూడా 2014, అక్టోబర్ నెలలో ఓ సినిమా థియేటర్లో ఇలాగే హల్చల్ చేశారు. జాతీయ గీతం ఆలాపన వస్తున్నప్పుడు లేచి నిలబడడం, నిలబడక పోవడం తన ఇష్టమని ఆ ముంబై థియేటర్లో ఓ ముస్లిం యువకుడు వ్యాఖ్యానించడం మరోసారి వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దశాబ్దాల క్రితమే ఓ ముస్లిం యువకుడు తమ మతాచారానికి విరుద్ధం లేచి నిలబడడం అంటూ హైకోర్టులో వాదించడాన్ని కోర్టు కొట్టివేసింది. మత విశ్వాసాలు వేరు, దేశభక్తి వేరంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దేశభక్తి పేరిట వ్యక్తిగత విశ్వాసాలను దెబ్బతీయరాదని, ఈ విషయంలో సరైన చట్టాలు కూడా లేవని ఆ యువకుడి తరఫున తీర్పు వెలువరించింది. దేశభక్తి ఉందనడానికి నిలబడడం, నిలబడక పోవడం కొలమానం కాదని, దేశభక్తి లేనివాళ్లు కూడా నిలబడవచ్చని వ్యాఖ్యానించింది. దాంతో కొన్ని రాష్ట్రాలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం, నిలబడి జాతీయ జెండాకు వందన సమర్పణ చేయడం తప్పనిసరి చేశాయి. 2014, ఆగస్టులో తిరువనంతపురంలోని ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా సల్మాన్ అనే వ్యక్తి లేచి నిలబడనందుకు 124ఏ సెక్షన్ కింద దేశద్రోహం కేసు పెట్టింది. పాస్‌పోర్టును సీజ్ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో జాతీయ గీతాలాపన ఓ సంప్రదాయంగానే పాటిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఈ సంప్రదాయానికి చట్టబద్ధత ఉన్నప్పటికే శిక్షలంటూ పెద్దగా లేవు. కొన్ని దేశాలు అతి స్వల్ప జరిమానాలతో సరిపుచ్చుతున్నాయి. అమెరికాలో....... జాతీయ జెండాను చూపించినా, చూపించకపోయినా జాతీయ గీతాలాపన వస్తున్న వైపు మొఖం ఉండేలా నిలబడాలి. కుడిచేతిని గుండెపై పెట్టుకొని ఆలాపన ముగిసేవరకు నిలబడే ఉండాలి. అయితే ఎవరు నిలబడినా, నిలబడక పోయినా పట్టించుకోరు. శిక్షించేందుకు ఎలాంటి చట్టాలు లేవు. థాయ్‌లాండ్‌లో... ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సాయంత్రం ఆరు గంటలకు విధిగా టెలివిజన్‌లో జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తారు. విద్యా సంస్థల్లో ఉదయం 8 గంటలకు ప్రతిరోజు ప్రార్థనాగీతం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని తప్పకుండా వినిపిస్తారు. ఆ సందర్భంగా అందరూ నిలబడాల్సిందే. అయితే ఉల్లంఘించిన వారికి ఎలాంటి శిక్షలు లేవు. ఇటలీలో..... దేశాధ్యక్షుడు హాజరయ్యే ప్రజా సమావేశాల్లో, క్రీడా పోటీల్లో తప్పా మరెక్కడా, పాఠశాలల్లో కూడా జాతీయ గీతాన్ని ఆలపించరు. గీతాలాపన సందర్భంగా ఇలా ప్రవర్తించాలనే ఎలాంటి నిబంధనలు లేవు. అయితే విదేశీ జాతీయ గీతాలాపన సంఘటనల్లో మాత్రం గౌరవ సూచకంగా ఇటాలియన్లు నిలబడడం వారి సంస్కృతి. మెక్సికోలో అన్ని విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలల్లో ప్రతి సోమవారం జాతీయ జెండా ముందు జాతీయ గీతాలాపన చేస్తారు. విద్యార్థులు తెల్ల దుస్తులు ధరిస్తారు. ధరించకోపోయినా ఎలాంటి శిక్షలు ఉండవు. జపాన్ విద్యా సంస్థల్లో జాతీయ గీతాలాపన సందర్భంగా తప్పనిసరి నిలబడాలి. నిరసనలో భాగంగా నిలబడకపోతే మాత్రం విద్యార్థులకు జరిమానాలు, టీచర్లకు జీతాల్లో కోతలుంటాయి. ముఖ్యంగా స్నాతకోత్సవాల్లో జాతీయ గీతాన్ని గౌరవించాలి. పలుదేశాల్లో జాతీయ గీతాల పట్ల వివాదాలు ఉన్నట్లే మన జాతీయ గీతంపై కూడా వివాదం ఉన్న విషయం తెల్సిందే. ‘జన గణ మన అధినాయక జయహే, భారత భాగ్యవిదాత’ అని టాగూర్ రాసిందీ బ్రిటీష్ పాలకుడు నాలుగవ జార్జ్ కోల్‌కత రాక సందర్భంగా ఆయనను ఉద్దేశించి రాసిందన్నది వివాదం. ఏ వివాదాలు ఎలా ఉన్నా ‘దేశమును ప్రేమించుమన్నా మంచిఅన్నది పెంచుమన్నా.....దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న కవి సూక్తులు మరచిపోకుంటేచాలు. -
మాజీ ప్రేమికుల క్రేజీ తమాషా
అసలే రణ్‌బీర్ కపూర్ - దీపికా పదుకొనేలది హిట్ కాంబినేషన్. దానికి తోడు ఈ మాజీ లవర్స్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే అనిపిస్తుంది. అందుకే ‘తమాషా’ సినిమా పై బాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ నెలకొంది. ఈ నెల 27 నుంచి వెండితెరపై తమాషా చూపనున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు... * ఈ చిత్రానికి ముందు ‘విండో సీట్’ అనే టైటిల్ అనుకున్నారు. ఫైనల్‌గా ‘తమాషా’ అని పెట్టారు. * ‘బచ్నా ఏ హసీనో’, ‘ఏ జవానీ హై దీవాని’ చిత్రాల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేల కెమిస్ట్రీకి చాలా ప్రశంసలొచ్చాయి. ‘బచ్నా ఏ హసీనా’ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. అయితే ఎంతోకాలం వీళ్ల ప్రేమ సాగలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. వ్యక్తిగత జీవితానికీ, వృత్తి జీవితానికీ సంబంధం లేదంటూ, ‘ఏ జవానీ హై దీవానీ’లో కలిసి నటించారు. * ఈ చిత్రకథలో ఇంతియాజ్ అలీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలు ఉంటాయట. అయితే ఇది తన స్వీయ చరిత్ర కాదని ఇంతియాజ్ అంటున్నారు. మూడేళ్ల క్రితం ఆయన తన భార్య నుంచి విడిపోయారు. ఈ చిత్రంలో కూడా హీరో, హీరోయిన్ ఓ సందర్భంలో విడిపోతారట. జీవితంలో స్త్రీ ఎంత ముఖ్యం అనే అంశం మీద ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. * రణ్‌బీర్, దీపికలు మాజీ లవర్స్ కాబట్టి, వాళ్లతో సినిమా తీస్తే క్రేజ్ ఉంటుందని భావించే ఇంతియాజ్ ఈ జంటను ఎంపిక చేశారని బాలీవుడ్లో ప్రచారమవుతోంది. ఈ ప్రచారం నిజం కాదని ఇంతియాజ్ అన్నారు. ఈ కథ రాసుకున్నాక ‘వేద్’ పాత్రలో రణ్‌బీర్, ‘తార’గా దీపిక మాత్రమే కనిపించారని చెప్పారు. * ఇంతియాజ్ దర్శకత్వంలో రణ్‌బీర్ ‘రాక్‌స్టార్’ చిత్రంలో నటిస్తే, దీపికా ‘లవ్ ఆజ్ కల్’, ‘కాక్టైల్’ చిత్రాల్లో నటించారు. ఆ విధంగా ఇద్దరికీ ఇంతియాజ్‌తో మంచి అనుబంధం ఉంది. ‘తమాషా’ కథ నచ్చడంతో పాటు ఇంతియాజ్‌తో ఉన్న అనుబంధం కూడా ఈ ఇద్దరూ ‘తమాషా’కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఓ కారణం. * వేద్ వర్థన్ అనే కుర్రాడు, తారా మహేశ్వరి అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ‘‘పెద్దయ్యాక అదవ్వాలి.. ఇదవ్వాలి’ అంటూ కుటుంబ సభ్యులు చేసే ఒత్తిడికి తనేం కావాలో, తనకేం కావాలో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయి, కుంగిపోతాడు వేద్. అతన్ని ప్రోత్సహించి, అతని సత్తా ఏంటో తెలుసుకునేలా చేస్తుంది తార. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. * ఈ చిత్రం షూటింగ్ అంతా ఓ పిక్నిక్లా జరిగిందట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి ఏమేం కావాలో మొత్తం యూనిట్ సభ్యులందరూ చర్చించుకునేవారు. విదేశాల్లో షూటింగ్ జరిగినప్పుడు ఎవరెవరికి ఏమేం కావాలో రణ్‌బీర్, దీపికా ఓ పేపర్ మీద రాసుకుని, ఆర్డర్ చేసేవాళ్లట. చిత్రబృందం మొత్తం ఒకేచోట భోజనం చేసేవాళ్లు. దీనికోసం లొకేషన్లో పెద్ద భోజనం బల్ల ఏర్పాటు చేశారట. * తమాషా ఏంటంటే.. ఈ మధ్యకాలంలో ఏ చిత్రాన్నీ ప్రమోట్ చేయనంతగా రణ్‌బీర్, దీపికా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరూ విడివిడిగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మాత్రమే కాదు.. జాయింట్‌గా కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పబ్లిక్‌లో చాట్ బండార్ దగ్గర కలిసి పానీపూరీలు తిని, తమాషా చేస్తున్నారు. ప్రమోషనల్ కార్యక్రమాల కోసం ట్రైన్లో ఢిల్లీ వెళ్లారు. ఈ ఇద్దరి వ్యవహారం చూసి, ‘మళ్లీ లవ్‌లో పడినట్లున్నారు’ అని కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంచెం ఓవర్‌గానే పబ్లిసిటీ చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. ఏదేతైనేం సినిమాకి కావల్సినంత ప్రచారం వచ్చేసింది. * ఈ చిత్రం కోసం రొమాంటిక్ సాంగ్స్ తీసినప్పుడు రణ్‌బీర్, దీపికా బాగా లీనమైపోయేవారట. ఆలింగనం చేసుకునే సన్నివేశాల్లో అయితే షాట్ ఓకే అనిపించి, ఇంతియాజ్ ‘కట్’ చెప్పినా విడిపోయేవాళ్లు కాదట. కాసేపు అలానే ఉండి, సీన్ బాగా చేసినందుకు ఇద్దరూ భేష్ అనుకుంటూ భుజాలు తట్టుకునేవాళ్లట. * ఈ చిత్రం ఫొటోల్లో రణ్‌బీర్, దీపికాల మధ్య కెమిస్ట్రీ చూసి ‘అదిరిపోయింది’ అంటున్నారు. ప్రమోషనల్ కార్యక్రమాల్లో హగ్గులు, కిస్సులు చేసుకోవడం చూసి, సినిమాలో ఓ రేంజ్లో కెమిస్ట్రీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కుర్రకారు ‘తమాషా’ చూసే తీరాలనుకుంటున్నారు. దాదాపు 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సాజిద్ నడియాడ్వాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కూడా భారీ వసూళ్లు కురిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. * ఇప్పటివరకు వచ్చిన హిందీ చిత్రాల్లో పొడవాటి ముద్దు సీన్ ఉన్న చిత్రం ఇదేనని సెన్సార్ సభ్యులు అన్నారట. ఈ చిత్రం నిడివి రెండు గంటల 19 నిమిషాలు.